/rtv/media/media_files/2025/04/21/WUtA2gSDjjj7AJYDb7LR.jpg)
TG Free Cancer Test
TG Free Cancer Test : ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఏటా క్యాన్సర్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచాన్ని పీడిస్తున్న మహమ్మరుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి. రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పెద్దప్రేగు క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్లు ఇలా పేర్లు ఏవైనా సమస్య జఠిలంగా మారుతోంది. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో నెలకు సగటున 1,000 కొత్త క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గత నాలుగేళ్లలో ఇక్కడ 49,166 కేసులు నమోదయ్యాయి. చాలా మందిలో క్యాన్సర్ లక్షణాలు ముందుగా కనిపించక, చివరి దశలోనే గుర్తిస్తున్నారు, ఈ దశలో చికిత్సలు ఫలితం ఇవ్వడం కష్టం. ఆరోగ్యశ్రీ కేసుల్లోనూ క్యాన్సర్ చికిత్సలు ఎక్కువగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
ప్రతి జిల్లాకు ‘మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్’ వాహనాలు
ముందస్తు గుర్తింపుతో రోగులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 41 శాతం ఓరల్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఉన్నాయి. ఈ మూడు రకాల క్యాన్సర్లపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రభుత్వం 10 ప్రాంతీయ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది, మొదటి దశలో భద్రాద్రి-కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, కరీంనగర్‌లో రూ.50 కోట్లతో కేంద్రాలు నెలకొల్పుతారు. జిల్లాకు ఒకటి చొప్పున ‘మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్’ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఈ వాహనంలో ఆంకాలజిస్టులు, పారామెడికల్ సిబ్బంది ఉంటారు. మొబైల్ వాహనం ద్వారా రోజుకు కనీసం 200 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది. మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం పాప్‌స్మియర్ పరికరం, రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు మోమోగ్రఫీ యంత్రాలుంటాయి. ఓరల్ క్యాన్సర్ విషయంలో టార్చ్‌లైట్ సాయంతో మౌఖికంగా పరీక్షించి, నిర్ధారించవచ్చు.తదుపరి దశలో మరో ఐదు చోట్ల ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఈ కేంద్రాల్లో క్యాన్సర్‌కు మెడికల్, సర్జికల్, రేడియో థెరపీ సేవలందిస్తారు. దీంతోపాటు.. అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఇక్కడ కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలందిస్తారు.
18 ఏళ్లు దాటిన వారందరికీ పరీక్షలు
ప్రాంతీయ, జిల్లా క్యాన్సర్ కేంద్రాలకు అనుబంధంగా పనిచేసే మొబైల్ వాహనాలు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాయి. ముందుగానే నిర్ణీత గ్రామంలో క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షల తేదీలను ప్రకటిస్తారు. కంటివెలుగు మాదిరిగానే.. అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఎవరిలోనైనా క్యాన్సర్ లక్షణాలు బయటపడితే.. జిల్లాస్థాయి క్యాన్సర్ చికిత్స కేంద్రానికి తరలిస్తారు. సర్జరీలు అవసరమైతే ప్రాంతీయ కేంద్రాలకు.. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రికి సిఫారసు చేస్తారు. వీటితోపాటు.. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఒక క్యాన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. ఉచితంగా స్ర్కీనింగ్ నిర్వహిస్తారు.ఇప్పటికే ‘ఆరోగ్య మహిళ’ పేరుతో మంగళవారాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.
Also Read: సీఎంకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ షాక్.. మర్యాదగా మాట్లాడలేనంటూ ఒమర్ అబ్దుల్లా ఫైర్!
ప్రపంచ బ్యాంక్ నిధులతో
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రపంచ బ్యాంకు నిధులను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యశాఖకు ప్రపంచ బ్యాంకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు గాను.. ఆరేళ్ల ప్రాజెక్టులో భాగంగా రూ.4,150 కోట్ల రుణం ఇవ్వనుంది. క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలకు సంబంధించి ప్లానింగ్ రిపోర్టును ప్రపంచ బ్యాంకు బృందానికి వైద్యశాఖ ఇప్పటికే అందజేసింది. ఈ నిధులు వస్తే.. పరీక్షల కోసం జిల్లాకు ఒకటి చొప్పున మొబైల్ క్యాన్సర్ స్ర్కీనింగ్ వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అందులో వైద్య పరీక్షలు చేసే వైద్యులు, ఇతర సహయక సిబ్బందితోపాటు యంత్ర పరికరాలుంటాయి. ప్రాంతీయ, జిల్లాస్థాయి కేంద్రాలు ఏర్పాటైతే.. ఇప్పటి వరకు హైదరాబాద్‌కే పరిమితమైన క్యాన్సర్ పరీక్షలు, చికిత్సలు.. జిల్లాలకు కూడా విస్తరిస్తాయి. మొబైల్ వాహనాల ద్వారా గ్రామగ్రామానికీ సేవలు అందుతాయి.
ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో