Dalai Lama Biography: దలైలామా జీవిత చరిత్రపై జర్నలిస్ట్ అరవింద్‌ యాదవ్‌ బుక్!

డా. అరవింద్‌ రచించిన దలైలామా జీవిత చరిత్ర పుస్తకం జులై 9న ఆరంభమయ్యే దలైలామా 90వ జన్మదిన ఉత్సవాల సందర్భంగా విడుదల కానుంది. పుస్తకాన్ని ఇంగ్లిష్, హిందీ, తెలుగులో విడుదల చేస్తున్నారు. దలైలామా జీవితంలోని అరుదైన విషయాలు, సంఘటనలు ఇందులో ఉండనున్నాయి.

New Update
dalai lama biography

dalai lama biography

ప్రసిద్ధ జీవిత చరిత్రల రచయిత, జర్నలిస్ట్‌ డాక్టర్‌ అరవింద్‌ యాదవ్‌ దివ్య మూర్తి, పద్నాలుగో దలైలామా టెన్జిన్‌ గ్యాత్సో జీవిత చరిత్రను రచించారు. ఎంతో పరిశోధన చేసి, సమగ్రంగా ఆయన దీనిని రూపొందించారు. సమున్నత ఆధ్యాత్మిక నాయకుడి జీవిత విశేషాలతో ఇప్పటికి అనేక పుస్తకాలు వచ్చాయి. దలైలామా జీవితంలోని అరుదైన వాస్తవాలు, ఇప్పటికి తెలియని సంఘటనలతో డా. అరివింద్‌ రాసిన ఈ మహత్తర గ్రంథం మిగిలిన అన్నింటి కన్నా భిన్నంగా, అసమానంగా ఉంది. డా. అరవింద్‌ రచించిన ఈ జీవిత చరిత్రను ఈ ఏడాది ఇంగ్లిష్, హిందీ, తెలుగులో విడుదల చేస్తున్నారు. 2025 జులై 9న ఆరంభమయ్యే దలైలామా 90వ జన్మదిన ఉత్సవాల సందర్భంగా ఈ పుస్తకం పాఠకుల ముందుకు వస్తోంది.

Also Read :  హాస్పిటల్ డ్రామా మళ్ళీ మొదలు .. 'హార్ట్ బీట్' సీజన్ 2 వచ్చేస్తోంది!

అభినందించిన దలైలామా..

‘‘నా జీవిత కథను ఐదు పుస్తక భాగాలుగా తీసుకురావడానికి అంకితభావంతో కృషిచేస్తున్న డాక్టర్‌ అరవింద్‌ యాదవ్‌కు అభినందనలు. టిబెట్‌ చరిత్రను, బౌద్ధం యొక్క తాత్వికతను అర్ధంచేసుకోవడంలో అరవింద్‌ సాగించిన సునిశిత పరిశోధన, లోతైన అధ్యయనం నా ప్రయాణం గురించి, నేను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న విలువల గురించి తెలుసుకోవాలనుకునే వారికి గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది.’’

Also Read :  నీళ్లు వదలండి ప్లీజ్.. భారత్ కు పాక్ అధికారిక లేఖ!

ఇంకా ఆయన ఈ గ్రంథం గురించి చెబుతూ..

‘‘బాల్యం నుంచి ప్రవాసం దాకా నా జీవనయానాన్ని గుదిగుచ్చడం ద్వారా డాక్టర్‌. యాదవ్‌ టిబెట్‌ ప్రజల ఆకాంక్షలను, చర్చలే సాధనంగా సాగుతున్న వారి అచంచల అహింసా మార్గాన్ని సాధికారికంగా నమోదు చేసినట్లయింది. మానవ విలువలను, మత సామరస్యాన్ని పెంపొందించడంలోనూటిబెట్‌ ప్రాంతపు సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడడంలోనూప్రాచీన భారత దేశ జ్ఞానం పట్ల అవగాహనను, ఆసక్తిని రేకెత్తించడంలోనూ అంకితభావంతో నేను చేస్తున్న కృషికి ఈ పుస్తకం దివిటీ పట్టింది. సుసంపన్నమైన టిబెట్‌ వారసత్వాన్ని, వర్తమానంలో అది చేస్తున్న పోరాటాన్ని ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చేలా ఓ పుస్తకం రాస్తానని 2022లో డాక్టర్‌ యాదవ్‌ నాకు మాటిచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తనకు హృదయపూర్వక కృతజ్ఞతలు.’’

ఈ పుస్తకం ముందుమాటలో ప్రఖ్యాత రచయిత, రాజనీతిజ్ఞడు, తత్వవేత్త డా.కరణ్‌ సింగ్‌ ఇలా రాశారు..

‘‘దలైలామా జీవితం గురించి, ఆయన సాధించిన గొప్ప విజయాల గురించి సామాన్య జనానికి తెలిసింది తక్కువ. దలైలామా ప్రయాణాన్ని సమగ్రంగా ప్రతిబింబించే ఒక జీవిత చరిత్ర పుస్తకం రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు అరవింద్‌ యాదవ్‌ తన విస్తృత అధ్యయనం ద్వారా దలైలామా జీవిత చరిత్రను హిందీలో రచించారు. నేను ఎంతో ప్రేమగా డియర్‌ ఫ్రెండ్‌అని పిలుచుకునే దలైలామా వ్యక్తిత్వాన్ని, ఆయన జీవిత యాత్రను ఈ పుస్తకం మన ముందు ఉంచుతోంది. ఇంత గొప్ప పనిని ఎంతో శ్రద్ధతో చేసిన అరవింద్‌ యాదవ్‌ను మనసారా అభినందిస్తున్నాను. ఈ పుస్తకం దేశవిదేశాల్లో విస్తృత ప్రాచుర్యం పొందగలదని ఆశిస్తున్నాను.’’

గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు రాయడం డా.అరవింద్‌ యాదవ్‌కు కొత్త కాదు. ఇది వరకు ఆయన భారతదేశానికి చెందిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జీవిత కథలను పుస్తక రూపంలో వెలువరించారు. డా.యాదవ్‌ గతంలో జీవిత కథలు రాసిన ఈ ప్రముఖ వ్యక్తుల్లో ప్రసిద్ధ శాస్త్రవేత్త సి.ఎన్‌.ఆర్‌.రావు, భారత తొలి హృద్రోగ నిపుణురాలు డాక్టర్‌ పద్మావతి, సంఘ సంస్కర్త ఫూల్‌ బాసన్‌ యాదవ్, దూరదృష్టి గల దార్శినిక వ్యాపారవేత్త సర్దార్‌ జోద్‌ సింగ్, వైద్యుడు, వైద్య సంస్థల నిర్మాత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ప్రసిద్ధ వైద్యులు డాక్టర్‌ వేమిరెడ్డి రాధికా రెడ్డి, డా.పిగిలం శ్యామ్‌ ప్రసాద్, డా.పవన్‌ అడ్డాల ఉన్నారు.

హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన డా.యాదవ్‌ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్, హిందీ కోర్సుల్లో ఉత్తీర్ణుడయ్యారు. ఇంకా సైన్స్, సైకాలజీ, లా వంటి అంశాలపై తగినంత పరిజ్ఞానం సంపాదించారు. దక్షిణ భారతదేశ రాజకీయాలు, సంస్కృతిపై డా.యాదవ్‌కు లోతైన అవగాహన ఉంది. అనేక ప్రాంతాల్లోని గ్రామాలు, నగరాల్లో ఆయన విస్తృత పర్యటనలు రచనా, పాత్రికేయ రంగాల్లో డా.యాదవ్‌ సామర్ధ్యానికి కొత్త బలాన్నిస్తున్నాస్తున్నాయి.

దలైలామాపై రాసిన ఈ తాజా పుస్తకంతో డా.యాదవ్‌ లోతైన పరిశోధనను, ఆకట్టుకునేలా వివరించే కథనాన్ని మరోసారి చదివి ఆనందించవచ్చు. ప్రపంచంలో అత్యంత గౌరవనీయుడైన ఆధ్యాత్మిక నాయకుడి కాంతిమంతమైన జీవితం లోతులను ఈ గ్రంథంలో చక్కగా వివరించారు.

Also Read :  కుంభమేళా మోనాలిసా రేంజే వేరు.. హీరోతో ఫుల్ ఎంజాయ్ - వీడియో చూస్తే వావ్ అనాల్సిందే

జీవిత చరిత్ర నుంచి కొన్ని భాగాలు.

1. అది 1935 జులై 5. రాత్రి ఇంటి పనులయ్యాక దికీ త్సేరింగ్‌ భర్తతో కలిసి నిద్రకు ఉపక్రిమించింది. కూతురు త్సేరింగ్‌ దోల్మా, కొడుకు గ్యాలో తొండుప్‌ పడుకోడానికి వెళ్లారు. తెల్లారింది. తుఫాను వస్తున్నట్టుగా బయట ఒకటే అలజడి. దికీ త్సేరింగ్‌ కాస్త పెందలాడే నిద్రలేచింది. ఇంకా గాలివాన ఆ గ్రామానికి చేరుకోలేదు. ఈదురుగాలి శబ్దం వస్తోంది. మెలకువ వచ్చింది. కళ్లు తెరిచాక అసంకల్పితంగానే ఆమె చేయి పొట్టపైకి వెళ్లింది. ఆ మాతృ స్పర్శతో కలిగిన ఆనందం ముఖంపై చిన్న చిరునవ్వు వెలిగింది. ఒక అద్భుతం జరగబోతోందని ఆమెకు మెల్లగా అంతరాత్మ చెప్పినట్టు జరిగిపోయింది.

ఒక పక్క ప్రసూతి నొప్పులు వస్తున్నా.. దికీ త్సేరింగ్‌ ఎవరి సాయం తీసుకోలేదు. తన పనులు తాను చేసుకుంటూనే ఉంది. ఇక కాన్పు సమయం వచ్చేసిందని అర్ధమైంది. అయినా సరే నొప్పులను ఓర్చుకుంటూ పనులు మానలేదు. ఎప్పటిలాగానే పశువుల కొట్టంలోని జంతువులకు మేత వేసి వచ్చింది. తుఫాను రాకడను గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. వాన నీరు కిందికి దిగేలా చెక్క డ్రయినేజీ వ్యవస్థను శుభ్రం చేసింది. ఇంటి పనులు చక్కదిద్దుకునే సామర్ధ్యం కేవలం అనుభవం నుంచే రాలేదు. జరగబోయే పరిణామాలపై ముందుచూపు, గృహసంబంధ వ్యవహారాలపై ఉన్న దార్శనిక దృష్టి ఆమె ప్రతిభాపాటవాలకు తోడయ్యాయి.

ఆమె పనులు చేసుకుంటుండగానే నొప్పులు ఎక్కువయ్యాయి. ప్రసవించే సమయం వచ్చిందని ఆమె శరీరంలో వస్తున్న మార్పులు సూచించాయి. కాన్పుకు సిద్ధమవ్వాలనే ఆలోచనతో ఆమె గడ్డిమోపు పక్కన జారిగల పడింది. తుఫాను వస్తున్నట్టు సూచించే దృశ్యాలు ఆమె కళ్ల ముందు కదలాడాయి. ఆకాశం మేఘావృతమైంది. గాలివాన వచ్చేసిందని చెప్పేలా మేఘగర్జనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో అనేక రోజులుగా వానలు పడుతూనే ఉన్నాయి. మధ్యమధ్యలో ఇంద్రధనస్సులు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని చూస్తే పిల్లలకు చెప్పలేనంత ఆనందం.

పశువుల కొట్టంలో డిజోమోలు తల ఊపుకుంటూ నెమరేస్తున్నాయి. కోళ్లు తిండి వేటలో పడ్డాయి. కొన్ని చోయిక్యోంగ్‌ త్సేరింగ్‌ పడుకున్న చోటు వరకూ వచ్చాయి. ఇంత సుందర వాతావరణంలో దికీ త్సేరింగ్‌ ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఎనిమిది పౌన్ల బరువు ఉన్న బిడ్డ ఏడుపు లేకుండానే ఈ ప్రపంచంలోకి వచ్చి కళ్లు తెరవడం ఆశ్చర్యం. టిబెటన్‌ కేలండర్‌ ప్రకారం షిన్‌ఫాగ్‌ (ఒక వరాహ) సంవత్సరం ఐదో నెల ఐదో రోజున నవ శిశువు ఈ భూమ్మీద పడ్డాడు. ఇంగ్లిష్‌ కేలండర్‌ ప్రకారం ఇది 1935 జులై 6 కిందికి వస్తుంది.

కొద్ది సేపటికి కూతురు త్సేరింగ్‌ దోల్మా తన తల్లి దగ్గరకు వచ్చింది. పసి బిడ్డ కళ్లలో ఒకటి పూర్తిగా తెరుచుకోలేదని గ్రహించిన దోల్మా ఆ నేత్రం తెరవడానికి ప్రయత్నించింది. వేలుతో నెమ్మదిగా రుద్దుతూ సాయపడింది.

టిబెటన్‌ సాంప్రదాయం ప్రకారం చెట్టు బెరడు నుంచి తీసిన రసాన్ని మొదట ఆ పసిబిడ్డ నోటికి అందించింది త్సేరింగ్‌ దోల్మా.

Also Read :  మోహన్ లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ 'థుడారమ్' ఓటీటీ రిలీజ్ పై కీలక అప్డేట్

అప్పుడే పుట్టిన నవ శిశువును ఇంటిలోకి తీసుకురాగానే పొరుగింటి వ్యక్తి ఒకరు చెమటలు కక్కుకుంటూ వచ్చి, ‘‘ హరివిల్లు మీ ఇంటి పైకప్పును తాకుతోంది,’’ అని చోయిక్యోంగ్‌ త్సేరింగ్, ఆయన కుటుంబ సభ్యులకు చెప్పడం సంచలనానికి దారి తీసింది.

ఆ బిడ్డ పుట్టిన కొద్దిసేపటికే మరో అసాధారణ పరిణామం సంభవించింది. సుస్తీతో అంతకుముందు మంచానపడిన చోయిక్యోంగ్‌ త్సేరింగ్‌ ఆరోగ్యం ఆనూహ్యంగా మెరుగైంది. కుటుంబం మొత్తం ఆశ్చర్యపోయేలా ఆయన కోలుకున్నారు. అయితే, బిడ్డ పుట్టుకకూ, తండ్రి అసాధారణ రీతిలో కోలుకోవడానికి మధ్య సంబంధం ఉందని ఆ సమయంలో ఎవరూ అనలేదు.

కుటుంబంలోకి కొత్త మనిషి ఇలా రావడంతో సాంప్రదాయబద్ధంగా ఇంట్లో పండగ చేసుకున్నారు. అప్పుడే పుట్టిన తన బిడ్డకు దీర్ఘాయుష్షు, ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటారు. పాప అవసరాలు తీర్చడానికి అక్కున చేర్చుకుంది తల్లి. కాని, ఆ ఇంట ఒక విశిష్ట భవిష్యత్తు ఉన్న బిడ్డ జన్మించాడని కుటుంబ సభ్యులు ఎవరూ గుర్తించ లేదు. ఆ సమయంలో కొన్ని వింత ఘటనలతోపాటు కొన్ని సూచనలు కనిపించినా వాటిని గుర్తించే తెలివితేటలు, సామర్ధ్యం ఎవరికీ లేవు. వాటిని అర్ధం చేసుకోవడం సాధ్యం కాలేదు.

