The Debate: అమెరికాలో అధ్యక్ష ఎన్నికల హంగామా పీక్స్ కి చేరుకుంది. నవంబర్ 5 న, అమెరికన్ ప్రజలు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి ఓటు వేయనున్నారు. అంటే ఎన్నికలకు దాదాపు రెండు నెలల సమయం ఉంది. ఈ నేపథ్యంలో డెమొక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఇద్దరూ వారి మొదటి ముఖాముఖి అధ్యక్షా చర్చలో పాల్గొన్నారు. అమెరికా ప్రజలతో పాటు యావత్ ప్రపంచం చూపు ఈ డిబేట్పైనే నిలిచింది. ఈ డిబేట్ కమల, ట్రంప్‌ల మధ్య జరిగిన మొదటి డైరెక్ట్ డిబేట్ కాగా, దీని తర్వాత రెండో డిబేట్ జరిగే అవకాశం లేదు. నిజానికి 2020 లో లానే, ఈ ఎన్నికలు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ – అధ్యక్షుడు జో బిడెన్ మధ్య జరగాల్సి ఉంది. అయితే ఆరోగ్య కారణాలతో బిడెన్ ఎన్నికల బరి నుండి నిష్క్రమించిన తరువాత, కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా అవుతారా? లేకపోతే కమలా హారిస్ అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా గెలుస్తారా? అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు అధ్యక్షా అభ్యర్థుల మధ్య జరిగిన ఈ చర్చను పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియాలో ABC న్యూస్ నిర్వహించింది. దాదాపు 90 నిమిషాలకు పైగా ఈ చర్చ జరిగింది. ఈ చర్చలో పలు అంశాలపై ఇద్దరి మధ్య వాడీ.. వేడీ వాదనలు జరిగాయి. వారి చర్చలో ముఖ్యాంశాలు ఇవే.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై..
- ట్రంప్
The Debate: తాను రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నానని, మరింత మంది అమాయకుల ప్రాణాలు పోవాలని కోరుకోవడం లేదని ట్రంప్ అన్నారు. పుతిన్, జెలెన్స్కీ ఇద్దరితోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపకపోతే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. - కమలా హారిస్..
పుతిన్‌తో ట్రంప్ స్నేహంపై కమలా హారిస్ మాట్లాడుతూ.. నియంతతో ఎవరైనా ఎలా స్నేహం చేస్తారని అన్నారు. ఉక్రెయిన్ను అన్ని విధాలుగా రక్షించుకునేందుకు తాము సహకరించామని చెప్పారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే, పుతిన్ కీవ్‌లో కూర్చునేవారన్నారు. తాము ఉక్రెయిన్ను రక్షించామని చెప్పారు.
ఇజ్రాయేల్ యుద్ధంపై..
- కమలా హారిస్:
The Debate: గాజాలో ఇప్పటికే 40 వేల మంది మరణించినందున, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఎలా ఆపుతారని కమలా హారిస్‌ను అడిగిన ప్రశ్నకు జవాబుగా “అక్టోబర్ 7న దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ అనే ఉగ్రవాద సంస్థ హతమార్చిందని” కమల తెలిపారు. తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉందని, అయితే పాలస్తీనాలోని మానవతా సంక్షోభాన్ని కూడా గమనిస్తున్నామని, కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రయత్నిస్తున్నామని ఆమె అన్నారు. రెండు రాష్ట్రాల ఒప్పందంతో కూడిన సురక్షితమైన ఇజ్రాయెల్ కావాలని ఆమె అన్నారు. - ట్రంప్
ఈ విషయంలో కమలాపై మాటల దాడి చేసిన ట్రంప్.. మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇరాన్ వద్ద డబ్బులు లేవని అన్నారు. ఇప్పుడు ఆ దేశం దగ్గర డబ్బు ఉంది. అతను ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థలను ఉపయోగిస్తున్నాడు. కమలా అధ్యక్షురాలైతే రెండేళ్లలో ఇజ్రాయెల్ సర్వనాశనం అవుతుందన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ట్రంప్ పై కమల దాడి..
The Debate: ట్రంప్ హయాంలో జరిగిన ఆఫ్ఘన్ తాలిబాన్ ఒప్పందంపై కమల హారిస్ మాట్లాడుతూ.. ట్రంప్ తనను తాను డీల్ మేకర్ అని పిలుచుకుంటున్నారని, అయితే ఆఫ్ఘనిస్థాన్‌లో బలహీనమైన ఒప్పందం కుదుర్చుకుని ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి తాలిబాన్ వంటి ఉగ్రవాద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు అనుమతించారని అన్నారు.
ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు..
The Debate: ట్రంప్ తన ప్రభుత్వంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలాన్ని నొక్కిచెప్పారు అంతేకాకుండా, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కమలానికి ఎటువంటి విధానం లేదని అన్నారు. బిడెన్ ప్రభుత్వం అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది. దీనిపై కమల మాట్లాడుతూ తాము జో బిడెన్ కాదు అలానే ట్రంప్ కాదని, తమ వద్ద కొత్త ప్లాన్లు ఉన్నాయని, వాటిని ఎందుకు చర్చించడం లేదని అన్నారు.
తనకు ఆరోగ్య సంరక్షణ ప్రణాళిక లేదని అంగీకరించిన ట్రంప్
అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించిన ప్రశ్నపై, మాజీ ప్రెసిడెంట్ అమెరికన్ హెల్త్ కేర్ సిస్టమ్ ACAపై నడుస్తుందని విమర్శించారు. ఇది కొన్ని రాయితీలు.. బీమాతో పాటు ఎక్కువగా ప్రైవేట్ బీమాపై నడుస్తుంది. అయితే ఆరోగ్య సంరక్షణను చౌకగా- మెరుగైనదిగా చేయాలనే ప్రణాళిక ఉంటేనే తాను ఏసీఏను రద్దు చేస్తానని ట్రంప్ చెప్పారు. “మాకు ఇంకా ఎటువంటి విధానం లేదు, నాకు కాన్సెప్ట్ ఉంది, కానీ నేను ఇంకా అధ్యక్షుడిని కాదు” అని అతను చెప్పాడు.
వ్యక్తిగత ఆరోపణలు..
The Debate: కమలా హారిస్ ప్రాసిక్యూటర్‌గా ఉన్నప్పుడు డబ్బు కోసం ప్రజలను జైలు నుంచి బయటకు తీసుకెళ్లారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ట్రంప్ ర్యాలీలు ఆసక్తికరంగా ఉన్నందున వాటిని చూడటానికి వెళ్లాలని కమల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ట్రంప్ తన అవసరాలు, అతని కలలు.. అతని ఆశల గురించి మాట్లాడటం మీరు ఎప్పుడు వినలేరు. ఎందుకంటే, అతని ప్రసంగాలు అర్ధంలేనివి అంటూ కమల చెప్పారు.
కేసులున్నవారే..
ట్రంప్‌ను ఉద్దేశించి కమలా హారిస్ మాట్లాడుతూ.. ఎవరిపై కేసులు పెండింగ్‌లో ఉన్నారో వారే నేరాలను తగ్గించాలని మాట్లాడుతున్నారని అన్నారు. అమెరికాలో పెరిగిన హింసపై డోనాల్డ్ ట్రంప్ హారిస్ – బిడెన్ ప్రభుత్వాలను లక్ష్యంగా చేసుకున్నారు. దీనికి కమల ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
అబార్షన్‌ను నిషేధంపై..
The Debate: అబార్షన్‌ను నిషేధించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారని హారిస్ ఆరోపించారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ అబార్షన్ హక్కును రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ సమస్యను రాష్ట్రాలకు తిరిగి ఇచ్చిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “నేను అబార్షన్ నిషేధంపై సంతకం చేయడం లేదు,” అని చెప్పిన ట్రంప్ జాతీయ గర్భస్రావ నిషేధం అవసరం లేదని చెప్పారు.
కమలా హారిస్ మార్క్సిస్టు!
కమలా హారిస్ మార్క్సిస్టు అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆమె తండ్రి మార్క్సిస్ట్. ఆమెకు మార్క్సిస్టు విధానానికి సంబంధించిన మంచి విద్యను అందించాడు. ఈ పిచ్చి విధానంతో మన దేశాన్ని నాశనం చేశారు అంటూ కమలపై విరుచుకు పడ్డారు ట్రంప్.
చైనా విషయంలో పరస్పర ఆరోపణలు..
చైనాకు సంబంధించి బిడెన్ విధానంపై చర్చలో ట్రంప్ పదే పదే కమలంపై విరుచుకుపడుతున్నారు. దీనిపై కమల మాట్లాడుతూ చైనాకు చిప్స్ ఇస్తున్నది మీ ప్రభుత్వమేనని అన్నారు.
మొత్తంగా చూసుకుంటే, ట్రంప్-కమల హరిస్ ఎక్కడ తగ్గలేదు. ఇద్దరూ తమదైన వాదనలతో.. ఆరోపణలతో చర్చ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించారు. ఎన్నికల లోపు మరో డిబేట్ వీరిమధ్య జరిగే అవకాశం తక్కువగా ఉంది. దీంతో.. ఈ డిబేట్ ను వినియోగించుకోవాలని ఇద్దరూ గట్టిగా ప్రయత్నించడం కనిపించింది. ఇద్దరి మధ్య జరిగిన డిబేట్ ఇప్పుడు అమెరికాలో ప్రజల మధ్య చర్చను రేకెత్తిస్తుంది. ఈ డిబేట్ లో ఎవరు అమెరికా ప్రజల మనసు గెలిచారో తెలుసుకోవాలంటే.. ఎన్నికలు పూరయ్యేవరకూ ఎదురు చూడాల్సిందే.