Bazooka: అమెరికాపై వాణిజ్య అస్త్రాన్ని ప్రయోగించనున్న EU.. ఇదే జరిగితే అంతర్జాతీయ సంక్షోభమే

ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే, నెదర్లాండ్స్‌, జర్మనీ, స్వీడన్, యూకే నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం దిగుమతి పన్ను విధిస్తానని ట్రంప్ తేల్చిచెప్పారు. దీంతో EU దేశాలు యాంటీ కోర్సన్ ఇన్‌స్ట్రూమెంట్ (ACI) ని తెరపైకి తీసుకొచ్చాయి.

New Update
Economy Europe weighs using trade ‘bazooka’ against the U.S

Economy Europe weighs using trade ‘bazooka’ against the U.S

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్‌లాండ్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తమకు సపోర్ట్‌ ఇవ్వని దేశాలపై సుంకాలు(donald trump tariffs) పెంచుతానంటూ బెదిరిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రీన్‌లాండ్‌ అంశంలో యూరప్‌పై టారిఫ్‌లు విధిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, నార్వే, నెదర్లాండ్స్‌, జర్మనీ, స్వీడన్, యూకే నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం దిగుమతి పన్ను విధిస్తానని తేల్చిచెప్పారు.  

అంతేకాదు జూన్‌ 1 నుంచి ఈ పన్ను 25 శాతం కూడా పెరగవచ్చని హెచ్చరించారు. ట్రంప్(Donald Trump) తీసుకున్న ఈ నిర్ణయాన్ని యురోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా ఖండిస్తోంది. ఇది బ్లాక్‌మెయిలింగ్ చేయడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శక్తివంతమైన యాంటీ కోర్సన్ ఇన్‌స్ట్రూమెంట్ (ACI)ని తెరపైకి తీసుకొచ్చింది. ఇతర దేశాల నుంచి ఆర్థిక ఒత్తిళ్లు లేకుండా రక్షించుకునేందుకే ఈయూ దేశాలు ఏసీఐని రూపొందించాయి. దీనివల్ల ఇతర దేశాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏసీఐను 2023 డిసెంబర్ నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. కానీ దీన్ని ఇప్పటిదాకా ఏ దేశంపై వినియోగించలేదు. ఇప్పుడు మొదటిసారిగా అమెరికాపై ప్రయోగించేందుకు ఈయూ సిద్ధమవుతోంది.   

Also Read: గ్రీన్‌ల్యాండ్‌ పై ట్రంప్‌ బలప్రయోగం..కాల్చి పారేస్తామన్న డెన్మార్క్‌..రంగంలోకి ఈయూ

అమెరికాపై ఏసీఐ ప్రయోగిస్తే జరిగే పరిణామాలు 

యురోపియన్ యూనియన్.. అమెరికాపై ACI అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ దేశం నుంచి వచ్చే వస్తువులపై భారీగా దిగుమతి సుంకాలు విధిస్తుంది. ముఖ్యంగా అమెరికాలోని కీలక రాష్ట్రాల నుంచి వచ్చే బోర్బన్ విస్కీ, హార్లే డేవిడ్సన్ బైక్‌లు, వ్యవసాయ ఉత్పత్తులపై ఈ ఎఫెక్ట్ పడుతుంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా ఈయూపై టారిఫ్‌లు పెంచితే.. చివరికి ఇది పూర్తిస్థాయి వాణిజ్య యుద్ధానికి దారితీసే అవకాశం ఉంటుంది. వాస్తవానికి అమెరికా-యూరప్ మధ్య ఏటా ట్రిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుంది. పరస్పరం ఆంక్షలు విధించుకుంటే విమానయాన విడిభాగాలు, ఫార్మాస్యూటికల్స్, ఇతర సాంకేతిక పరికరాల సరఫరా ఆగిపోతుంది. దీనివల్ల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ద్రవ్యోల్బణం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. చివరికి ఇది అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. 

ACI కింద కేవలం సుంకాలు మాత్రమే కాక అమెరికా కంపెనీలు యూరప్‌లో పెట్టుబడులు పెట్టకుండా ఆంక్షలు విధించే ఛాన్స్ ఉంది. అలాగే ప్రభుత్వ కాంట్రాక్టుల నుంచి అమెరికాకు చెందిన కంపెనీలను తొలగించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆపిల్, గూగుల్, అమెజాన్ లాంటి టెక్ దిగ్గజాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు అమెరికా, ఈయూ మధ్య విభేదాలు వస్తే నాటో (NATO) కూటమిలో చీలికలు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇది రష్యా, చైనా లాంటి దేశాలకు అనుకూలంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Bazooka

Also Read: గాజా శాంతి మండలికి మోదీకి ఆహ్వానం

ఈయూ దేశాలు ఏసీఐని ఎప్పుడు, ఎలా వాడాలనే దానిపై ప్రస్తుతం అంతర్గత చర్చలు జరుగుతున్నాయి. ట్రంప్ తన టారిఫ్ ప్లాన్‌తో ముందుకు వెళ్తే.. యూరప్ కూడా ఈ "వాణిజ్య బ్రహ్మాస్త్రాన్ని" ప్రయోగించడం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) రూల్స్‌ కూడా ప్రశ్నార్థకమవుతాయి. అయుతే ACI ద్వారా ఈయూ దాదాపు 93 బిలియన్‌ పౌండ్ల (రూ11.31 లక్షల కోట్లు) విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే ఛాన్స్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనివల్ల ట్రంప్‌ టారిఫ్‌ల విషయంలో టారిఫ్‌ల అంశంలో వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమాన్యుయోల్ మాక్రన్‌ సహా పలువురు ACIని ప్రయోగించాలని అంటున్నారు. మరి భవిష్యత్తులో గ్రీన్‌లాండ్ విషయంలో ఏం జరుగుతోందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే. 

ఈయూ చర్యను ట్రంప్‌ చర్యలకు కౌంటర్‌గా తీసుకున్న అత్యంత కఠినమైన వాణిజ్య ప్రతీకార చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా అమెరికాపై భారీ టారిఫ్‌లు విధించవచ్చు. అయితే.. ఇది అమెరికా–యూరప్‌ వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారి తీయడంతో పాటు అంతర్జాతీయ సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతోంది. 

Advertisment
తాజా కథనాలు