హైదరాబాద్లో చెరువులు, పార్కులను కబ్జా చేసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే అనేక నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. ఈ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై ప్రభుత్వానికి సమచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ” ప్రకృతి, పర్యావరణాన్ని కాపాడటానికి జంట నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురయ్యాయనే సమాచారం తెలిస్తే స్థానిక ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. రాష్ట్రంలో చెరువుల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి.
Also Read: ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్
చెరువులు, కుంటలు ఆక్రమణకు గురైతే దాని వెనుక ఎంత పెద్దవాళ్లు ఉన్నా సరే.. సంబంధిత అధికారులు వచ్చి చర్యలు తీసుకుంటారు. సమాజంలో మనం బాధ్యతగా చేసే ఈ పని భవిష్యత్ తరాలకు ఇచ్చే వరం లాంటిది. మీ ప్రాంతంలో చెరువులు ఆక్రమణకు గురైతే ఎంతటివారైనా, ఏ పార్టీ వారైనా సరే ఈ సమాచారాన్ని ప్రభుత్వానికి ఫిర్యాదు చేయండి. ప్రభుత్వం ఇది ఎవరి మీద కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా వ్యక్తులు, పార్టీల మీద చేస్తున్న పోరాటం కాదు. పాలనలో మార్పు తీసుకురావడానికి తీసుకుంటున్న చర్య” అని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
Also Read: తప్పు ఎవరిది? జీహెచ్ఎంసీ ఎందుకు అనుమతులిచ్చింది? ఆ నష్టపరిహరం ఎవరిస్తారు?