/rtv/media/media_files/2026/01/19/fotojet-2026-01-19t112716-2026-01-19-11-27-39.jpg)
Denmark threatens to burn down Trump's use of force on Greenland
Greenland: డెన్మార్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని బల ప్రయోగంతో సొంత చేసుకోవాలని అమెరికా భావిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రీన్‌ల్యాండ్‌ను తమకు అప్పగించాలని ఒత్తిడి చేస్తున్నారు. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతామని హెచ్చరికలు చేశారు. గ్రీన్‌ల్యాండ్ తమ భద్రతకు కీలకమని యూఎస్ వాదిస్తోంది. ఇదిలా ఉంటే, డెన్మార్క్ ప్రధాని మాత్రం ఇది నాటో కూటమికి ముగింపు పలుకుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది.
గతవారం వెనుజులాపై సైనిక చర్యను చేపట్టి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను బందీలుగా తీసుకున్న అమెరికా చూపు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద దీవి గ్రీన్‌లాండ్‌పై పడింది. దానిని స్వాధీనం చేసుకోడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై డెన్మార్క్ తీవ్రంగా స్పందించింది. ఆ దీవిలో అడుగుపెడితే కాల్చిపడేస్తామని అమెరికాకు డెన్మార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్ (Mette Frederiksen) ట్రంప్‌కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.ట్రంప్ బెదిరింపులకు యూరప్ భయపడదని, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
'యూరప్ ఎవరికీ లొంగదు' - డెన్మార్క్ ప్రధాని ధ్వజం
గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు విక్రయించే ప్రసక్తే లేదని డెన్మార్క్ ప్రభుత్వం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, గ్రీన్‌లాండ్ దక్కించుకోవడానికి ట్రంప్ తాజాగా ఎనిమిది యూరప్ దేశాలపై (డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటివి) భారీ సుంకాలను (Tariffs) ప్రకటించారు. దీనిపై స్పందిస్తూ మెటె ఫ్రెడెరిక్సన్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు.
బ్లాక్‌మెయిలింగ్‌కు తావులేదు: "యూరప్ ఎవరి బెదిరింపులకు తలొగ్గదు, బ్లాక్‌మెయిల్ కాబోదు" అని ఆమె స్పష్టం చేశారు. గ్రీన్‌లాండ్ డెన్మార్క్ రాజ్యంలో అంతర్భాగమని, దాని భవిష్యత్తును అక్కడి ప్రజలు, డెన్మార్క్ మాత్రమే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అమెరికా ఒక మిత్రదేశంపై సైనిక చర్య లేదా ఆర్థిక ఆంక్షల ద్వారా ఒత్తిడి తేవడం అనేది నాటో (NATO) కూటమి ఉనికికే ప్రమాదమని ఆమె హెచ్చరించారు.డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను అమెరికా భద్రతకు అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తున్నారు. రష్యా, చైనాల ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి ఈ ద్వీపం అవసరమని ఆయన వాదన.గ్రీన్‌లాండ్ విక్రయానికి సహకరించని దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం, జూన్ నుంచి 25 శాతం వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రకటించారు."సులభమైన మార్గంలో కాకపోతే, కష్టమైన మార్గంలోనైనా (సైనిక చర్య ద్వారా)" గ్రీన్‌లాండ్‌ను తీసుకుంటామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.
ఐక్యమైన యూరప్
డెన్మార్క్ ప్రధాని పిలుపుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ మరియు ఇతర యూరప్ దేశాల నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. అమెరికా ఆర్థిక ఒత్తిడికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడతామని, అవసరమైతే అమెరికా ఉత్పత్తులపై కూడా ప్రతిగా సుంకాలు విధిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
గ్రీన్‌లాండ్ ప్రజల నిరసన
గ్రీన్‌లాండ్ రాజధాని నూక్ లో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి అమెరికా ప్రయత్నాలను నిరసిస్తున్నారు. "గ్రీన్‌లాండ్ అమ్మకానికి లేదు" (Greenland is not for sale) అనే నినాదాలతో వారు హోరెత్తిస్తున్నారు. ఈ పరిణామాలు అమెరికా మరియు యూరప్ దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహ సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి.
ట్రంప్‌ను కాల్చి పారేస్తాం..డెన్మార్క్
గ్రీన్‌లాండ్ జోలికి వస్తే చూస్తూ ఉరుకోబోమని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ హెచ్చరికలు చేసింది. గ్రీన్‌లాండ్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నకు బదులిస్తూ.. ‘ఒకవేళ గ్రీన్‌లాండ్‌లోకి అమెరికా చొరబడితే సైన్యం ముందు కాల్పులు జరిపి తర్వాత ప్రశ్నలు అడగాలి.. 1952 సైనిక నిబంధన ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూడకుండానే చొరబాటుదారులపై దాడి చేయొచ్చు. ఆ నిబంధన ఇంకా అమల్లోనే ఉంది’ అని తేల్చిచెప్పింది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలతో పొరుగున ఉండే దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. కాగా, డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ గత జనవరిలో ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు.
డెన్మార్క్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి గల గ్రీన్‌లాండ్ భూభాగాన్ని సొంతం చేసుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుదల అంతర్జాతీయ వాణిజ్య యుద్ధానికి దారితీస్తుంది. గ్రీన్‌లాండ్ ఆక్రమణను వ్యతిరేకిస్తున్న 8 కీలక యురోపియన్ మిత్రదేశాలపై భారీగా సుంకాలను విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. ట్రంప్ టారిఫ్ బెదిరింపుల వల్ల సంబంధాలు దెబ్బతిని, పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని యురోపియన్ యూనియన్ (ఈయూ) హెచ్చరించింది.
గ్రీన్‌లాండ్​ విషయంలో ట్రంప్ వైఖరిని ఖండించింది. దీనిపై ఆదివారం బ్రస్సెల్స్‌లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. యూరప్ దేశాలపై ట్రంప్ పన్నుల యుద్ధానికి దిగడం వల్ల అమెరికా–-యూరప్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా తీరు వల్ల అట్లాంటిక్ దేశాల మధ్య సంబంధాలు ‘ప్రమాదకరమైన స్థితికి’ చేరుకుంటాయని ఈయూ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ హెచ్చరించారు.
ఈయూ ఖండన
గ్రీన్‌లాండ్ విషయంలో ట్రంప్ తీరును ఈయూ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇది పూర్తిగా తప్పుడు చర్య అని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. నాటో మిత్రదేశాలపై ఇలాంటి సుంకాలు విధించడం సమంజసం కాదని, ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో చర్చిస్తామని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ అన్నారు. ఈ బెదిరింపులకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.
అమెరికా బ్లాక్‌మెయిల్‌కు లొంగేది లేదని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ హెచ్చరించారు. దీనిపై ఎలా స్పందించాలనే విషయంపై ప్రస్తుతం ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలు, నార్వే, బ్రిటన్‌తో తీవ్రస్థాయిలో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఈయూ దేశాలపై ట్రంప్ టారిఫ్ హెచ్చరికలతో చైనా, రష్యా పండుగ చేసుకుంటాయని ఈయూ ఫారిన్ పాలసీ చీఫ్ కాజా కల్లాస్ పేర్కొన్నారు. మిత్రదేశాల మధ్య విభేదాల వల్ల ఆ రెండు దేశాలు ప్రయోజనం పొందుతాయని అన్నారు. అంతర్జాతీయ చట్టాన్ని కాపాడుకునే విషయంలో ఈయూ ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా తెలిపారు. ట్రంప్ ప్రకటన ఆశ్చర్యకరమని డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోకే రాస్‌ముస్సేన్ పేర్కొన్నారు.
Follow Us