Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చుతోంది. నెమ్మదిగా నీటిమట్టం పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటలకు నదిలో నీటిమట్టం 50.5 అడుగుల వద్ద ప్రవహిస్తున్నట్లు సమాచారం. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరినది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. 48 అడుగులు దాడిన తరువాత అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు.
గత రెండు రోజుల నుంచి వేగంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం బుధవారం ఉదయం 5 గంటలకు 50.5 అడుగుల వద్దకు చేరి నిలకడగా ప్రవహిస్తోంది. నీటిమట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద వరద ఉధృతి పెరిగింది. రాముల వారి గుడి కళ్యాణ కట్ట వద్దకు వరద నీరు చేరడంతో భక్తులను నది వద్దకి అనుమతించడం లేదు.
భద్రాచలం దిగువన ఉన్న రహదారుల పైకి వరద నీరు చేరడంతో విలీన మండలాలకు రాకపోకలు ఆగిపోయాయి. గోదావరి ప్రమాదకరంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలోకి చేపలు పట్టేందుకు ఎవరిని అనుమతించడం లేదు. ముంపునకు అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. 2022లో గోదావరికి భారీగా వరదలు వచ్చినప్పుడు కరకట్ట దెబ్బతింది. ఇప్పుడా పరిస్థితి రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.