POKపై పాక్ సవితి తల్లి ప్రేమ.. ప్రభుత్వంపై నిరసనలకు కారణం ఇదే!

PoKలో గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి 12 మందిని బలితీసుకున్నాయి. పాక్ ఆక్రమించిన ప్రాంతం కాబట్టి అక్కడ ప్రజలపై సవితి తల్లిప్రేమ ఒలగబోస్తోంది.

New Update
POK

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి 12 మందిని బలితీసుకున్నాయి. పీఓకే ఎలాగూ ఇండియా నుంచి కొట్టేసిన ప్రాంతం కాబట్టి అక్కడ ప్రజలపై సవితి తల్లిప్రేమ ఒలగబోస్తోంది పాక్. ఆర్మీచే వారిపై అణిచివేత విధానం కొనసాగిస్తోంది. 1947 నుంచి POK ప్రజలు అటూ ఇటూ కాకుండా అయోమయంలో బతుకుతున్నారు. వాస్తవానికి వారు ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆక్రమణలో ఉన్నా.. ఇండియా మూలాలు ఉన్నవారు. వారి సంస్కృతి, ఆచార, కట్టుబాట్లు అన్నీ ఇండియాతో ముడిపడి ఉంటాయి. ఇటీవల పాక్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. దానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

PoK పేరుకు శాసనసభ, ప్రత్యేక పరిపాలన వ్యవస్థ ఉన్నా కూడా అక్కడి సైన్యం, ఉగ్రమూకల కనుసన్నల్లోనే పాలన సాగుతుంది. స్థానిక పాలకులు, అధికారులు పాక్ పాలకవర్గానికి 'కీలుబొమ్మలు'గా వ్యవహరిస్తున్నాయని అక్కడి ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అక్కడ ప్రజల జీవితాలు అత్యంత దుర్భరంగా ఉన్నాయని, నిరంతర అణచివేత, ఆర్థిక దోపిడీకి గురవుతున్నారని అక్కడి ప్రజల ఆందోళనలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని 'ఆజాద్ కాశ్మీర్' అని పిలుస్తున్నా, వాస్తవానికి పాక్ కేంద్ర ప్రభుత్వం, సైన్యమే ఈ ప్రాంత వ్యవహారాలను నియంత్రిస్తుంది.

గడచిన 70 ఏళ్లుగా తమకు ప్రాథమిక హక్కులు కూడా దక్కడం లేదని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. నిరసనలకు దిగిన పౌరులపై పాకిస్తాన్ భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతుండడం, కాల్పులు జరపడం, ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడం వంటి చర్యలు పాక్ పాలన నిరంకుశత్వాన్ని తెలియజేస్తున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతున్న ప్రజలపై హింసను ప్రయోగించడం ద్వారా ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కులు ఏ మేరకు ఉల్లంఘనకు గురవుతున్నాయో స్పష్టమవుతోంది. 'జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' నేతృత్వంలో ఈ నిరసనలు ఉద్ధృతమయ్యాయి. పీఓకే ప్రజలు ప్రభుత్వం ముందు ఏకంగా 38 డిమాండ్లను ఉంచారు. 

Also Read :  విదేశీ ఉద్యోగులపై సెనేటర్ల ప్రశ్నలు..టీసీఎస్ కు లేఖ

వీటిలో ప్రధానమైనవి:

అధిక విద్యుత్ బిల్లులు, కోతలు:పీఓకే ప్రాంతంలో మాంగ్లా ప్రాజెక్ట్ వంటి హైడ్రోపవర్ ప్రాజెక్టుల ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ, తమకు అధిక ధరలకు విద్యుత్‌ను అమ్ముతున్నారని, తరచూ విద్యుత్ కోతలు విధిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు.
గోధుమ పిండిపై సబ్సిడీ: నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, గోధుమ పిండిపై సబ్సిడీని పాక్ దుర్మార్గపు ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమ వద్ద కూడా సబ్సిడీ కొనసాగించాలని, సవతి తల్లి ప్రేమ చూపడం మానేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అధిక పన్నులు రద్దు:పీఓకే ప్రజలపై అనవసర పన్నులు మోపి వేదిస్తోంది పాక్ సర్కార్. అసలే ఉపాధి లేక, మరో వైపు అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న తమపై పన్నులు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రాథమిక హక్కుల అమలు: దాదాపు 70 ఏళ్లుగా తమకు ప్రాథమిక హక్కులు కూడా దక్కడం లేదని, పాకిస్తాన్ తమను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వ్ స్థానాల రద్దు: పాకిస్తాన్‌లో స్థిరపడిన కాశ్మీరీ శరణార్థుల కోసం పీఓకే అసెంబ్లీలో కేటాయించిన 12 రిజర్వ్ సీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సీట్ల ద్వారా పాక్ ప్రభుత్వం అసెంబ్లీని అస్థిరపరుస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ డిమాండ్ల సాధన కోసం నిరసనకారులు 'షటర్-డౌన్', 'వీల్-జామ్' పేరుతో బంద్‌కు పిలుపునిచ్చారు. ముజఫరాబాద్, రావల్కోట్, కోట్లి వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నిరసనకారులను అదుపు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను, పారామిలిటరీ దళాలను మోహరించింది. ఈ క్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 12మందికి పైగా పౌరులు మరణించారు. వంతెనలపై ఆర్మీ అడ్డుగా పెట్టిన కంటైనర్లను నిరసనకారులు నదిలోకి తోసి ఆందోళనలను కొనసాగించారు. ప్రజాగ్రహాన్ని అణచివేసేందుకు పీఓకేలో ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసి వారి మద్య కమ్యూనికేషన్ లేకుండా చేసి రాక్షసానందం పొందుతోంది పాక్. ఈ ఘటనలపై అంతర్జాతీయ సమాజం కూడా దృష్టి సారించగా, భారత్ ఈ అణచివేత చర్యలపై పాకిస్తాన్ జవాబుదారీగా ఉండాలని స్పష్టం చేసింది. మొత్తంగా, పీఓకేలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం, పాక్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అణచివేత వైఖరే ఈ భారీ నిరసనలకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.

Also Read :  POK: పీఓకేలో అల్లర్లు.. భారత్‌ సంచలన ప్రకటన

Advertisment
తాజా కథనాలు