/rtv/media/media_files/2025/08/21/stomach-problems-2025-08-21-13-41-35.jpg)
Stomach problems
కాలేయం జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాలేయంలో కొద్ది మొత్తంలో కొవ్వు ఉండటం సాధారణమే.. కానీ అది ఎక్కువగా పేరుకుపోతే ప్రమాదకరం. ఎక్కువగా మద్యపానం చేసే వారిలో, ఆల్కహాల్ సేవించని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటం వంటివి ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలు. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మందికి ఈ సమస్య గురించి తెలియదు. అయితే తరచుగా అలసట, బలహీనత, పొత్తికడుపులో నొప్పి, అసౌకర్యం వంటి లక్షణాలు ఉండవచ్చు. ఈ సమస్యను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం. అంతేకాకుండా కొన్నిసార్లు మనం సాధారణ సమస్యలుగా భావించే కడుపు నొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఫ్యాటీ లివర్‌కు సంకేతాలు కావచ్చు. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది లివర్ సిర్రోసిస్ లేదా లివర్ ఫెయిల్యూర్‌కు దారి తీయవచ్చు. ఈ వ్యాధికి సంబంధించిన ముఖ్యమైన ఐదు లక్షణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కుడి వైపున నొప్పి:
కుడి పక్కటెముకల కింద నొప్పి, ఒత్తిడి లేదా భారంగా అనిపించడం ఫ్యాటీ లివర్ సూచన. లివర్ వాపు దీనికి కారణం.
బరువు తగ్గడం:
కారణం లేకుండా ఆకలి తగ్గడం, వేగంగా బరువు కోల్పోవడం ప్రమాదకర సంకేతం. పోషకాలను లివర్ సరిగ్గా గ్రహించకపోవడం దీనికి కారణం.
తరచుగా వాంతి:
ముఖ్యంగా నూనె పదార్థాలు తిన్న తర్వాత వికారం లేదా వాంతులు వంటివి తరచుగా ఉంటే లివర్‌కు సంబంధించిన సమస్య కావచ్చు.
మలం రంగులో మార్పు:
మలం పసుపు, బూడిద లేదా నలుపు రంగులో ఉంటే పిత్త రసంలో అసమతుల్యత ఉన్నట్లు గుర్తించాలి.
కడుపు, కాళ్ల వాపు:
కడుపు ఉబ్బరం, కాళ్లు, మడమలు వాపు రావడం లివర్ వ్యాధిలో సాధారణం. దీనిని ఎసైటిస్ లేదా ఎడెమా అంటారు. లివర్ రక్త ప్రసరణను, ద్రవ సమతుల్యతను నియంత్రించలేనప్పుడు ఇలా జరుగుతుంది. ఈ లక్షణాలు ఎక్కువ రోజులు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. మన శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం కాబట్టి.. దానిని జాగ్రత్తగా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: నల్ల ద్రాక్ష రసం ఆరోగ్యానికి అమృతం.. దీనిని తాగే విధానం తెలుసుకోండి
ఫ్యాటీ లివర్ ఉన్నవారు మేలు చేసే ఆహారాలు తీసుకోవటం మంచిది. వాటిల్లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చేపలు, గింజపప్పులు, ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా మేలు చేస్తాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ఆల్కహాల్, అనారోగ్యకరమైన కొవ్వులకు దూరంగా ఉంటే మంచది. వీటితోపాటుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. సరైన ఆహారం, వ్యాయామంతో ఫ్యాటీ లివర్‌ను నియంత్రించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి:దహీలో చియా సీడ్స్.. ఆరోగ్యానికి అదనపు బలమని తెలుసా..?