TSRTC Special Buses For Inter Students: రేపటి నుంచి ( బుధవారం ఫిబ్రవరి 28) జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే జిల్లాలో సమీక్ష సమావేశాలు నిర్వహించిన అధికారులు… పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు.పరీక్షల నిర్వహణలో భాగంగా ఇంటర్మీడియేట్ జిల్లా పరీక్షల విభాగం, హైపవర్ కమిటీతో పాటు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ అధికారులు పాల్గొననున్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, అధికారులు కూడా సెల్ఫోన్లు తీసుకెళ్లవద్దని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రం దగ్గర విద్యార్థులకోసం అన్ని వసతులను కల్పించే ఏర్పాట్లు చేశారు. తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పరీక్ష కేంద్రాల్లో తాగునీటిని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు ఇంటర్మిడియేట్ బోర్డు తెలిపింది.
ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని విద్యార్థులకు టీఎస్ ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి వెంకటేశ్వర్లు వెల్లడించారు. పరీక్షలకు వెళ్లే విద్యార్థులు రాయితీ బస్సు పాస్, హాల్ టికెట్ చూపించి ఫ్రీగా ప్రయాణించవచ్చని సూచించారు. రాయితీ బస్ పాస్ లేని విద్యార్థులు నామమాత్రపు ధరతో టికెట్ జారీ చేస్తారని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు అన్ని రూట్లలోనూ బస్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎక్కడైన బస్సులు రాకపోకల్లో ఆలస్యమైనట్లయితే..కోఠి-9959226160, రేతిఫైల్-9959226154 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ నెంబర్లను సంప్రదిస్తే..బస్సుల సమచారం కూడా తెలియజేస్తారని పేర్కొన్నారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా 1521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,80,978 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 6,78,718, ఇంటర్ సెకండర్ ఇయర్ విద్యార్థులు 6,02,260 మంది పరీక్షలకు హాజరుకానున్నారు.