Leopards Trouble: ఉత్తరప్రదేశ్ ప్రజలను తోడేళ్ళు, చిరుతలు పీక్కుతింటున్నాయి. ఇప్పటికే తోడేళ్ళను పట్టుకోవడానికి నానాపాట్లు పడుతున్నారు అధికారులు. ఇప్పుడు చిరుతలు కూడా అటాక్ చేస్తున్నాయి. బిజ్నోర్ సమీపంలో 500వరకు చిరుతలు ఉన్నాయని యూపీ అటవీ శాఖ అధికారులు అంటున్నారు. బిజ్నోర్కు చెందిన పిలానా ప్రాంతంలో మొన్నటి వరకూ హాయిగా ఉండేవారు.. కానీ ఇప్పుడు వారంతా సాయంత్రం ఐదు కాగానే ఇంటికి చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మా ఊరికి 15 కి.మీ.దూరంలో దట్టమైన అడవిలో చిరుతలు ఉంటాయి. అది మాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ 2023లో మా ప్రాంతంలో జరిగిన చిరుతదాడితో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆ దాడులు సర్వసాధారణమవడంతో మా జీవనశైలి తారుమారయిందని స్థానికులు చెబుతున్నారు.
అయితే ఇది కేవలం ఒక్క గ్రామం పరిస్థితి మాత్రమే కాదు. సుమారు 85 గ్రామాలను ఇదే సమస్య ఉందని చెబుతున్నారు అధికారులు. అందుకే వీటిని హైపర్ సెన్సిటివ్ కేటగిరీలో చేర్చారు అధికారులు. ఇవన్నీ అడవికి 8 కి.మీ నుంచి 15 కి.మీ దూరంలోనే ఉన్నాయి. వాటిని బంధించేందుకు మొత్తం 107 కేజ్లను ఏర్పాటు కూడా చేశారు. అయితే చిరుత పులులు తెలివిగా ఉన్నాయి. పంజరాల్లో పడటం లేదు. అందుకే అధికారులు పొలాలకు వెళ్లేప్పుడు ఒక్కరే వెళ్లొద్దని, ఫోన్లు, రేడియోల్లో పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. చీకట్లో బయటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇన్ని చేస్తున్నా..ఆగస్టు 29న మరో వ్యక్తి మ్యాన్ ఈటర్ చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.దీంతో ఏడాదిన్నర కాలంలో చిరుతల దాడిలో మరణించిన వారి సంఖ్య25కు చేరింది.
Also Read: Uttar Pradesh: తోడేళ్ళతోనే చస్తుంటే..ఇప్పుడు చిరుతలు ఎంటర్