 2. ఇంకా పరిశీలన జరపాలన్న సూచన మేరకు క్సూత్సాంగ్‌ రిన్‌పోచే, ఆయన సహచరులు తక్స్‌సెర్‌కు మరోసారి పయనమయ్యారు. వారు వెళ్లే మార్గంలో పెరుగు, పాలు, నీరు నిండుగా ఉన్న కుండలను మోసుకెళ్తున్న వ్యక్తులు ఎదురయ్యారు. టిబెటన్‌ సంస్కృతి ప్రకారం ఇలాంటి మనుషులు ఎదురుపడితే అది శుభశకునంగా భావించాలి. స్థానిక విశ్వాసాల ప్రకారం కూడా చూస్తే ఎవరికైనా ఇలాంటి దృశ్యాలు తమ ప్రయాణంలో కంటపడితే వారి ప్రయత్నాలు విజయవంతంగా పూర్తవుతాయట. ఈ సానుకూల శుభసూచనతో అన్వేషణ బృందం రెట్టించిన ఆశతో తమ పయనాన్ని ముందుకు సాగించింది. తక్స్‌సెర్‌ గ్రామంలో వారు బాలుడి ఇంటి సమీపానికి చేరుకోగానే సన్యాసులు ప్రార్థన చేయడానికి గుమిగూడుతున్నారని తెలిపే శంఖనాదం స్థానిక బౌద్ధారామం నుంచి వారికి వినిపించింది. శంఖనాదాన్ని సానుకూల శకునంగా పరిగణించిన ఈ బృందం ఉత్సాహం ఇంకా ఉరకలేసింది. సుమధుర శంఖనాదం ఆగిపోగానే తియ్యని కోయిల గానం వారి చెవులకు వినసొంపుగా తాకింది. ఇది పవిత్రతకు పరమ చిహ్నంగా వారు భావించారు.

కొద్దిసేపటి తర్వాత వారు చోయిక్యాంగ్‌ త్సేరింగ్‌ ఇంటి ముందుకు చేరుకున్నారు. దురదృష్టవశాత్తూ ఆ సమయంలో చోయిక్యాంగ్‌ త్సేరింగ్‌ నీటియంత్రం పనుల మీద బయటికి వెళ్లినాగాని ఇంటి దగ్గర వారికి ఆదరణ విషయంలో ఎలాంటి లోటు రాలేదు. ఆయన కుటుంబసభ్యులు దలైలామా అన్వేషణ బృందం సభ్యులను సాదరంగా లోపలికి ఆహ్వానించారు. వారందరికీ తేనీరు అందించారు. టీ తాగిన తర్వాత బాలుడిని పరీక్షించడానికి ఈ బృందం అనుమతి కోరగా, కుటుంబసభ్యులు అందుకు సమ్మతించారు.

పడకగదిలో ఎత్తుమీదున్న గట్టుపై ఒక పొడవాటి టేబుల్‌ ఉంది. లామో తొండప్‌ను మరింత పరిశీలించడానికి ఈ వేదిక సరిపోతుందని వారు భావించారు. టేబుల్‌కు ఒక వైపు క్సూత్సాంగ్‌ రిన్‌పోచే, ఖెన్‌రబ్‌ టెన్జిన్‌ కూర్చున్నారు. వారికి రెండో వైపు అంటే ఎడమ వైపు లాబ్‌సాంగ్‌ త్సేవాంగ్, ఖెనీ సోనమ్‌ వాంగ్దూ ఆశీనులయ్యారు.

మిగిలిన పరీక్షలు, పరిశీలనలు ఏమాత్రం జాప్యం లేకుండా పూర్తిచేయాలని క్సూత్సాంగ్‌ రిన్‌పోచే కృత నిశ్చయంతో ఉన్నారు. లామో తొండప్‌ ముందు రెండు జపమాలలు పెట్టారు క్సూత్సాంగ్‌ రిన్‌పోచే. రెండింటిలో ఒకదాన్ని ఎంపికచేసుకోవాలని బాలుడిని కోరారు. ఆ అబ్బాయి ఒక జపమాలను తీసుకుని తన మెడకు తగిలించుకున్నాడు. ఆ జపమాల పదమూడో దలైలామాది. దీంతో అన్వేషణ బృందం సభ్యులు పరమానంద భరితులయ్యారు. కానీ భావోద్వేగాలు బయటపడనీయ లేదు. గంభీర వదనంతో ఉన్నారు. 

