/rtv/media/media_files/2025/01/23/A9VKrZnsDN9AHBDVDzdO.webp)
ghmc Photograph: ( )
Common Bill : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కామన్ బిల్ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలపై ఎలాంటి భారం వేయకుండానే గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగానే మొదట జీహెచ్ఎంసీ ఏరియాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇప్పటికే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడానికి కసరత్తు చేస్తున్న జీహెచ్‌ఎంసీ ముంబై, బెంగళూరు మెట్రోపాలిటన్ నగరాల తరహాలో వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్‌లకు సంబంధించి ‘కామన్ బిల్’ తీసుకురావాలని నిర్ణయించడం గమనార్హం. ఇప్పటికే దీనికి సంబంధించి చర్యలూ ప్రారంభించింది. దీని కోసం ప్రత్యేకంగా ‘మొబైల్ యాప్’ను సిద్ధం చేశారు. దీన్ని ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత ఆయన చేతులమీదుగా దీన్ని ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
జీహెచ్‌ఎంసీ నుంచి షురూ
రాష్ర్ట వ్యాప్తంగా ‘వాటర్, కరెంట్, ప్రాపర్టీ ట్యాక్స్‌ల కామన్ బిల్’ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఏరియాను పైలెట్ ప్రాజెక్టుగాఎంపిక చేసింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్‌లో 19.40 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్‌మెంట్లు ఉన్నట్లు ప్రభుత్వ చెబుతోంది. వీటితో పాటు ట్యాక్స్ నెట్‌వర్క్ పరిధిలోని భవనాలు లక్షల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. అయితే, జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ కేటగిరిలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్న భవన యజమానులు వాటర్ బిల్లు, కరెంట్ బిల్లును కమర్షియల్ కేటగిరిలో చెల్లిస్తున్నారని గుర్తించారు. విద్యుత్ శాఖ నుంచి కమర్షియల్ కరెంట్ మీటర్లను వినియోగిస్తూ, జీహెచ్ఎంసీకి రెసిడెన్షియల్ పన్ను చెల్లిస్తున్న సుమారు 93 వేల ప్రాపర్టీలను అధికారులు గుర్తించారు. వీటిని కమర్షియల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురాడంతో పాటు టాక్స్ పరిధిలో మరో 70 వేల భవనాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి నుంచే రూ. 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలవుతుందని అధికారుల అంచనా వేశారు. అన్ని రకాలుగా సుమారు రూ.3వేల కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీలో వచ్చే ఫలితాల ఆధారంగా ‘కామన్ బిల్’ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, ‘కామన్ బిల్’ కోసం జీహెచ్ఎంసీ బిల్ కలెక్టర్లు, టీజీఎస్పీడీసీఎల్ మీటర్ రీడర్లు సంయుక్తంగా సర్వే నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. సోమవారం నుంచి సర్వే ప్రారంభమవుతోందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 15వ తేదీ వరకు విద్యుత్ వినియోగదారుల మొబైల్ నెంబర్లను, జీహెచ్ఎంసీ ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ (పీటీఐఎన్)తో అనుసంధానం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మొబైల్ నెంబర్ల మ్యాపింగ్ బాధ్యతను సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. క్షేత్రస్థాయిలో సిబ్బందిని సమన్వయం చేసుకోవాలని, గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టెక్నాలజీని వాడి వసూళ్లను కచ్చితంగా రాబట్టాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.
Follow Us