TG News: భద్రాధ్రికొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ విషాదకర సంఘటన ములకలపల్లి మండలం సీతారాంపురం ముర్రేడు వాగు బ్రిడ్జి వద్ద స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటోని కారు ఢీ కొట్టడంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆటోడ్రైవర్ సహా మరో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు పాల్వంచ పట్టణంలోని DAV, త్రివేణి, రెజీనా పాఠశాలలకు చెందిన వారిగా గుర్తించారు. మృతిచెందిన విద్యార్థి డీఏవీ స్కూల్లో ఆరోతరగతి చదువుతున్న ఈశ్వర్‌గా గుర్తించారు. క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వాస్పత్రికి స్థానికులు తరలించారు.
అనుకోని ఈ ప్రమాదంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు ఏం జరిగిందో తెలిసేలోగానే పిల్లలంతా చెల్లాచెదురుగా పడ్డారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కారులో మద్యం బాటిళ్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఐదుగురు విద్యార్థులు గాయపడటంతో 108 వాహన సహాయంతో ఆస్పత్రికి తరలించారు. వీరంతా ప్రతిరోజు ములకలపల్లి మండలం పూసగూడెం, సుబ్బనపల్లి, వికె రామవరం గ్రామాల నుంచి పాల్వంచ వెళ్లి చదువుకునే విద్యార్థులు. ఈ ప్రమాదంలో గాయపడిన వారంతా పాల్వంచ పట్టణ పరిధిలోని డిఏవి, త్రివేణి, రెజీనా పాఠశాలలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
గాయపడిన వారి అర్తనాథాలతో ఆస్పత్రిలో బీతావాహక వాతావరణం ఏర్పడింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం అంత చిత్తుకాగా, ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో పూసగూడెం గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థి రచ్చ ఈశ్వర్ (12)గా గుర్తించారు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు రోదన ఆపటం ఎవరివల్లా కావటం లేదు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.