/rtv/media/media_files/2025/10/09/uk-india-2025-10-09-20-55-55.jpg)
India-UK deepen trade, economic ties as PM Modi-Keir Starmer unveil new pacts
బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్(keir-starmer) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లు విధించడంతో ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ ప్రధాని పర్యటనపై ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటన ఇరుదేశాల మధ్య మరింత బలమైన వాణిజ్య ఒప్పందానికి దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే గురువారం ముంబయిలోని రాజ్‌భవన్‌లో ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ భేటీ అయ్యారు.
Also Read: సాహిత్యంలో నోబెల్ బహుమతి.. ఈసారి ఎవరంటే ?
ఆ తర్వాత ఇరుదేశాధినేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీర్ స్టార్మర్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' ఇటీవల జపాన్‌ను భారత్ అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. 2028 నాటికి మూడో ఆర్థిక శక్తిగా ఎదగాలని టార్గెట్ పెట్టుకున్న ప్రధాని మోదీకి అభినందనలు. ఈ ప్రయాణంలో మేము భాగం కావాలని కోరుకుంటున్నాం. వికసిత్ భారత్ స్పూర్తితో 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనే నమ్మకం ఉందని'' కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.
అలాగే భారత్, బ్రిటన్ మధ్య వాణిజ్య భాగస్వామ్యం ఎంతో కీలకమైనదని తెలిపారు. ఈ ఏడాది జులైలో ఇరుదేశాల మధ్య కుదిరిన 'సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం' (స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) గురించి ప్రస్తావించారు. ఈ ఒప్పందం భారత్, బ్రిటన్ మధ్య 25.5 బిలియన్ల పౌండ్ల (రూ.3 లక్షల కోట్లు) విలువైన వాణిజ్యాన్ని ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. ఇప్పటిదాకా బ్రిటన్‌కు ఇదే అతిపెద్ద వాణిజ్య మిషన్ అని వెల్లడించారు. అంతేకాదు భారత్‌లో మరిన్ని బ్రిటిష్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సృజనాత్మకతలో భారత్, బ్రిటన్ మధ్య పరస్పర సహకారం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
The path-breaking India-UK CETA will create new job opportunities for youth, expand trade and benefit both our industries as well as consumers. In this context, PM Starmer and I discussed trade linkages and economic ties between our nations in the times to come. @Keir_Starmerpic.twitter.com/zs5obf7Hh7
— Narendra Modi (@narendramodi) October 9, 2025
ఒప్పందం వల్ల సుంకాల తగ్గింపు
భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల సుంకాలు తగ్గనున్నాయి. బ్రిటన్‌లోకి ఎగుమతయ్యే దాదాపు 99 శాతం భారతీయ వస్తువులపై సుంకాలు తగ్గనున్నాయి. దీనివల్ల భారత్‌కు చెందిన వస్త్రాలు, తోలు వస్తువులు, పాదరక్షలు, ఇంజనీరింగ్ ఉత్పత్తులు వంటి ఎగుమతులు బ్రిటన్‌కు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఈ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే భారత్‌కు దిగుమతయ్యే 90 శాతానికి పైగా బ్రిటన్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గుతాయి. కొన్ని రకాల లగ్జరీ కార్లు, విస్కీ, వైద్య పరికరాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌పై సుంకాలు తగ్గనున్నాయి. ఇరు దేశాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్య విలువను ప్రస్తుతం ఉన్నదాని కంటే దాదాపు రెండింతలు పెంచి.. 120 బిలియన్ డాలర్లకు (రూ.10.66 లక్షల కోట్లు) చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
Also Read: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి
విద్యా, రక్షణ రంగంలో సహకారం
బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లాంకాస్టర్' ,' యూనివర్సిటీ ఆఫ్ సర్రే' భారత్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపాయి. గుజరాత్‌లోని GIFT సిటీ, కర్ణాటకలోని బెంగళూరులో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే రక్షణ రంగం పరికరాల తయారీ, సాంకేతికతలో ఇరు దేశాల సహకారం పెరగనుంది. రక్షణ రంగంలో 350 మిలియన్ల పౌండ్ల(రూ.4,142 కోట్లు) విలువైన మిసైల్స్, లాంఛర్ల సరఫరాకు సంబంధించిన ఒప్పందాలు కూడా కుదిరింది.
యూకేలో షూటింగ్స్
కీర్ స్టార్మర్ భారత పర్యటన సందర్భంగా యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ 2026 నుంచి మూడు పెద్ద సినిమాలను యూకేలోని లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ సినిమాల ద్వారా యూకే ఆర్థిక వ్యవస్థకు మిలియన్ల కొద్దీ పౌండ్ల పెట్టుబడి లభించనుంది.