/rtv/media/media_files/2025/10/07/virat-kohli-to-achieve-huge-milestone-in-india-vs-australia-odi-series-2025-2025-10-07-08-16-11.jpg)
Virat Kohli to achieve huge milestone in India vs Australia ODI series 2025
ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో దుమ్ములేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సిరీస్‌లో మరో మైలురాయిని సాధించడానికి కింగ్ కోహ్లీ ముందు సువర్ణావకాశం ఉంది. కేవలం 54 పరుగులు చేస్తే విరాట్ అదిరే ఘనతను పొందుతాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కోహ్లీ ముందు భారీ రికార్డు
భారత్ vs ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్, టీ20 సిరీస్ త్వరలో ప్రారంభం కానుంది. అక్టోబర్ 19 నుంచి వన్డే సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆస్ట్రేలియా పర్యటనకు ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇటీవలే భారత్ యాజమాన్యం.. వన్డే, టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును ప్రకటించింది. అందులో రోహిత్ శర్మను వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించి.. ఆ బాధ్యతల్ని యువ బ్యాటర్, ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు.
ఇక ఈ జట్టులో విరాట్ కూడా భాగం అయ్యాడు. ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్.. కంగారూ గడ్డపై తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత విరాట్ కోహ్లీ టీం ఇండియా తరఫున ఆడబోతున్నాడు. కోహ్లీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. ఈ టోర్నమెంట్‌లో అతడు మంచి ఫామ్‌లో కనిపించాడు. ఐదు మ్యాచ్‌ల్లో 54 సగటుతో 218 పరుగులు చేశాడు.
మళ్లీ ఇన్ని నెలల తర్వాత కోహ్లీ గ్రౌండ్‌లో దర్శనమిస్తుండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ఇకపోతే త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే సిరీస్‌లో కోహ్లీ అద్భుతమైన ఘనతను సాధించే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు. అతడు 302 మ్యాచ్‌ల్లో 290 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 14,181 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ‘‘భారత్ క్రికెట్ గాడ్’’ సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే శ్రీలంక మాజీ బ్యాటింగ్ లెజెండ్ కుమార్ సంగక్కర 14,234 పరుగులతో రెండవ స్థానంలో ఉన్నాడు.
ఇప్పుడు విరాట్ వన్డే సిరీస్‌లో కేవలం 54 పరుగులు చేయగలిగితే.. కుమార్ సంగక్కర రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. దీంతో కోహ్లీ సంగక్కరను వెనక్కి నెట్టి రెండవ స్థానానికి చేరుకుంటాడు. అదే సమయంలో సచిన్‌ను అధిగమించాలంటే ఇంకా చాలా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు కింగ్ కోహ్లీ ఇప్పటికే వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీల రికార్డును కలిగి ఉన్నాడు. ఈ విషయంలో అతడు సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు.