/rtv/media/media_files/2025/11/19/buttermilk-2025-11-19-18-45-28.jpg)
Buttermilk
భోజనం తర్వాత మజ్జిగ (Buttermilk) తాగడం మన ఇళ్లలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇది శరీరాన్ని చల్లబరచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మజ్జిగను ప్రతిరోజూ తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ, కాలేయం, మూత్రపిండాలు, గుండె, చర్మంపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్, విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్స్, ఎంజైములు శరీరాన్ని లోపలి నుంచి శుద్ధి చేస్తాయి. మంటను తగ్గిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగతో ఏ వ్యాధులు నయమవుతాయి..? ఎప్పుడు తాగకూడదో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.మజ్జిగతో నయమయ్యే వ్యాధులు:
గ్యాస్, అసిడిటీ-మలబద్ధకం: మజ్జిగ తక్షణమే జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ కడుపులోని ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేసి గ్యాస్, గుండెల్లో మంటను (Heartburn) తొలగిస్తుంది. మజ్జిగను క్రమం తప్పకుండా తాగడం వలన మలబద్ధకం కూడా తగ్గుతుంది.
పొట్టలో మంట-అల్సర్ ప్రమాదం: మజ్జిగ పొట్టలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్సర్ వచ్చే ప్రమాదం ఉన్నవారికి లేదా కడుపులో చికాకుతో బాధపడేవారికి మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది.
డీహైడ్రేషన్-వడదెబ్బ నివారణ: మజ్జిగ సహజ ఎలక్ట్రోలైట్ పానీయంగా పనిచేస్తుంది. ఇది సోడియం, పొటాషియం లోపాలను భర్తీ చేసి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. దీని వలన వడదెబ్బ ప్రమాదం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: పొద్దున్నే చురుకుగా ఉరకలెత్తే శక్తి కావాలా..? అయితే ఈ ఐదు ఆహార పదార్థాలు తిని చూడండి!!
అధిక రక్తపోటు, గుండె ఆరోగ్యం & బరువు తగ్గడం: మజ్జిగలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును సాధారణ స్థాయిలో ఉంచడానికి సహాయపడతాయి. మజ్జిగలో తక్కువ కేలరీలు, అధిక పోషకాలు ఉండటం వలన ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక.
కాలేయం-మూత్రపిండాలకు మేలు: మజ్జిగ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి, మజ్జిగలోని ప్రోబయోటిక్స్, కాల్షియం కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
మూత్రపిండాలు (Kidneys): మజ్జిగ తేలికగా జీర్ణమయ్యే పానీయం. ఇది మూత్రపిండాలపై ఒత్తిడి కలిగించదు. ఇది శరీరానికి తేమను అందించి, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది. అయితే మూత్రపిండాల్లో రాళ్లు, ముఖ్యంగా ఆక్సలేట్ రాళ్లు ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే మజ్జిగ తీసుకోవాలి.
మజ్జిగలో ముఖ్యంగా విటమిన్ B12, B2, A, D, Kతో పాటు కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, అధిక-నాణ్యత గల ప్రొటీన్,మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో మజ్జిగ తాగడం శరీరానికి సహజ శుద్ధి కారకంగా పనిచేస్తుంది. ఇది జీర్ణక్రియను తక్షణమే చురుకుగా మారుస్తుంది. ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు, వాపు ఉన్నట్లయితే మజ్జిగ అస్సలు తీసుకోకూడదు. అంతేకాకుండా మధ్యాహ్నం 12 గంటల తర్వాత, రాత్రి మజ్జిగ తాగడం అనారోగ్యకరమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఏ రంగు గుడ్డులో బలం ఎక్కువ..? తెలుపా లేక గోధుమ!!
Follow Us