తర్వాత రెండు డమరుకాలను బాలుడి ముందు పెట్టారు. వాటిలో ఒకటి చిన్నది, రెండోది పెద్దది, ఏనుగు దంతంతో చేసింది. ఇది బంగారు బెల్టు, జరీ పిడితో అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. లామో తొండప్‌ చిన్న డమరుకం తీసుకుని దానితో ఆట మొదలుబెట్టాడు. ఈ చిన్నోడు డమరుకాన్ని వాయించిన తీరు చూస్తే ప్రార్థనా పద్ధతి గుర్తుకొచ్చింది. బాలుడు ఎంపికచేసుకున్న చిన్న డమరకం కూడా పదమూడో దలైలామా వాడినదే కావడంతో అన్వేషణ బృందం సభ్యులు విస్మయానికి గురయ్యారు. తన సహాయకులను పిలవడానికి దలైలామా తరచు ఈ డమరుకాన్ని వాడేవారు.

అనంతరం రెండు చేతికర్రలను బాలుడి ముందుపెట్టి ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలని కోరారు. లామో తొండప్‌ ఒక కర్రను పట్టుకుని జాగ్రత్తగా పరిశీలించాడు. అప్పుడు క్సూత్సాంగ్‌ రిన్‌పోచే, అతని సహచరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కొన్ని క్షణాల తర్వాత ఆ ఊతకర్రను పక్కన పడేసి, రెండో చేతికర్రను తీసుకుని అది తనదని చెప్పాడు ఆ బాలుడు. మొదట పట్టుకుని ఊతకర్ర దలైలామాదే కాని, దాన్ని ఆయన ఒక లామాకు ఇవ్వగా, ఆ లామా దాన్ని కెల్స్‌ రిపోచే అనే బౌద్ధ మతాచార్యుడికి బహూకరించాడు. లామో తొండప్‌ తనదని తీసుకున్న చేతికర్ర వాస్తవానికి 13వ దలైలామాది.

చివరిగా రెండు కప్పులను బాలుడి ముందు పెట్టారు. లామా తొండప్‌ సహజరీతిలో గతంలో 13వ దలైలామా తేనీరు సేవించడానికి ఉపయోగించిన కప్పునే తీసుకున్నాడు. అనంతరం ఉత్సవాల్లో వాడే రెండు గంటలను బాలుడికి చూపించగా, ఏమాత్రం ఆలోచించకుండా దలైలామా ప్రార్థనలతో ప్రతిధ్వనించే గంటనే తీసుకున్నాడు.

ఇప్పుడు క్సూత్సాంగ్‌ రిన్‌పోచే, ఆయన బృందం సభ్యులు ఆనందం ఉరకలెత్తింది. ఇక వారి మనసుల్లో ఒక్క అనుమానం కూడా మిగల్లేదు. లామో తొండప్‌ అన్ని పరీక్షల్లోనూ విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాడు. ప్రతి అంశంలోనూ తాను దలైలామా అవతారమని చెప్పేలా ప్రవర్తించాడు. దలైలామా పునర్జన్మకు సంబంధించిన తాము ప్రారంభించిన అన్వేషణ ఫలించిందని క్సూత్సాంగ్‌ రిన్‌పోచే, ఆయన అనుచరులు కృతనిశ్చయానికి వచ్చారు. లామో తొండప్‌ వాస్తవానికి 14వ దలైలామా అని తేలిపోయింది.

 

(telugu-news | telugu breaking news | dalailama | latest-telugu-news | today-news-in-telugu | international news in telugu)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు