రష్యా ఆర్మీలో 27 మంది భారతీయులు.. స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు

రష్యా సైన్యంలో పనిచేస్తున్న 27 మంది భారతీయులని స్వదేశానికి తిరిగి పంపించాలని భారత్, మాస్కోని కోరింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.

New Update
russia army

రష్యా సైన్యంలో పనిచేస్తున్న 27 మంది భారతీయులని స్వదేశానికి తిరిగి పంపించాలని భారత్, మాస్కోని కోరింది. వీరి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో వెల్లడించారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పలువురు భారతీయులు ఉద్యోగాల కోసం రష్యాకు వెళ్లారు. వారిలో కొందరిని మోసం చేసి లేదా బలవంతంగా రష్యా సైన్యంలో చేర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలువురిని భారత్‌కు తిరిగి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే, ప్రస్తుతం 27 మంది భారతీయులు రష్యా సైన్యంలో ఉన్నారని వారి కుటుంబాల ద్వారా సమాచారం అందిందని జైస్వాల్ తెలిపారు.

ఈ అంశంపై రష్యాలోని భారత రాయబార కార్యాలయం, ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం ద్వారా మాస్కో అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, ఈ భారతీయులను త్వరితగతిన విడిపించేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ విషయం గతంలోనూ అనేకసార్లు రష్యా దృష్టికి తీసుకెళ్లామని, వారిని వెనక్కి పంపించే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరామని జైస్వాల్ తెలిపారు.

రష్యా సైన్యంలో చేరేందుకు ఇచ్చే ఆఫర్లు ప్రమాదకరమని భారతీయులకు గతంలోనే ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉద్యోగాల పేరుతో ఏజెంట్లు మోసం చేసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయినప్పటికీ, ఇంకా కొందరు ఇలాంటి ప్రలోభాలకు గురవుతున్నారని ఈ తాజా పరిణామం తెలియజేస్తుంది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడమే తమ లక్ష్యమని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రయత్నాలలో భాగంగా, రష్యాలో ప్రవాస భారతీయులకు ఏ సమస్య వచ్చినా సహాయం చేయడానికి రాయబార కార్యాలయం సిద్ధంగా ఉందని MEA తెలిపింది.

Advertisment
తాజా కథనాలు