/rtv/media/media_files/2025/01/03/1NScfhfb0KOmX4y7IzEl.jpg)
TGPSC
గత కొంతకాలంగా వివాదాల్లో చిక్కుకున్న గ్రూప్ 1 తుది ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. తెలంగాణ గ్రూప్-1 ఫలితాలను(group 1 exam results) టీజీపీఎస్సీ (Telangana Public Service Commission) బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విడుదల చేసింది. గ్రూప్-1 నియామకాలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు నియమకాలను కొనసాగించవచ్చని ఆదేశించడంతో ఫలితాలు విడుదల చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. మొత్తం 563 పోస్టులకు గాను 562 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా, గ్రూప్-1 ఫలితాల్లో లక్ష్మీదీపిక తొలి ర్యాంకు సాధించింది.
కాగా అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమంతో పాటు, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ తదితర విషయాలను ఆధారంగా చేసుకుని ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు టీజీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మిగిలిన ఒక పోస్టును లీగల్ సమస్యల నేపథ్యంలో విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. గ్రూప్-1లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులంతా ఆర్డీవో పోస్టులను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. టాప్-10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి సాధించారన్నారు. తుది ఎంపిక హైకోర్టు తుదితీర్పునకు లోబడి ఉంటాయని ప్రకటించారు.
కాగా గ్రూపు 1 ఫలితాలకు సంబంధించి హైకోర్టు సీజే ధర్మాసనం సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేసింది. దీంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమం అయింది. తీర్పు వెలువడడానికి ముందు నుంచే బుర్రా వెంకటేశం నేతృత్వంలోని బోర్డు సమావేశమైంది. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన వెంటనే ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఫలితాలు వెల్లడించడానికి అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది. కాగా ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిరూపితమైతే వారి నియామకాలు ఏక్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది. తుది ఎంపికలో మల్టీజోన్-1లో 258, మల్టీజోన్-2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
Also Read : నిరుద్యోగులకు దసరా కానుక.. 7,565 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!
టాప్ ర్యాంకర్‌గా లక్ష్మీదీపిక
గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో మొత్తం 900 మార్కులు ఉండగా హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన లక్ష్మీదీపిక 550 మార్కులతో మల్టీజోన్-2 కేటగిరీలో రాష్ట్ర టాపర్‌గా నిలిచారు. ఉస్మానియాలో డాక్టర్ పూర్తిచేసిన ఆమె గ్రూప్-1 ప్రధాన పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచారు. తుది ఎంపికలో ఆమె ఆర్డీవో పోస్టుకు ఎంపికయ్యారు. మల్టీజోన్-1 కేటగిరీలో హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్విని రాతపరీక్షల్లో 532 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు. మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆమెకు తాజా తుది ఎంపికలో ఆర్డీవో పోస్టు లభించింది. ఇక నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించారు. ఆయన కూడా ఆర్డీవో పోస్టు సాధించారు. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత గ్రూప్-1 పరీక్షలు నిర్వహించినప్పటికీ పోస్టుల నియామకాలు చేపట్టడం మాత్రం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
నిజానికి గ్రూప్-1లో 563 పోస్టులకు టీజీపీఎస్సీ 2024 ఫిబ్రవరిలో తొలిసారి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధాన పరీక్షలు 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించింది. మార్చి 30న ప్రధాన పరీక్షలో అన్ని పేపర్లకు హాజరైన 21,085 మంది అభ్యర్థుల మార్కులను విడుదల చేసింది. అయితే పలు కారణాలతో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ ముగిసిన తరువాత జవాబు పత్రాలు తిరిగి మూల్యాంకనం చేయాలని లేకుంటే మరోసారి పరీక్ష నిర్వహించాలంటూ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. ఈ తీర్పుపై కమిషన్ అప్పీలు చేయగా.. సింగిల్ జడ్జి తీర్పు అమలును హైకోర్టు నిలిపివేసింది. దీంతో కమిషన్ తుది ఎంపిక ఫలితాలను వెల్లడించింది.
ఇది కూడా చూడండి: ఒరే అజము లగెత్తరో.. భారీగా పెరిగిన అమెరికా ఫ్లైట్ టికెట్ల ధరలు.. ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం!