/rtv/media/media_files/2025/08/14/weight-loss-injections-2025-08-14-20-04-36.jpg)
Weight Loss Injections
ఆధునిక జీవనశైలి(Life Style) లో ఫిట్‌గా ఉండటం ఒక ట్రెండ్‌గా మారింది. బరువు తగ్గించుకోవడానికి చాలామంది జిమ్‌లలో గంటల తరబడి చెమటోడుస్తున్నారు. మరికొందరు కఠినమైన డైటింగ్‌ను అనుసరిస్తున్నారు. అయితే త్వరగా బరువు తగ్గించుకోవాలని ఆశించే కొంతమంది ఔషధాలు, ఇంజెక్షన్‌లను ఆశ్రయిస్తున్నారు. డయాబెటిస్, ఊబకాయం చికిత్సలో ఉపయోగించే ఓజెంపిక్, వెగోవి, మౌంజారో వంటి ఇంజెక్షన్‌లు ప్రస్తుతం బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిని GLP-1 అగోనిస్ట్‌లు అని పిలుస్తారు. ఇవి శరీరంలో హార్మోన్ల మాదిరిగా పనిచేసి.. ఆకలిని తగ్గించి, బరువును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే ఈ ఇంజెక్షన్‌లు వాడే వారిలో కళ్లకు సంబంధించిన కొన్ని తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆ విషయాల గురించి కొన్ని ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఇంజెక్షన్‌లతో కళ్లకు ప్రమాదం..
కొత్త పరిశోధనల ప్రకారం.. ఈ ఇంజెక్షన్(Injection) లు తీసుకునే వారిలో నాన్-ఆర్టెరిటిక్ ఆంటీరియర్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతి (NAION) లేదా ఐ స్ట్రోక్ అనే తీవ్రమైన కంటి వ్యాధి వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ వ్యాధిలో కంటి నరాలకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా తగ్గిపోయి. నొప్పి లేకుండానే చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో జరిగిన ఒక అధ్యయనంలో సెమగ్లూటైడ్ అనే GLP-1 ఔషధం తీసుకునే డయాబెటిస్ రోగులలో ఈ ప్రమాదం నాలుగు రెట్లు, బరువు తగ్గడం కోసం వాడే వారిలో ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడైంది.
ఇది కూడా చదవండి: ఫ్లష్ చేసిన తర్వాత మలం తేలితే డేంజర్.. ఆ షాకింగ్ వ్యాధి ఉన్నట్లే!
అయితే ఇటీవల జరిగిన మరో అధ్యయనంలో ఈ ప్రమాదం అంత ఎక్కువగా లేదని.. కేవలం 0.04 శాతం మందిలో మాత్రమే NAION కనిపించిందని తేలింది. అయినప్పటికీ ఈ మందులు వాడే వారు తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం, దృష్టిలో ఏదైనా మార్పులు గమనిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే రక్తపోటు, షుగర్, కొలెస్ట్రాల్‌లను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏదేమైనా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఈ ఇంజెక్షన్‌లను వాడటం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: మీ కిడ్నీలు సరిగా పని చేస్తున్నాయా? లేదా? ఈ సింపుల్ టిప్స్‌తో తెలుసుకోండి!