Chandrababu: ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు? పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న వైసీపీ ప్రభుత్వం..! నాలుగేళ్ళుగా కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా జూలు విదిల్చారు. ఇన్నాళ్ళు కేవలం మాటలతో, కేసులతో భయపెట్టారు. కానీ ఇప్పుడు ఏకంగా జైల్లోకి నెట్టారు. ఇలాగే ఒక దాని మీద మరొక కేసు పెట్టి కరెక్ట్ గా ఎన్నికల టైమ్ కి కేసులతో టీడీపీ చతికిలపడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం. By Manogna alamuru 12 Sep 2023 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Chandhrababu Arrest Row: ఏపీలో రాజకీయం మరింత నాటకీయంగా మారుతోంది. గత నాలుగున్నరేళ్ళుగా వైసీపీ (YCP), టీడీపీ (TDP) కొట్టుకుంటూనే ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ప్రజల్లో మంచి పేరు సంపాదించడానికి ఎత్తులకు పైఎత్తులు వేసుకున్నారు. కానీ అదును చూసి విజృంభించింది వైసీపీ. నిత్యం నిప్పు అని చెప్పుకునే తన ప్రత్యర్థి చంద్రబాబుపై ఉన్న కేసులన్నింటినీ ఒకేసారి తెరపైకి తీసుకువచ్చింది. మూలన పడిన చిన్నా చితకా కేసులను కూడా దుమ్ముదులిపి మరీ తెరపైకి తీసుకువచ్చారు. తాజాగా పక్కా ఆధారాలతో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం (Skill Development Scam) లో చంద్రబాబును అరెస్ట్ సీఐడీ.. ఆయనపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (Amaravati Inner Ring Road case) కేసు సహా మరికొన్ని కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇక ఈ కేసులపై స్పందిస్తూ బాబు బావమరిది బాలయ్య.. "మా మీద మరిన్ని కేసులు పెడతారు. ఎవరికీ భయపడం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం’’ అంటూ ఓ డైలాగ్ వేశారు. పద్యాలతో ప్రభుత్వంపై పంచ్ లు విసిరారు. ఇక జగన్ (YS Jagan) విసిరిన సవాలును అంతే ధీటుగా ఎదుర్కొంటామని టీడీపీ నేతలు సైతం కన్నెర్ర చేస్తున్నారు. ఇదిగో వీళ్ళందరూ ఇలా రియాక్ట్ అవ్వడమే జగన్ కు కావాల్సిందని స్పష్టంగా అర్ధమవుతోంది. పొలిటికల్ మైండ్ గేమ్ లో కాకలు తీరిన జగన్.. ఈ రియాక్షన్ లను తనకు ఫేవర్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇలా కేసులతో టీడీపీ పీకల్లోతు కూరుకుపోయి ఎన్నికల్లో చతికిలబడేలా చేయాలన్నది వైసీపీ వ్యూహం! చంద్రబాబు అరెస్టయ్యాక పెద్ద గోలే జరిగింది. ఆయన లాయర్లు, టీడీపీ నేతలు ఏసీబీ కోర్టు చుట్టూ తిరిగారు. బెయిల్ కోసం నానాతంటాలు పడుతున్నారు. జైల్లో వద్దు హౌస్ అరెస్ట్ కు అనుమతిని ఇయ్యండి అంటూ హైకోర్టులో పిటిషన్ వేస్తారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు కొడుకు లోకేష్ యువగళం (Lokesh Yuvagalam) యాత్రను ఆపేసి ఇంటికి వచ్చేశాడు. బాలయ్య (Balakrishna) అయితే వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాడు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగుతున్నారు. ఎన్నికలే టార్గెట్ గా.. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ఇంకా ఏడు నెలలే టైమ్ ఉంది. ఈ సమయంలో ప్రతిపక్షాన్ని లిటిగేషన్ కేసుల్లో ఇరికించి ఉక్కిరిబిక్కిరి చేయాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. బాబుపైనే కాకుండా, లోకేశ్‌పైనా కేసులు పెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ పేరును కూడా చేర్చారు. దీంతో పాటూ మరిన్ని కేసులు పెడతారని.. లోకేష్ యాత్రను అడ్డుకోవడానికి కేసుల పేరుతో అరెస్ట్ చేస్తారని ఇప్పటికే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పార్టీ సారథులైన తండ్రీకొడుకులు జైలుపక్షులై పార్టీని నడిపించే దిక్కులేకుండా పోతుంది. కీలకమైన ఎన్నికల కాలంలో అటు వ్యూహాలు రచించేవారు లేక, ఇటు ప్రచారం చేసే వారు లేక ద్వితీయ శ్రేణి నాయకులతో సరిపెట్టాల్సి వస్తుంది. ఇక టీడీపీలో పెద్ద నాయకులు అయిన అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి వారిని కూడా పాత కొత్త కేసుల్లో ఇరికిస్తే అదీ సాధ్యం కాకపోవచ్చు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని విపక్షాన్ని ముప్పుతిప్పలు పెట్టడానికి అధికార పక్షం ఏ అవకాశాన్నీ జారవిడుచుకోదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కేసులతో అష్టదిగ్బంధనం.. ఇప్పుడు పెట్టిన కేసులే కాకుండా చంద్రబాబుకు మరెన్నో పెద్ద పెద్ద కేసులతో కూడా సంబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. ఏలేరు స్కామ్ వంటి పెద్దపెద్ద కేసులే ఉన్నాయి. అయితే వాటిని మళ్ళీ తిరగదోడే బదులు చిన్న కేసులే మేలని వైసీ భావిస్తోంది. ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్, అమరావతి అసైన్డ్ భూములు, ఇన్‌సైడర్ ట్రేడింగ్ వంటి మరెన్నో కేసుల్లో బాబు ప్రమేయానికి పక్కా ఆధారాలు సేకరించి ఒకదాని తర్వాత ఒక కేసులో అరెస్టులు, రిమాండ్లతో ఊపిరాడనివ్వకుండా చేస్తే విపక్షాన్ని పూర్తి దెబ్బతీయొచ్చు. దాని కోసమే ఇన్నాళ్ళు టైమ్ తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. పూర్తి సమాచారం సేకరించాకనే అడుగులు ముందుకు వేశారని సమాచారం. మరోవైపు ప్రజా సంక్షేమ పథకాలతో ఈ నాలుగేళ్ళల్లో జనాల్లోకి జగన్ బాగా వెళ్ళారు. ఆ పథకాలే తనను మళ్ళీ గెలిపిస్తాయనే నమ్మకం వచ్చేవరకు కూడా టీడీపీ విషయంలో జగన్ ముందుకు వెళ్ళలేదు. విపక్షానికి ప్రజల్లో ఆదరణ లేదని నిర్ధారించుకునేవరకు వేచి చూసి, ఇప్పుడు అదను చూసి దెబ్బకొట్టినట్లు కనిపిస్తోంది. సర్వేలు కూడా మళ్ళీ గెలుపు వైపీసీదేనని చెబుతుండడం, లోకేశ్ పాదయాత్రకు స్పందన లేకపోవడంతో ఇదే మంచి సమయం అని భావించారు జగన్. ఇప్పుడు అయితేనే దెబ్బ బలంగా పడుతుందని అరెస్ట్ కు సాహసించారని అర్థం అవుతోంది. ఆరోపణలకు చెక్ పెట్టేలా ప్లాన్.. మరోవైపు ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టే దిశగా సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. మోదీ అండతో జగన్ లక్షల కోట్ల అవినీతి చేస్తున్నారని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. దీనికి బదులుగానే బాబును జైలుకు పంపించారన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఒకపక్క తను స్వయంగా అవినీతి కేసులు ఎదుర్కొంటూ, కోర్టులు చుట్టూ తిరుగుతున్న జగన్.. బాబు అవినీతిపై చేసే విమర్శలకు బలం ఉండాలంటే ఆయనను కూడా జైల్లో పెట్టక తప్పని అనివార్య పరిస్థితి నెలకొంది. మరోపక్క కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కూడా జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ ధైర్యంతోనే ఇంత పెద్ద స్టెప్ వేశారని తెలుస్తోంది. బాబును ఎంటర్టైన్ చేసే స్థితిలో బీజెపీ లేదు. రాష్ట్రంలో ఎన్ని గొడవలు ఉన్నా అటు జగన్, ఇటు బాబు తమ గుప్పిట్లో ఉంటారని, ఉంచుకోవాలని దాని వ్యూహం. చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గర నుంచీ బీజెపీ అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే ఇది చాలా క్లియర్ గా అర్ధం అవుతుంది. అయితే ఈ వాదన ఎంత బలంగా వినిపిస్తోందో.. అంతే బలంగా సరిగ్గా దీనికి ఆపోజిట్ గా మరో వాదన కూడా వినిపిస్తోంది. చంద్రబాబుకు సపోర్ట్ ఇవ్వడానికి, ఆయన పూర్వ స్థితి మళ్ళీ తీసుకువచ్చేందుకే బీజెపీ ఈ అరెస్ట్ నాటకం ఆడిస్తోందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు అరెస్ట్ జగన్ కు బాగా కలిసి వస్తుందనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. టీడీపీ నేతలు ఎన్నాళ్ళు కేసులు, అరెస్ట్ లు అని తిరిగితే తమ పార్టీకి అంత లాభం అని వైసీపీ భావిస్తోందట. అందుకే వచ్చే ఎన్నికల వరకూ ఎలా అయినా బాబును జైల్లోనే ఉంచాలని జగన్, ఆయన అనుచరులు భావిస్తున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసుల వివరాలు.. ⇒ చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం ఆరోపణలపై ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 50(1)(2) కింద అరెస్టు చేస్తున్నట్లు సీఐడీ పోలీసులు చెప్పారు. 120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ, ఇంకా 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13(2) రెడ్ విత్ 13(1)(సి),(డి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబు మీద పెట్టిన కేసులు అన్నీ నాన్ బెయిలబుల్ వే. కావాలనే చాలా పకడ్బందీగా బెయిల్ రాకూడదనే రీతిలో కేసులు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇందులో సెక్షన్లు, తీవ్రతను బట్టి శిక్షలు ఉంటాయి. ⇒ 120(బి): ఇది నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఎవరైనా వ్యక్తితో కలిసి కుట్ర చేయడం. ఇందులో గరిష్ఠంగా జీవిత ఖైదు లేదా రెండేళ్ళ లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు కఠిన కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. ⇒ ఇతర నేరాలు కుట్రలో భాగమైతే జైలు శిక్ష విధించవచ్చు. ఈ సందర్భంలో ఆరు నెలల వరకు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ⇒ 166: ఎవరైనా ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉంటూ చట్ట వ్యతిరేకంగా సంస్థ, లేదా వ్యక్తికి నష్టం చేకూర్చినప్పుడు ఈ కేసు పెడతారు. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే ఏడాది వరకు జైలుశిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధిస్తారు. ⇒ 167: ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి అధికారిక పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ పత్రాలను తారుమారు చేయడం, నకిలీ పత్రాలు తయారు చేయడం ద్వారా వ్యక్తి లేదా సంస్థకు నష్టం చేయడం. ఈ సెక్షన్ కింద నేరం రుజువైతే మూడేళ్ల జైలు, లేదా జరిమానా, లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ⇒ 418: మోసానికి సంబంధించిన సెక్షన్ ఇది. చట్టానికి కట్టుబడి ఉన్న వ్యక్తి, ఒక ఒప్పందం ద్వారా నేరస్థులను రక్షించడానికి మోసానికి పాల్పడడం. ఈ సెక్షన్ కింద మూడేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ⇒ 420: మోసం చేయడం, ఏదైనా విలువైన వస్తువు లేదా ఇతరుల ఆస్తిని లాక్కోవడం, నిజాయితీ లేకుండా వ్యవహరించడం మొదలైన వాటికి పాల్పడే వ్యక్తి సెక్షన్ కింద శిక్షార్హులు. ఈ నేరం రుజువైతే కింద గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు. ⇒ 465: ఇది ఫోర్జరీకి సంబంధించినది. బెయిలబుల్ కిందకు వస్తుంది. రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే వీలుంది. ⇒ 468: నకిలీ పత్రం లేదా ఎలక్ట్రానిక్ పత్రం మోసానికి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఫోర్జరీకి పాల్పడటం. దీని కింద ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే వీలుంది. ⇒ 471: నకిలీ పత్రం అని తెలిసి కూడా మోసపూరితంగా సదరు పత్రాన్ని వినియోగించడంపై ఈ సెక్షన్ వాడతారు. ఇది బెయిలబుల్ సెక్షన్. ఈ విషయంలో మోసాన్ని బట్టి శిక్షలు విధిస్తారు. ⇒ 409: ప్రజాప్రతినిధిగా, బ్యాంకర్‌గా, ప్రభుత్వ ఉద్యోగిగా, వ్యాపారిగా, భాగస్తులుగా, బ్రోకర్‌గా, అటార్నీగా, ఏజెంట్‌గా ఒక ఆస్తిపై బాధ్యత కలిగి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఆ బాధ్యతను విస్మరించి, నమ్మక ద్రోహానికి పాల్పడినట్లు రుజువైతే అతనికి పదేళ్ల ఖైదు లేదా జీవిత ఖైదు, జరిమానా విధించే అవకాశం ఉంది. ⇒ 201: నేరానికి సంబంధించిన సాక్ష్యాన్ని తారుమారు చేయడం కింద ఈ కేసు పెడతారు. ఇందులో తీవ్రతను బట్టి ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే వీలుంది. ⇒ 109 రెడ్ విత్ 34, 37: ఏదైనా నేరాన్ని ఉద్దేశపూర్వకంగా చేయడం లేదా ప్రేరేపించడం. ఒక్క స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులోనే ఇన్ని సెక్షన్లతో బయటకు రాలేని విధంగా చేశారు. మరికొన్ని కేసులు సిద్ధం.. ఇది కాకుండా ఏసీబీ కోర్టులో సీఐడీ (CID) మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (Amaravati Inner Ring Road) కేసులో పీటీ వారెంట్ వేసింది. రింగ్ రోడ్ అలైన్ మెంట్ ను తమకు అనుగుణంగా మార్పులు చేసుకున్నారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేశ్ పేర్లను సైతం చేర్చింది. ఇందులో ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణ, ఏ-3గా లింగమనేని రమేశ్, ఏ-4 లింగమనేని రాజశేఖర్, ఏ-5గా అంజనీ కుమార్, ఏ-6గా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ విచారణను వేగవంతం చేసింది.అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులు చేశారని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఏడాది మే 10న ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 420, 166, 34, 26, 37, 120 బీ వంటివి ఇందులో చేర్చారు. రామకృష్ణ హౌసింగ్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, లింగమనేని అగ్రికల్చర్ పామ్స్, జయని ఎస్టేట్స్‌కు లబ్ది కలిగించేలా ఇన్నర్ రింగ్ అలైన్‌మెంట్స్ మార్చారని రామకృష్ణారెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుపై గతేడాదే చంద్రబాబుపై కేసు నమోదయ్యింది. Also Read: PV Ramesh: మేఘా ఇంజినీరింగ్ సంస్థకు పీవీ రమేశ్ రాజీనామా.. బలవంతంగా పంపించారా? Ram Gopal Varma : అవ్వ!! ఇంత కన్నా వెన్నుపోటు వుంటుందా? ఆర్జీవీ మాస్ ర్యాగింగ్.. #elections #arrest #chandhrababu-arrest-row #andhrapradesh #strategy #jagan #chandrababu #politics #government #ycp #jail #amaravati-inner-ring-road-case #skill-development-scam #chandrababu-in-jail #cases మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి