Israel-Gaza: ఇజ్రాయెల్‌ చేతుల్లోకి గాజా.. తరలిపోతున్న పాలస్తీనియులు

గాజాలో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఓవైపు వైమానిక దాడులతో భారీ భవనాలను కూల్చేస్తూ.. మరోవైపు భూతల దాడులతో కూడా విరుచుకుపడుతోంది.

New Update
Israel burning the ground in Gaza City assault

Israel burning the ground in Gaza City assault

గాజా(gaza) లో పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయి. ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే దిశగా ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఓవైపు వైమానిక దాడులతో భారీ భవనాలను కూల్చేస్తూ.. మరోవైపు భూతల దాడులతో కూడా విరుచుకుపడుతోంది. దీంతో నిత్యం వేలాది మంది గాజా నుంచి దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు జరిగిన దాడుల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో ఒక్క గాజాలోనే ఏకంగా 78 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. 

Also Read: ఇండియాకు సపోర్ట్‌గా పాకిస్తాన్ మంత్రి.. ‘ట్రంప్ చెప్పింది అబద్ధం’

3.5 లక్షల మంది వెళ్లిపోయారు

హమాస్‌ను అణిచివేసే దిశగా ఇజ్రాయెల్‌(israel) దాడులు చేస్తూనే ఉంది. గాజాలో మొత్తంగా 3 వేల మంది వరకు హమాస్ మిలిటెంట్లు ఉన్నట్లు ఇజ్రాయెల్ భావిస్తోంది. వాళ్లని అంతం చేయడాన్నే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం భూతల దాడుల ప్రారంభించింది. అంతకుముందు గాజా సిటీని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 3.5 లక్షల మంది ఇప్పటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోమవారం ఒక్కరోజే ఏకంగా 2,20,000 మంది వెళ్లిపోయారు.  

ఇజ్రాయెల్ దాడులు మంగళవారం కూడా కొనసాగడంతో వేలాది మంది అక్కడి నుంచి తరలివెళ్లిపోయారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోందని, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఐరాస కమిషన్ కూడా ఓ రిపోర్టు అందించింది. అది ఇచ్చిన రోజే ఈ దాడులు ప్రారంభం కావడం కలకలం రేపింది. గాజాలో జాతి విధ్వంసానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌ను అడ్డుకోవాలని ఆ రిపోర్టు అంతర్జాతీయ సమాజానికి సూచనలు చేసింది. 

Also Read: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్ నుంచి అమెరికా అధ్యక్షుడికి హామీ

వెనక్కి తగ్గేదే లేదు

ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ కూడా దీనిపై మాట్లాడారు. గాజా తగలబడుతోందని.. ఐడీఎఫ్‌ దళాలు ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడుతున్నాయని అన్నారు. తమ టార్గెట్ నెరవేరేవరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. దాడులు కొనసాగిస్తూనే ఉంటామన్నారు. తమ బందీలను రిలీజ్‌ చేయించేందుకు, హమాస్‌ను ఓడించేందుకు తీవ్ర స్థాయిలో తాము పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే గాజా నగరం నుంచి తీర ప్రాంతానికి వెళ్లే రోడ్డుపై కార్లు, ట్రక్కులతో రద్దీ నెలకొంది. 

ఇజ్రాయెల్ చేతుల్లోకి గాజా

ప్రజలు తమ సామాన్లను వెంటబెట్టుకొని అందులో వెళ్లిపోతున్నారు. కొందరైతే వాహనాల పైకప్పులపై కూడా కూర్చోని వెళ్లిపోతున్నారు. మరోవైపు గాజా శివార్ల నుంచి మధ్యలోకి వెళ్లేందుకు తమ బలగాలు ఆపరేషన్‌ను మొదలుపెట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యాధికారి చెప్పారు. ఆకాశహర్మ్యాలే టార్గెట్‌గా బాంబులతో దాడులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడులు పూర్తయ్యేసరికి తీర ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తంగా చూసుకుంటే గాజాను త్వరలోనే ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. 

Also Read: ఆపరేషన్‌ సిందూర్‌లో ముక్కలైన మసూద్‌ అజార్‌ కుటుంబం.. వీడియో

గాజాను స్వాధీనం చేసుకుంటే ?

ఇజ్రాయెల్ గాజాను స్వాధీనం చేసుకుంటే అక్కడ మానవత సంక్షోభం పెరిగిపోతుంది. ప్రజలకు ఆహారం, వైద్య సేవలు, ఆశ్రయం లాంటి ప్రాథమిక అవసరాలు అందించే చట్టపరమైన బాధ్యత ఇజ్రాయెల్‌కు ఉంటుంది. అలాగే అంతర్జాతీయంగా కూడా ఇజ్రాయెల్‌పై తీవ్రంగా విమర్శలు వస్తాయి. దీంతో అరబ్ దేశాలతో దాని సంబంధాలు మరింత క్షీణిస్తాయి. ఐక్యరాజ్యసమితి, ఐరోపా సమాఖ్య వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ చర్యను ఖండించే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్‌పై దౌత్య మరియు ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుంది. 

ఇప్పటికే రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభం వల్ల గాజాలో రియల్‌ ఎస్టేట్ రంగం కూడా స్తంభించిపోయింది. భవిష్యత్తులో ఈ ప్రభావం కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఇజ్రాయెల్ దాడుల వల్ల గాజాలో ఇప్పటికే వేలాది భవనాలు, వాణిజ్య సముదాయాలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్‌ ఆస్తులకు కూడా తీవ్రంగా నష్టం వాటిల్లింది. స్థానిక పెట్టుబడిదారులు కూడా అక్కడి రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టడం లేదు. గాజాను పునర్నిర్మించాలంటే భారీగా నిధులు అవసరం అవుతాయి. అంతర్జాతీయ సంస్థలు, విరాళాల ద్వారా మాత్రమే ఈ పునర్నిర్మాణ కార్యక్రమాలు జరుగుతాయి. 

ట్రంప్‌ వ్యూహం

గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంటే అమెరికా కూడా ఇందులో జోక్యం చేసుకోనుంది. అక్కడ రియల్ ఎస్టేట్‌ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ట్రంప్‌ ప్లాన్ చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ అది అంత సులభం కాదు. ఇది రాజకీయ, సైనిక, అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉంటుంది. 

ఇదిలాఉండగా యెమెన్‌ తీర ప్రాంత నగరమైన హొడైడాపై కూడా మంగళవారం ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. దీంతో తమ ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేశామని హౌతీ రెబల్స్‌ ప్రకటన చేశారు. హౌతీల సైనిక స్థావరాలపై తాము దాడులు చేశామని ఇజ్రాయెల్‌ పేర్కొంది. గతవారం యెమెన్‌లో ఇజ్రాయెల్‌ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 31 మంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వాళ్ల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు రాజధాని సనాలో వేలాదిమంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధానమంత్రి నెతన్యాహు ఇంటి ముందు గాజాలో బందీలుగా ఉన్న వారి బంధువులు సోమవారం నిరసనకు దిగారు. గాజా సిటీలో దాడులు ఆపాలంటూ డిమాండ్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు