/rtv/media/media_files/2025/10/31/tema-india-women-2025-10-31-06-31-46.jpg)
ఇప్పటి వరకు అమ్మాయిల క్రికెట్ మీరు చూడ్డం లేదా. మెన్ క్రికెట్ లా అంత రసవత్తరంగా ఉండదు అనుకుంటున్నారా. అయితే నిన్న ఆస్ట్రేలియా, భారత్ అమ్మాయిల మధ్య జరిగిన మ్యాచ్ చూడండి. మీ అపోహలన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇంత కంటే మంచి మ్యాచ్ ఉండదు అని అంటారు. అబ్బాయిల కన్నా అమ్మాయిలే బాగా ఆడారు అని చెబుతారు. ప్రత్యర్థి ఏడు సార్లు ప్రపంచ ఛాంపియన్. 399 పరుగుల భారీ లక్ష్యం. ఇక పని అయిపోయింది. సెమీ ఫైనల్స్ తోనే భారత మహిళల వరల్డ్ కప్(ICC Women's World Cup) జర్నీ ముగిసిపోయింది అనుకున్నారు అందరూ. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ టీమ్ ఇండియా(team-india) అమ్మాయిలు అదరగొట్టేశారు. కంగారూలు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చారు. 399 పరుగుల టార్గెట్ ను హర్మన్ ప్రీత్ బృందం ఛేదించి గర్వంగా ఫైనల్స్ లోకి అడుగు పెట్టారు. భారత జట్టులో జెమీమా రోడ్రిగ్స్ మరుపురాని ఇన్నింగ్స్ ఆడింది. టీమ్ మొత్తం భారాన్ని తనపై వేసుకుని మరీ గెలిపించింది.
Also Read : గువాహటి టెస్ట్: లంచ్ కంటే ముందే టీ బ్రేక్.. ఎందుకంటే?
జమీమా రోడ్రిగ్స్ అద్భుతం..
హర్మన్ ప్రీత్ కెప్టెన్సీలో భారత మహిళ జట్టు వరల్డ్ కప్ లో ఫైనల్స్ లోకి అడుగు పెట్టింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత పోరాట పటిమను కనబరిచింది. ముఖ్యంగా జెమీమా (127 నాటౌట్; 134 బంతుల్లో 14×4) హీరోచిత శతకం అందరి చేత వావ్ అనిపించింది. చివరి వరకు రసవత్తరంగా జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో మట్ట కరిపించింది. జెమీమాతో పాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (89; 88 బంతుల్లో 10×4, 2×6) సత్తా చాటడంతో 399 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (119; 93 బంతుల్లో 17×4, 3×6) శతకానికి ఎలిస్ పెర్రీ (77; 88 బంతుల్లో 6×4, 2×6), ఆష్లీ గార్డ్‌నర్ (63; 45 బంతుల్లో 4×4, 4×6) మెరుపులు తోడవడంతో 399 పరుగుల బారీ లక్ష్యాన్ని సాధించింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా మొదట్లో తడబడింది. ఓపెనర్లు షెఫాలి 10, స్మృతి మంధాన 24 పరుగులకే వికెట్లు కోల్పోయారు. దీంతో మ్యాచ్ గెలవడం కష్టం అనుకున్నారు. కానీ జెమీమా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జోడీ అసాధారణ పోరాట పటిమతో అద్భుతమే చేసింది. ఒత్తిడిలో కూడా పరుగులను రాబడుతూ..భారత్ ను గెలిపించింది. హర్మన్ ప్రీత్ అవుట్ అయినా చివర వరకు ఉండి టీమ్ కు విజయాన్ని అందించింది. జెమీమాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం ఫైనల్స్ లో భారత మహిళ జట్టు సౌత్ ఆఫ్రికాను ఢీకొననుంది. ఇందులో ఎవరు గెలచినా కొత్త ఛాంపియన్ చూడనున్నాము. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా, టీమ్ ఇండియా రెండూ ఇప్పటి వరకు కప్ ను నెగ్గలేదు.
Also Read : ప్రియుడితో క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి.. తేదీ ఖరారు..!
 Follow Us
 Follow Us