Jubilee Hills Bypoll: నేటితో ఉప ఎన్నిక ప్రచారానికి తెర.. ప్రలోభాలతో ఓటరుకు ఎర

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కోసం సాగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ఉండగా మొత్తంగా 58 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాగా ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది.  

New Update
Jubilee Hills elections...Big twist at the last minute

Jubilee Hills Bypoll

Jubilee Hills Bypoll:  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ర్టా్ల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. బీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ స్థానం కోసం సాగుతున్న ఈ ఎన్నికలో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఉండగా బీజేపీతో పాటు మొత్తంగా 58 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాగా గత నెలరోజులుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం (ఆదివారం)తో ముగియనుంది.  ఈ నెల 11న పోలింగ్‌ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి గోపీనాథ్‌ భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా.. అధికార కాంగ్రెస్‌ నుంచి నవీన్‌యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి బరిలో ఉన్నారు. మూడు పార్టీలూ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Also Read :  Kalvakuntla Kavitha: సీఎం..నీ వీధి రౌడీ భాష మార్చుకో!..కవిత మాస్‌ వార్నింగ్‌

అభివృద్ధి నినాదం.. అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం

బీఆర్‌ఎస్‌ స్థానమైన జూబ్లీహిల్స్‌ను ఎలాగైన గెలిచి తీరాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా బరిలోకి దిగారు. రాష్ట్ర మంత్రులంతా ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికీ రేవంత్‌ రెడ్డి ప్రచారానికే ప్రాధాన్యత లభిస్తోంది. ఆయన  స్వయంగా ఎన్నికల ప్రచార బాధ్యతలను చేపట్టారు. జూబ్లీహిల్స్‌లో గెలిచి కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో విశ్వాసం ఉందని నిరూపించుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి.. సంక్షేమ నినాదం చేస్తున్నారు. కేవలం ఒక అసెంబ్లీ స్థానం కోసం ఒక ముఖ్యమంత్రి నాలుగు రోజులు రోడ్‌షో నిర్వహించడం గమనార్హం.  నియోజకవర్గంలో ఉన్న ఏడు డివిజన్లలో సీఎం పర్యటించారు. ఇతర సామాజిక వర్గాల సమావేశాల్లో పాల్గొన్నారు. మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు అంతా జూబ్లీహిల్స్‌ ప్రచారం మీదే ప్రత్యేక దృష్టి సారించారు.  నియోజకవర్గంలో దాదాపు రూ.300 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని.. సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పుకుంటూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మూడుసార్లు మాగంటి గోపీనాథ్‌ గెలిచినా నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను టార్గెట్‌ చేస్తూ ప్రచారం నిర్వహించారు.  

అయితే అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న అపవాదు కాంగ్రెస్‌ పార్టీ పై ఉంది. మహిళలకు రూ.2500, ఆసరా ఫించన్‌ పెంపుదల, మహిళలకు స్కూటీలు. బతుకమ్మ చీరలు వంటి పథకాలు అమలు కాకపోవడంతో ఆ వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఉచిత బస్సు పేరుతో ఆటో డ్రైవర్లకు అన్యాయం చేశారన్న వ్యతిరేకత ఉంది. దీనికి తోడు హైడ్రా కాంగ్రెస్‌ పార్టీ పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

బీఆర్‌ఎస్‌... బాకీ కార్డులతో విస్తృత ప్రచారం

కాంగ్రెస్‌ పార్టీ(congress) అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదంటూ ఆ పార్టీ బాకీ కార్డుల పేరుతో బీఆర్‌ఎస్‌(brs) విస్తృతంగా ప్రచారం చేసింది. దివంగత మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత పోటీ చేస్తుండడంతో సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నీ తానై వ్యూహాలు రూపొందించారు. అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటించడంతో పాటు రోడ్‌షో, కార్నర్‌ మీటింగ్‌లతో ప్రజల్లోకి వెళ్లారు. పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రచారం చేస్తారని శ్రేణులు భావించినా ఆయన పార్టీ ముఖ్యులకు సూచనలు, సలహాలు ఇచ్చి దిశానిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను నియోజక వర్గంలో మోహరించి భారీ ఎత్తున ప్రచారం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా కేటీఆర్‌ ఆరోపణలు చేశారు. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదని, పింఛన్‌ సొమ్ము పెంచలేదని, నిరుద్యోగ భృతి అమలు కాలేదని, కల్యాణ లక్ష్మి, ఆడపిల్లలకు స్కూటీ  లాంటి పథకాల్లో ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించడంతో పాటు ఈసారి తన ప్రచారంలో డిజిటల్‌ టెక్నాలజీని వినియోగించుకోవడం గమనార్హం. కేటీఆర్‌ సభలకు భారీగా జనాలు రావడంతో గెలుపు మీద ధీమా పెరిగింది. మరోవైపు ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న మాజీ మంత్రి
హరీశ్‌రావుకు పితృవియోగంతో ప్రచారానికి దూరమయ్యారు. అయితే చివరి రెండు రోజులు ఆయన తిరిగి ప్రచారంలో దూసుకుపోయారు. మైనార్టీలకు కేసీఆర్‌ మాత్రమే సంక్షేమం అందించారని, కాంగ్రెస్‌ ఓట్ల రాజకీయం ఆడుతోందంటూ ప్రచారం నిర్వహించారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి రౌడీ అంటూ ప్రచారం చేయడంతో పాటు పలు అంశాలపై ప్రజల్లోకి సూటిగా చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసింది.

ఆలస్యమైనా.. పాత అభ్యర్థికే..

బీజేపీ(bjp) జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రచారంలో మాత్రం చాలా వెనుకబడింది. ముఖ్యంగా అభ్యర్థి ఎంపిక లోనే ఆలస్యం చేసింది. ఇక్కడ క్యాడర్‌ అంతగా లేకపోవడంతో బయటి నుంచి నాయకులను మోహరించింది.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. అన్ని డివిజన్లలో రోడ్‌షోలు నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ రఘునందన్‌రావు తదితరులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు.  

కనిపించని స్వతంత్రుల ప్రచారం

ప్రధాన అభ్యర్థులు ముగ్గురు కాకుండా మరో 55 మంది స్వతంత్రులు జూబ్లీహిల్స్‌ పోటీలో ఉన్నప్పటికీ ప్రచారం అంతంత మాత్రంగానే కనిపించింది. ఈసారి ఉప ఎన్నికల్లో  కొంతమంది ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ పోటీకి దిగగా, ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిరుద్యోగులు పోటీ చేస్తున్నారు.

ప్రలోభాలతో ఎర...

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక(by election in jubilee hills 2025) ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగియ నుండటంతో ప్రలోభాలకు తెరలేపాయి. ఇప్పటికే ప్రధాన పార్టీ డివిజన్ల వారిగా డబ్బుల పంపకం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి బతుకమ్మ చీరలు పంపిణీ మొదలు పెట్టిందన్న ప్రచారం ఉంది. బీఆర్ఎస్ కూడా  ఆయా డివిజన్లలో డబ్బు పంపకాలతో ప్రలోభాలకు తెరలేపిందని ఆరోపణలు వస్తున్నాయి. బోరబండ, రహ్మత్‌నగర్‌ డివిజన్లతో పాటు ఎన్‌ఆర్‌ఆర్‌పురం, సైట్‌ 1, 2, 3, ఇందిరానగర్, సాయిబాబానగర్, రాజునగర్, వినాయకనగర్, ఎస్పీఆర్‌ హిల్స్‌తోపాటు 50 బస్తీలు, మరోవైపు ప్రతిభానగర్, రాజీవ్‌గాంధీనగర్, ఇందిరానగర్‌ తదితర బస్తీలలో ఉండే ఉండే దిగువ మధ్య తరగతి ఓటర్ల మద్దతు ఇప్పుడు అన్ని పార్టీలకు కీలకంగా మారింది. దీంతో వారిని టార్గెట్‌గా చేసుకుని ఆయా పార్టీలు ప్రలోభాలతో ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎవరెన్ని ప్రలోభాలు చేసిన ఫలితం ఏంటీ అనేది 14న తేలనుంది.

Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?

Advertisment
తాజా కథనాలు