/rtv/media/media_files/2025/08/21/mosquitoes-bite-animals-2025-08-21-14-10-45.jpg)
Mosquitoes Bite Animals
వర్షాకాలం రాగానే దోమల బెడద ఎక్కువవుతుంది. దోమలు మనుషులను కుట్టి డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. అయితే దోమలు జంతువులను కూడా కుడతాయి. మరి వాటికి కూడా ఈ వ్యాధులు వస్తాయా..? ఈ డౌట్ చాలా మందిలో ఉంటుంది. అయితే ప్రశ్నకు సమాధానాలు పరిశోధనల ద్వారా వెల్లడయ్యాయి. ఆడ దోమలు గుడ్లు పెట్టడానికి అవసరమైన పోషకాల కోసం రక్తాన్ని పీల్చుకుంటాయి. ఈ రక్తం మనుషుల నుంచి మాత్రమే కాకుండా.. ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లులు, గుర్రాలు, పక్షులు, పాకే జీవుల నుంచి కూడా తీసుకుంటాయి. అంటే మనుషులతోపాటు జంతువులు కూడా దోమల లక్ష్యంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
జంతువులకు డెంగ్యూ వస్తుందా..?
యూరోపియన్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ (Europe PMC) లో ప్రచురించబడిన ఓ అధ్యయనం ప్రకారం.. చాలా పెంపుడు, అడవి జంతువులలో డెంగ్యూ వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీ బాడీలు కనుగొనబడ్డాయి. ఇది ఆ జంతువులు డెంగ్యూ వైరస్‌కు గురయ్యాయని సూచిస్తుంది. దాదాపు 34 శాతం పందులలో డెంగ్యూ యాంటీ బాడీలు ఉన్నాయని,11 శాతం పక్షులలో దోమలకు వ్యతిరేకంగా యాంటీ బాడీలు ఉన్నాయని, 4 శాతం పెంపుడు జంతువులై ఆవులు, మేకలలో యాంటీబాడీలు ఉన్నట్లు, కుక్కలలో ఇది 1.6 శాతం ఉందని వారి సర్వే తేలింది. అయితే ఈ జంతువులలో వ్యాధి లక్షణాలు మనుషులలో కనిపించినట్లుగా కనిపించవు. అలాగే అవి ఈ వైరస్‌ను మరింత వ్యాప్తి చేయగలవా అనేది ఇంకా స్పష్టంగా తెలియదు.
ఇది కూడా చదవండి: ఈ మూడు అలవాట్లు ఎక్కువ డేంజర్.. నిపుణుల అభిప్రాయాలు తెలుసుకోండి..!!
మలేరియా అనాఫిలిస్ (Anopheles) దోమల ద్వారా వ్యాపిస్తుంది మరియు దీని ప్లాస్మోడియం (Plasmodium) ప్రధానంగా మనుషులను మాత్రమే ప్రభావితం చేస్తుంది. మలేరియా దోమలు జంతువులను కుట్టినా.. ఈ వైరస్ వాటిలో ఎక్కువ కాలం జీవించలేదని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే మలేరియా ప్రమాదం మనుషులలో ఎక్కువగా ఉంటుంది. చికెన్‌గున్యా ఈడెస్ ఈజిప్టి (Aedes aegypti), ఈడెస్ అల్బోపిక్టస్ (Aedes albopictus) దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ దోమలు జంతువులను కుట్టినప్పటికీ.. పెంపుడు జంతువులకు చికెన్‌గున్యా వస్తుందని ఇప్పటివరకు నిరూపించబడలేదు. ఈ వ్యాధి దాదాపు పూర్తిగా మనుషులకే వస్తుంది. అయితే దోమలు జంతువులలో వ్యాప్తి చేయగల కొన్ని ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి. వాటిల్లో జపనీస్ ఎన్సెఫలైటిస్ ఒకటి. ఇది ముఖ్యంగా పందులు, కొన్ని పక్షులలో కనబడుతుంది. దోమలు దీన్ని మనుషులకు కూడా వ్యాప్తి చేయగలవు. రెండోవది వెస్ట్ నైల్ వైరస్. ఇది ఆవులు, మేకలు, గుర్రాలు, ఒంటెలు, పక్షులలో కనుగొనబడింది. దోమలు మనుషులతోపాటు జంతువులను కూడా కుడతాయి. కొన్ని జంతువులలో డెంగ్యూ వంటి వ్యాధుల యాంటీబాడీలు కనిపించినప్పటికీ.. అవి మనుషులలాగా తీవ్రంగా అనారోగ్యానికి గురవుతాయని అర్థం కాదు. మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధులు జంతువులలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే.. జపనీస్ ఎన్సెఫలైటిస్, వెస్ట్ నైల్ వైరస్ వంటి వ్యాధులు జంతువులలో ఉండి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పెదాల పగులుతో ఇబ్బందిగా ఉందా..? అయితే విటమిన్ల లోపం ఉందేమో చెక్ చేసుకోండి!!