/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t200926-2026-01-11-20-09-50.jpg)
Medaram Jatara : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనజాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు జనం పోటెత్తారు. శనివారం నుంచి స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో గ్రామాల బాట పట్టిన జనం పనిలో పనిగా మేడారం వనదేవతలను దర్శించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి లక్షల మంది భక్తజనం తరలి వస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు ప్రారంభం కావడంతో మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు భక్తులు ముందుగానే తరలివెళ్తున్నారు. దీంతో మేడారంలోని గద్దెల ప్రాంగణంతోపాటు జంపన్న వాగు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నిజానికి జనవరి 28 నుంచి 31 వరకూ మహాజాతర కొనసాగనుంది. కానీ, అప్పటికి విపరీతమైన రద్దీతో పాటు ప్రస్తుతం సెలవులు కూడా ఉండటంతో వనదేవతలకు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.
కాగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వందలాదిగా చేరుకుంటున్న భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానం ఆచరించిన తర్వాత సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకొని దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) తూకంలో సమర్పించి తమ కోరికలు తీర్చాలని వేడుకుంటున్నారు. మేడారం వైపు వేలాది వాహనాలు వస్తుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ములుగు జిల్లా అధికార యంత్రాంగం, పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రధాన మార్గాలైన వస్రా, తాడ్వాయి పాయింట్ల వద్ద అదనపు బలగాలను మోహరించి రద్ధీని నివారించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా రెండు సంవత్సరాల క్రితం జరిగిన జాతర సందర్భంగా అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో వాటిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులతోపాటు గద్దెల వద్ద క్యూలైన్లను వెంటవెంటనే క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బస్టాండ్ తో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో భక్తుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులకు, వాలంటీర్లకు, అధికారులకు భక్తులు సహకరించాలని ఆలయ సిబ్బంది కోరుతున్నారు. కాగా జాతరలో భాగంగా ఈ రోజు(ఆదివారం) తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క మేడారాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. వారితో పాటు పలువురు అధికారులు జాతరలో తమ మొక్కలు చెల్లించుకున్నారు.
Follow Us