/rtv/media/media_files/2025/11/28/maoists-2025-11-28-18-18-21.jpg)
Maoists
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) చేసిన ప్రకటన అప్పట్లో సంచలనం రేపింది. అదే దేశంలో మావోయిస్టులు(maoists) లేకుండా చేయడం. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించారు. కేంద్రం పెట్టుకున్న ఈ లక్ష్యం మొత్తానికి త్వరలో నెరవేరనున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల మావోయిస్టులకు చెందిన మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ (MMC) ప్రత్యేక జోనల్ కమిటీ తాము లొంగిపోతామని ఓ లేఖ విడుదల చేసింది. తమకు సయమం కావాలని కోరింది. తాజాగా వచ్చే ఏడాది జనవరి 1న ఆయుధాలు వదిలేసి సరెండర్ అవుతామని మరో సంచలన ప్రకటన చేసింది.
ఇక వివరాల్లోకి వెళ్తే అమిత్ షా మావోయిస్టులు లేకుండా చేస్తామని ప్రకటించిన అనంతరం కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో వందల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఇలా కాల్పులు జరిగినప్పుడల్లా మావోయిస్టులే ఎక్కువగా చనిపోవడంతో పలువురు కీలక నేతలు పోలీసులకు లొంగిపోయేందుకు ముందుకొచ్చారు. ఆశన్న, మల్లోజుల, జంపన్న, అక్కిరాజు హరిగోపాల్, గడ్డం మధుకర్ లాంటి అగ్రనేతలు లొంగిపోయారు. వీళ్లతో పాటు దశల వారిగా పదులు, వందల సంఖ్యలో మావోయిస్టులు సరెండర్ అవుతూ వస్తున్నారు.
Also Read : Ayyappa Devotees: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
MMC జోన్‌లో ఉద్యమం బలహీనత
మావోయిస్టుల ఉద్యమం ఇప్పుడు పూర్తిగా బలహీనమైపోయింది. ఓవైపు సామూహిక లొంగుబాటు కొనసాగడం మరోవైపు MMC జోన్‌లో సరైన నాయకత్వం, ముఖ్య నేతలు లేకపోవడం. భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ వ్యూహాలు మావోయిస్టలు అడ్డాగా ఉన్న ప్రాంతాల్లో వాళ్ల బలాన్ని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ ఉనికిని కోల్పోయిన కేడర్.. జనజీవన స్రవంతిలో కలిసేందుకు నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో తగ్గిన బలం
ఒకప్పుడు కీలక కేంద్రంగా తెలంగాణ(telangana)-ఛత్తీస్‌గఢ్(chattisgarh) సరిహద్దుల్లో కూడా మావోయిస్టుల బలం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ కూడా చాలామంది మావోలు భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందారు. మరికొందరు లొంగిపోయారు. ఒక్క నవంబర్‌లోనే తెలంగాణ కమిటీకి చెందిన 37 మంది మావోయిస్టులు ఇటీవల డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట సరెండర్ అయ్యారు. ఈ కమిటీలో దాదాపు మరో 60 నుండి 70 మంది వరకు అగ్రనేతలు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ వెల్లడించారు. వాళ్లు కూడా త్వరగా లొంగిపోవాలని సూచించారు. అయితే ఇక్కడ అజ్ఞాతంలో ఉన్నవాళ్లలో కొందరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్లు ఇతర రాష్ట్రాలకు చెందినప్పటికీ తెలంగాణ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీగా లొంగిపోయిన మావోలు
మావోయిస్టులకు ప్రధాన కేంద్రమైన ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ వరకు ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 560 మందికి పైగా మావోయిస్టులు సరెండర్ అయినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో ముఖ్యంగా బీజాపూర్, నారాయణ్‌పుర్ జిల్లాల్లో భారీగా సామూహికంగా లొంగిపోయారు. వీళ్లలో మంది దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC)కి చెందిన కీలక సభ్యులు కూడా చాలానే ఉన్నారు.
Also Read : Rajasthan: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకిలా చేశాడంటే ?
హిడ్మా ఎన్‌కౌంటర్‌తో కోలుకోలేని దెబ్బ
మావోయిస్టు పార్టీ అగ్రనేత, గెరిల్లా ఆపరేషన్లలో కేంద్ర కమిటీ సభ్యుడైన మద్వి హిడ్మా (51) ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేదని దెబ్బ తగిలింది. నవంబర్ 18న అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో హిడ్మాతో పాటు ఆయన భార్య మడకం రాజే, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. కీలక అగ్రనేత హిడ్మా మృతితో మావోయిస్టుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే MMC జోనల్ కమిటీ తాము లొంగిపోతామని లేఖ విడుదల చేసింది.
ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, అలాగే ఆర్థిక సాయం అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది మావోయిస్టు అగ్రనేతలు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. వీళ్లతో పాటు ఇతర సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. అంటే అజ్ఞాతంలో తక్కువ మందే మావోలు ఉన్నట్లు తెలుస్తోంది తాజాగా MMC ప్రత్యేక జోనల్ కమిటీ కూడా 2026, జనవరి1న తాము ఆయుధాలు వదిలేసి లొంగిపోతామని లేఖ విడుదల చేసింది. దీన్నిబట్టి వీళ్లందరూ కూడా సరెండర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మావోయిస్టులను నిర్మూలిస్తామని కేంద్రం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి లక్ష్యం పెట్టుకున్నప్పటికీ అది జనవరిలోనే నెరవేరనుంది.
Follow Us