/rtv/media/media_files/2025/08/19/election-commission-2025-08-19-21-10-51.jpg)
Election Commission
ఎన్నికల సంఘం, బీజేపీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడ్డాయని విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. కర్ణాటకలోని మహాదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష ఓట్లు చోరీ చేశారని ఆరోపించారు. అలాగే బిహార్‌లో ఇటీవల ఈసీ చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై తీవ్ర విమర్శలు చేశారు. 65 లక్షల ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించిందంటూ ధ్వజమెత్తారు. దీనిపై ఇప్పటికే ఈసీ స్పందించింది. ఓట్ల చోరీ జరగలేదని తేల్చిచెప్పింది. ఇలాంటి విమర్శలు చేస్తే రాజ్యాంగాన్ని అవమానించడమేనని మండిపడింది. అయినప్పటికీ ఈసీ ఇచ్చిన వివరణపై విపక్ష పార్టీలు విమర్శలు చేశాయి.
Also Read: 'నా భార్య బాధపడింది'.. వారానికి 90 గంటల పనిపై వెనక్కి తగ్గిన L&T సీఎండీ
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈసీ మరో సంచలన ప్రకటన చేసింది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపర్చడం, రెగ్యులరైజ్ చేసేందుకు గడిచిన ఆరు నెలల్లో 28 రకాల చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. మరణాల నమోదు డేటాను లింక్ చేయడం వల్ల క్షేత్రస్థాయి ఎన్నికల అధికారులకు మృతి చెందిన ఓటర్ల గురించి వెంటనే సమాచారం అందుతుందని పేర్కొంది. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడం, భాగస్వామ్యపక్షాలతో సంప్రదింపులు జరపడం, ఓటర్ల లిస్టును సరిచేయడం, ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడం, ఈసీ సామర్థ్యాలు పెంపొందించడం వంటి అంశాల్లో తాము చర్యలు తీసుకున్నామని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాదు బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తాము చేపట్టిన కీలక సంస్కరణగా ఈసీ అభివర్ణించింది. అర్హులందరికీ ఓటు హక్కు ఇవ్వడం, ఓటర్ల లిస్టులో అనర్హుల పేర్లు లేకుండా చూసుకోవడమే తమ టార్గెట్ అని పేర్కొంది.
Also Read: మీరు మారరారా ?.. భారతీయ యువతులపై పాకిస్థానీయుల చిల్లర చేష్టలు
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగినట్లు విపక్షాలు చేసిన ఆరోపణలపై ఆదివారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ స్పందించారు. తమకు పార్టీల పట్ల ఎలాంటి భేదభావాలు లేవని స్పష్టం చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఓట్ల చోరీ జరిగినట్లు ఆరోపణలు చేస్తే తాము అంగీకరించమని తేల్చిచెప్పారు. అంతేకాదు ఓట్ల చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీ వారం రోజుల్లోగా అఫిడవిట్ సమర్పించాలని అన్నారు. లేకపోతే రాహుల్ ఆరోపణలు నిరాధారమైనవిగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
Also Read: 6వేలకు పైగా విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసిన అమెరికా.. ఎందుకంటే?
ఇదిలాఉండగా ప్రస్తుతం ఓట్ల చోరీ అంశం సోషల్ మీడియాలో కూడా తీవ్ర వివాదం రేపుతోంది. చాలామంది ఈసీ తీరును తప్పుబడుతున్నారు. ఓటర్ల డిజిటల్ డేటాను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఓట్ల చోరీ జరగడం నిజమయితే ఇది దేశానికి ప్రమాదకరమంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈసీ మాత్రం తాము ఎలాంటి అవకతవకలు పాల్పడలేదని చెబుతోంది. ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు జరగలేవని ఈసీయే నిరూపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ ఇప్పటికే ఓటు చోరీపై ఆన్‌లైన్‌లో ప్రత్యేకంగా ఓ క్యాంపెయిన్‌ను కూడా మొదలుపెట్టారు.