/rtv/media/media_files/2025/10/06/ind-w-vs-pak-w-world-cup-2025-2025-10-06-06-49-31.jpg)
IND W VS PAK W World Cup 2025
ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 టోర్నీ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం INDIA Vs PAKISTAN జట్ల మధ్య 6వ మ్యాచ్ జరిగింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 248 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ ముందు ఉంచింది. దీంతో టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు చేతులెత్తేసింది. 43 ఓవర్లలో కేవలం 159 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌర్ మూడు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. అదే సమయంలో దీప్తి శర్మ మూడు వికెట్లు, స్నేహ్ రాణా రెండు వికెట్లు పడగొట్టారు.
India lead the #CWC25 points table following a comprehensive win against Pakistan 👌#INDvPAK 📝: https://t.co/eCML5mnd2Bpic.twitter.com/gZ7gBQkGVk
— ICC (@ICC) October 5, 2025
వరుసగా 12వ విజయం
ఈ గెలుపుతో మహిళల వన్డేల్లో భారత జట్టు పాకిస్థాన్‌పై వరుసగా 12వ విజయం సాధించింది. ఇప్పటివరకు పాకిస్థాన్‌తో జరిగిన ఒక్క వన్డే మ్యాచ్‌లోనూ భారత్ ఓడిపోలేదు. దీంతో ప్రస్తుత ప్రపంచ కప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను డిఎల్ఎస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో ఓడించి మంచి ఆరంభం ఇచ్చింది. ఇక అక్టోబర్ 9న భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
భారత్ ఇన్నింగ్స్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. స్మృతి మంధాన (23), ప్రతికా రావల్ (31) భారత జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 48 పరుగులు జోడించారు. వీరిద్దరూ వికేట్లు కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నిలకడగా ఆడలేకపోయింది. ఆమె 19 పరుగులకే వెనుదిరిగింది. హర్లీన్ డియోల్ (46), జెమిమా రోడ్రిగ్స్ (32), దీప్తి శర్మ (25), స్నేహ్ రాణా (20), క్రాంతి గౌర్ (8), రిచా ఘోష్ (35*) పరుగులు చేశారు. ఇలా భారత్ జట్టు 50 ఓవర్లలో 247 పరుగులు చేసింది. పాకిస్తాన్ తరఫున ఫాస్ట్ బౌలర్ డయానా బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టారు.
పాకిస్తాన్ ఇన్నింగ్స్
లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ జట్టు చేతులెత్తేసింది. పేలవమైన ఆరంభాన్ని నమోదు చేసింది. మునీబా అలీ 6 పరుగులకే రనౌట్ అయింది. ఆ తర్వాత సదాఫ్ షమాస్ (6 పరుగులు), అలియా రియాజ్ (2 పరుగులు) చేసి వికెట్లను కోల్పోయారు. ఇలా పాకిస్తాన్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సిద్రా అమీన్, నటాలియా పర్వేజ్ నాల్గవ వికెట్‌కు 69 పరుగులు జోడించారు. కెప్టెన్ ఫాతిమా సనా (2 పరుగులు) వెనుదిరిగింది. ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత సిద్రా అమీన్ (81), నటాలియా పర్వేజ్ (33), సిద్రా నవాజ్ (14), రమీన్ షమీమ్ (0), డయానా బేగ్ (9), సాదియా ఇక్బాల్ (0), నష్రా సంధు (2*) పరుగులు చేశారు. ఇలా 43 ఓవర్లలో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయ్యారు.