ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాను కేజ్రీవాల్ కలిశారు. ఆ తర్వాత తన రాజీనామా పత్రాన్ని ఎల్జీకి సమర్పించారు. ఇందిలాఉండగా.. ఇప్పటికే ఆప్ అధిష్ఠానం రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా పార్టీ నాయకురాలు, మంత్రి అతిషిని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ఢిల్లీ అసెంబ్లీ గడువు ముగియనుంది. అంటే దాదాపు ఆరు నెలల వరకు మాత్రమే అతిషి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారు.
Also Read: బుల్డోజర్ యాక్షన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ 62 సీట్లు సాధించింది. బీజేపీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. మరి ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మరో రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రజలు తన నిజాయతీని నమ్మేవరకు పాలన బాధ్యతలు స్వీకరించనని స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాతే మళ్లీ ముఖ్యమంత్రి పదవిలోకి వస్తానని తేల్చిచెప్పారు.
మరోవైపు లిక్కర్ కేసులో ఇటీవల బెయిల్‌పై విడుదలైన మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా కూడా ఎన్నికల తర్వాతే మళ్లీ ప్రభుత్వంలో బాధ్యతలు చేపడతానని పేర్కొన్నారు. మొత్తానికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో..బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. మరి ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్‌కే జై కొడతారా లేదా కమలం పార్టీకి మద్దతిస్తారా అనే దానిపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.