/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t213209-2026-01-11-21-32-35.jpg)
Cybercrime gang arrested
Cyber crime: ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ.547 కోట్ల లావాదేవీలు జరిపిన సైబర్ క్రైమ్ ముఠా గుట్టు రట్టయింది. ఈ మేరకు ఖమ్మం జిల్లా పోలీసులు కేసును చేధించారు. అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నేరస్తులతో నేరస్థులతో జతకట్టి విదేశాల్లో కాల్ సెంటర్లు నిర్వహిస్తున్న జిల్లాలోని సత్తుపల్లి కి చెందిన ఒక ముఠాను పట్టుకున్నట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. వీఎం బంజరు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. మ్యాట్రిమోనీ, రివార్డ్ పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ పేర్లు చెప్పి నిందితులు పలువురిని మోసగించినట్టు పోలీసులు గుర్తించారు. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పోట్రు మనోజ్ కల్యాణ్, ఉడతలేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, మారంపూడి చెన్నకేశవతో పాటు మరో 11 మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు.
కాగా వీరు పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తామని కూడా మోసం చేసినట్లు తేల్చారు. గతేడాది డిసెంబరు 24న సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన మోదుగ సాయికిరణ్ కు ఉద్యోగం ఇప్పిస్తానని పోట్రు కల్యాణ్, ప్రవీణ్, ఉడతనేని వికాస్ చౌదరితో పాటు మోరంపూడి చెన్నకేశవులు..తనను నమ్మించి మోసం చేశారని సాయి కిరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు బ్యాంకులలో ఖాతా తెరిపించి అకౌంట్లకు సంబంధించిన వివరాలు, ఏటీఎం కార్డు తీసుకున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా తన బ్యాంకు ఖాతాను పరిశీలించగా రూ.కోట్లలో లావాదేవీలు జరిగినట్లు తెలిసిందని పోలీసుల దృష్టికి తెచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తీగలాగితే డొంక కదిలింది.
నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. వివిధ బ్యాంకు ఖాతాల ద్వారా నిందితులు ఇప్పటివరకు సుమారు రూ.547 కోట్ల లావాదేవీలు జరిపినట్టు తేలింది. సత్తుపల్లి, వేంసూర్, లింగపాలెం, సదాశివుడు పాలెం, సీతారాంపురం, రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందిన మరో ఆరుగురి పేరిట ఖాతాలు తెరిచి వారికి రూ.5వేలు, కరెంట్ అకౌంట్ అయితే రూ.10వేలు ఇచ్చి ఏజెంట్ల ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించినట్లు గుర్తించారు. అనంతరం ఆ ఖాతాలను సైబర్ నేరాలకు వినియోగించుకొన్నారని సీపీ వివరించారు. నేరస్థుల బ్యాంక్ అకౌంట్‌లపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వందల సంఖ్యలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు ఉన్నట్లు గుర్తించామని సీపీ తెలిపారు.
Follow Us