తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు

తెలంగాణలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలైంది. మరో నాలుగు నెలలు ఉన్నా సరే అప్పుడే పార్టీలన్ని ప్రచార యుద్ధంలోకి దిగాయి. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయ చదరంగంలోకి దూకాయి. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ స్టార్ అయింది.

New Update
తెలంగాణలో మొదలైన ఎన్నికల వార్.. సై అంటే సై అంటున్న పార్టీలు

Telangana Elections: తెలంగాణలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఇప్పటి నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో దిగాయి. సై అంటే సై అంటూ రంకలు వేస్తున్నాయి. ఈసారి మాదే గెలుపు అంటూ సవాళ్లు విసురుతున్నాయి. ప్రజా యుద్ధానికి అవసరమైన అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో లాగా కాకుండా ఈసారి ఎన్నికలు హోరాహోరిగా ఉండనున్నాయి. రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై వచ్చే సాధారణ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్షాలు రెడీ అయ్యాయి. అయితే ఇదే సమయంలో ఆ వ్యతిరేకత తగ్గించేందుకు గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ (BRS Party):

తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత రెండు ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ సత్తా చాటి అధికారంలో కొనసాగుతూ వస్తోంది. ముచ్చటగా మూడో సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఊవిళ్లూరుతోంది. అందుకు అన్ని అస్త్రాలను సిRద్ధం చేసుకుంటుంది. సాధారణంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకతను అధిగమించేందుకు ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే అన్ని వర్గాలను ఆకట్టుకునే దిశగా గులాబీ బాస్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షాలకు ఊపిరి ఆడనీయకుండా వరుస ప్రకటనలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేలా కృషిచేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తి సీనియర్ నాయకులకు గాలం వేస్తున్నారు. గెలవడానికి ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఒడిసిపట్టుకుంటున్నారు. ప్రతిపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వారికి చెక్ పెట్టేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఇతర పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ (Congress Party)

మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కృతనిశ్చయంతో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లో ఆ పార్టీపై కొంత సానుభూతి ఉంది. కానీ నాయకుల మధ్య ఐక్యత లేకపోవడంతో ఆ సానుభూతిని ఓట్లగా మల్చుకోవడంలో గత రెండు పర్యాయాలు విఫలమైంది. అయితే రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడిగా అయిన దగ్గరి నుంచి కాంగ్రెస్ క్యాడర్‌లో ఫుల్ జోష్ వచ్చింది. కేసీఆర్‌తో పాటు ప్రభుత్వ పెద్దలపై తనదైన శైలిలో ఘాటు విమర్శలు చేస్తూ పార్టీకి మైలేజ్ తీసుకువచ్చారు. అలాగే నేతల పాదయాత్రలు కూడా కలిసివచ్చాయి. ఇదే సమయంలో సీనియర్ నేతలు తమ మధ్య విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ప్రభుత్వంపై కొట్లాడుతున్నారు. ఇది మంచి శుభపరిణామంగా మారి కార్యకర్తల్లో నూతనోత్సాహం తెచ్చింది. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌లో కొత్త కళ వచ్చింది. ఇతర పార్టీల్లో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు హస్తం కండువా కప్పుకునేందుకు ముందుకు వచ్చారు. దీంతో కేసీఆర్ సర్కార్‌ను ఓడించి రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా పాతేందుకు సిద్ధమైంది.

బీజేపీ పార్టీ (BJP Party)

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా సై అంటే సై అంటోంది. మొన్నటి వరకు బీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని ప్రజల్లో బలంగా తీసుకెళ్లింది. గ్రేటర్ ఎన్నికలతో పాటు దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో గెలవడంతో కాషాయం పార్టీలో జోష్ వచ్చింది. మరోవైపు అధ్యక్షుడిగా బండి సంజయ్ కేసీఆర్ కుటుంబంపై ఘాటైన విమర్శలు చేస్తూ వచ్చారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమంటూ క్యాడర్‌లో బలం నింపారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడిపోవడంతో ఇక్కడ కూడా కమలం పార్టీ వెనకబడిపోయింది. చేరికలు ఆగిపోవడంతో పార్టీ కార్యకలాపాలు స్తబ్దుగా మారిపోయాయి. ఇదే సమయంలో బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్షుడిగా మార్చి కిషన్ రెడ్డికి అప్పగించడం జరిగిపోయింది. అయితే పార్లమెంట్ సమావేశాలు జరిగిన తర్వాత మళ్లీ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. జాతీయ నాయకులతో వరుస పర్యటనలు చేయించి క్యాడర్‌లో జోష్ పెంచేందుకు ప్లాన్ చేస్తోంది.

అటు ఇతర పార్టీలు టీడీపీ వైసీటీపీ, వామపక్షాలు కూడా తమ పరిధిలో సత్తా చాటాలని భావిస్తున్నాయి. అయితే ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్‌లో వైసీటీపీ విలీనం దిశగా చర్చలు జరుగుతున్నాయి. వామపక్షాలు బీఆర్‌ఎస్‌తో కలవడానికి ప్రయత్నిస్తున్నా.. అటు నుంచి స్పందన లేదు. దీంతో కాంగ్రెస్‌తో కలిసేందుకు సిద్ధమంటూ లీకులు ఇస్తున్నాయి. మొత్తానికి నాలుగు నెలల ముందే తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది.

Also Read: స్పీడ్ పెంచిన టీకాంగ్రెస్.. అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!

Advertisment
తాజా కథనాలు