Trump: నా మాట వింటేనే..రష్యాతో వ్యాపారం..భేటీకి ముందు ట్రంప్ కీలక వ్యాఖ్యలు

మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. దీని కోసం అమెరికా నుంచి బయలుదేరిన ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధం ఆపే వరకూ రష్యా వ్యాపారం చేసేది లేదని అన్నారు. 

New Update
trump-alaska

Trump-Putin Meet

అలస్కాలో మరికాసేపట్లో ట్రంప్ , పుతిన్ సమావేశం అవుతారు. దీనికి సర్వం సిద్ధం అయింది.  భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి అలస్కాలో వీళ్లిద్దరూ భేటీ కానున్నారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత పుతిన్‌తో సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇరు దేశాధినేతల మధ్యనా అలస్కాలోని యూఎస్ ప్రధాన సైనిక స్థావరం అయిన ఎల్మండోర్ప్ వైమానిక దళ స్థావరంలో జరగనుంది.

యుద్ధం ఆపితేనే వ్యాపారం..

ఈ సమావేశంపై అమెరికా అధ్యక్షుడు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా కాల్పుల విరమణకు ఒప్పుకోవాల్సిందేనని చెప్పారు. తాజాగా అలస్కాకు అమెరికా నుంచి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ బయలుదేరే ముందు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఇందులో రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధాన్ని విరమించడానికి ఒప్పుకోకపోతే వారితో వ్యాపారం చేయనని చెప్పారు. సమావేశానికి పుతిన్ కొంతమంది వ్యాపారులను వెంట తీసుకొస్తున్నట్లు తెలిసింది. ఇది చాలా మంచి విషయం. అమెరికా కూడా ఆ దేశంతో వ్యాపారం చేయాలనే అనుకుంటోంది. కానీ ఎదైనా సరే శాంతి ఒప్పందం చేసుకుంటేనే జరుగుతుంది. మొదట యుద్ధం ముగింపు, కాల్పుల విరమణ గురించే చర్చిస్తాము. అవి సవ్యంగా జరిగితేనే తరవాత వ్యాపారం గురించి మాట్లడతానని ట్రంప్ తల్చి చెప్పేశారు. లేదంటే చర్చలు చాలా తొందరగా ముగుస్తాయని అన్నారు. మేమిద్దరం చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నాం. ప్రస్తుతం దేశాధ్యక్షులుగా కొనసాగుతున్నాం. చర్చలు మంచి ఫలితాన్ని అందిస్తాయని భావిస్తున్నాను అని ట్రంప్ అన్నారు. 

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా అలస్కా సమావేశానికి రెడీగా ఉన్నారు. ఆయన నిన్ననే రష్యా నుంచి బయలు దేరారు. పుతిన్ రష్యా నుంచి మగడాన్ కు చేరుకుని అక్కడి నుంచి అలస్కాకు రానున్నారు. రష్యా నుంచి మగడాన్ ఎనిమిది గంటల ప్రయాణం. అక్కడి నుంచి అలస్కాకు మళ్ళీ నాలుగు గంటల ప్రయాణం. ఈ రెండు జర్నీల మధ్యలో ఆయన కాసేపు మగడాన్ లో ఆగారు. టైమ్ జోన్ తేడాల వలన పుతిన్ రెండు సార్లు శుక్రవారంలోనే ఉండనున్నారు. మగడాన్ శుక్రవారం సాయంత్రం 6గంటలు అయితే...అలస్కాలో ఉదయం 7 గంటలు అవనుంది. అయితే ఇప్పటి వరకు ట్రంప్ భేటీ గురించి చాలాసార్లు మాట్లాడారు, కీలక వ్యాఖ్యలు చేశారు కానీ రష్యా అధ్యక్షుడు మాత్రం నోరు విప్పలేదు. అశాభావం లేదా నిరాశ ఏదీ వ్యక్తం చేయలేదు. 

భారత్ కు మేలు జరుగుతుందా..

ఇప్పుడు జరగనున్న ట్రంప్, పుతిన్ భేటీ, యుద్ధ విరమణ నిర్ణయం కేవలం ఉక్రెయిన్ కే కాదు చాలా దేశాలకు వరంగా మారనుంది. రష్యా అధ్యక్షుడు కాల్పుల విరమణకు ఒప్పుకంటే  అమెరికాతో పాటూ చాలా దేశాలకు లాభం చేకూరుతుంది. రష్యాతో అమెరికా సంబంధాలు మెరుగుపడతాయి. భారత్ వంటి దేశాలపై అదనపు సుంకాల భారం తీసేయవచ్చును. ప్రస్తుతం సుంకాల కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. రష్యా నుంచి చమురు కొంటున్నారనే నెపంతో ఇండియా మీద 50 శతం సుంకాలను విధించారు. దీనికి భారత్ ఒప్పుకోలేదు. రష్యా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలు ఇండియాకు మద్దతుగా నిలిచాయి. మరోవైపు  ఒకవేళ యుద్ధం ముగించేందుకు పుతిన్‌ నిరాకరిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్‌ హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఒకవేళ రష్యాతో చర్చలు విఫలమైతే మరింత టారిఫ్స్‌ పెంచుతామని ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. భారత్‌పై కూడా మరిన్ని సుంకాలు విధించే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు