/rtv/media/media_files/2025/08/16/key-decision-on-kaleshwaram-brs-to-supreme-court-2025-08-16-07-16-52.jpg)
Key decision on Kaleshwaram..BRS to Supreme Court!
Kaleshwaram Project:
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అటు అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు బీఆర్‌ఎస్ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న తరుణంలో బీఆర్‌ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Barrage) కూలిపోయిందని, అది ఎందుకూ పనికిరాదని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వాటిని తిప్పి కొట్టేందుకు బీఆర్‌ఎస్ సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కాళేళ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో కొన్ని పిల్లర్లు కుంగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడిందని, ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనికిరాదని ఆరపిస్తూ దానిపై దర్యాప్తు చేసేందుకు జస్టీస్ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిటీని నియమించింది. గడచిన సంవత్సరన్నర కాలంగా విచారణ జరిపిన కమిషన్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో ప్రాజెక్టు పేరుతో అవినీతికి పాల్పడ్డారని, లక్షకోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నట్లు ప్రచారం సాగుతోంది. మంత్రులు సైతం అదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించడంతో పాటు త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి చర్చించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు సుప్రీం తలుపు తట్టాలని నిర్ణయించింది.
శుక్రవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ కీలకనేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, జగదీశ్‌రెడ్డి తదితరులు ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడటంతో పాటు నిలిచిపోయిన ఆ ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చేలా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. దీనికోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై పార్టీ నేతలు చర్చించారు.
Also Read: Swiggy: మళ్ళీ స్విగ్గీ వాయింపు ..భారీగా ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు
ప్రాజెక్టు అంశాన్ని సుప్రీంలో ప్రస్తావించే ముందు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాలని పార్టీ అధినేత కేసీఆర్ సూచించారు. దానికోసం ఏయే అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానిపై ప్రధానంగా దృష్టి సారించాలన్న అంశంపై పార్టీ నేతలకు గులాబీ బాస్ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.ఇక ఈ విషయమై ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ చేస్తామన్న అంశంపై కూడా కేసీఆర్ సమాలోచన చేసినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని జరుగుతున్న వ్యతిరేక ప్రచారం, దాన్ని అధిగమించేందుకు ప్రజల్లోకి ఎలా వెళ్లాలన్నదానిపై కూడా పార్టీనేతలు చర్చించినట్లు సమాచారం. అలాగే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టాల్సిన ప్రణాళికలపైనా కూడా పార్టీ నాయకులు చర్చించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవసరమైన నిర్ణయాలు తీసుకునేలా కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై మరోసారి సమావేశం కావాలని కూడా పార్టీ నేతలు నిర్ణయించినట్లు తెలిసింది.
Also Read: Trump: నా మాట వింటేనే..రష్యాతో వ్యాపారం..భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు