/rtv/media/media_files/2025/09/02/kalwswaram-2025-09-02-07-04-12.jpg)
kaleshwaram project
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో నెలకొన్న అక్రమాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice ఇచ్చిన నివేదిక విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఈ అంశాన్ని సీబీఐకి అప్పగిస్తూ సభ తీర్మానం చేసింది. కాగా దీనికి సంబంధించిన లేఖను కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపింది. నీటిపారుదల శాఖ అధికారులతో పాటు, నీటిపారుదల శాఖ మంత్రి అనుమతి తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం సైతం తీసుకొన్న రాష్ట్ర హోం శాఖ కేంద్ర హోం శాఖకు లేఖ రాసింది.
Also Read : బీఆర్ఎస్ నుంచి కవిత ఔట్.. కొత్త పార్టీకి రిజిస్ట్రేషన్ కంప్లీట్.. పేరు ఇదే!
Investigate Kaleshwaram - Government Letter To CBI
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు(kaleswaram-project) లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనుల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని, దీనివల్ల ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపిన విషయం తెలిసిందే. దీనిపై జులై 31న నివేదిక సమర్పించింది. బ్యారేజీల నిర్మాణంలో జరిగిన తప్పులు, అవకతవకలను కమిషన్ వెల్లడించింది. అనేక లోపాలు, అక్రమాలున్నాయని తేల్చింది. దీనిపై పలు తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని సూచించింది. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించాం. కాళేశ్వరం విషయంలో గతంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్డీఎస్‌ఎ) కూడా దర్యాప్తు జరిపి మేడిగడ్డ బ్యారేజి వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, నాణ్యత తదితర కారణాలని పేర్కొంది. ఈ అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎస్‌ఏ, న్యాయ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేశాయి అంతర్రాష్ట్ర అంశాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున సీబీఐ దర్యాప్తు జరపాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి శాసనసభ ఆమోదం కూడా తెలిపింది’’ అంటూ లేఖలో స్పష్టంచేశారని తెలుస్తోంది. శాసనసభ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారమే లేఖను కేంద్ర హోం శాఖకు పంపింది.
అయితే కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణకు కేంద్ర హోం శాఖ అంగీకరించినట్లయితే దీనిపై మళ్లీ దర్యాప్తు ప్రారంభమవుతుంది. కుంగిన మేడిగడ్డ బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లులు, ఈ మొత్తం అంతిమంగా ఎవరికి, ఎంత చేరిందన్న అంశంపై మరింత లోతుగా దర్యాప్తు చేయించాలని ఘోష్ కమిషన్ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌పైన కూడా దర్యాప్తు చేయాలని కమిషన్ సూచించింది. మేడిగడ్డ బ్యారేజిలో కుంగిన ఏడో బ్లాక్‌ను తిరిగి నిర్మించడంతోపాటు బ్యారేజి మరమ్మతులకయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని కమిషన్ తేల్చి చెప్పింది. అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు వర్తించనుంది. దీంతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చర్య తీసుకొనే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని కూడా కమిషన్ స్పష్టం చేసింది. నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌లను కూడా తప్పు పట్టింది. ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లపైనా చర్యలు తీసుకోవచ్చని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అన్న ఆందోళన ఇంజినీర్లలో మొదలైంది.
ఇది కూడా చూడండి:Weather Update: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ పొంచి ఉన్న గండం.. వచ్చే నెల నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు!