/rtv/media/media_files/2025/08/23/drinking-water-2025-08-23-06-51-29.jpg)
drinking water
మన శరీరం 60-70 శాతం నీటితో రూపొందించబడింది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, జీర్ణక్రియను సక్రమంగా నడిపించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది రోజుకు సరిపడినంత నీరు తాగడం లేదు. దీని వలన డిహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఈ సమస్య చాలా నెమ్మదిగా మొదలవుతుంది. కాబట్టి ప్రారంభ దశలో మనం దీన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ శరీరంలో నీటి లోపం గురించి మన శరీరం కొన్ని స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. ఆరోగ్యానికి ప్రమాదకరమైన ఈ లక్షణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతాలు:
తరచుగా తలనొప్పి: డిహైడ్రేషన్ వల్ల మెదడుకు రక్త ప్రసరణ సరిగా జరగదు. దీనివల్ల తరచుగా తలనొప్పి, మైకం వస్తాయి.
చర్మం పొడిబారడం: శరీరంలో నీటి శాతం తగ్గితే.. చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన సంకేతం.
విపరీతమైన అలసట: నీటి లోపం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు తగ్గిపోయి. కొద్దిగా పని చేసినా అలసట, బలహీనత కలుగుతాయి.
మూత్రం రంగులో మార్పు: సాధారణంగా మూత్రం రంగు లేతగా, పారదర్శకంగా ఉంటుంది. కానీ నీటి లోపం ఉన్నప్పుడు.. మూత్రం పసుపు, ముదురు పసుపు రంగులోకి మారుతుంది.
నోరు, పెదాలు పొడిబారడం: శరీరానికి తగినంత నీరు అందకపోతే నోరు, పెదాలు పొడిబారడం లేదా పగుళ్లు రావడం జరుగుతుంది.
కండరాల తిమ్మిరి: శరీరంలో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతినడం వల్ల కండరాలలో తిమ్మిరి లేదా నొప్పి రావచ్చు.
ఇది కూడా చదవండి: మారుతున్న వాతావరణంలో రోగాలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తెలుసుకోండి!!
డిహైడ్రేషన్ అనేది శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల వచ్చే సమస్య. డిహైడ్రేషన్ నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన మార్గాలున్నాయి. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు కనీసం 7-8 గ్లాసుల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది. లేదా పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీరు వంటి నీరు ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. డీహైడ్రేషన్ నివారణకు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ సమస్యను నివారించడానికి.. రోజూ తగినంత నీరు తాగడం, పండ్ల రసాలు, నిమ్మరసం, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకోవడం అవసరం. అలాగే.. శరీరం అధికంగా వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ORS తీసుకోవాలి. చిన్న చిన్న జాగ్రత్తలతో డిహైడ్రేషన్‌ని సమర్థవంతంగా నివారించవచ్చు.
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సన్నగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లేనా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?