/rtv/media/media_files/2025/12/30/fotojet-43-2025-12-30-06-56-23.jpg)
Vaikuntha Ekadashi
Vaikuntha Ekadashi 2025 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీమహా విష్ణువు దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామునే ఉత్తర ద్వారాన్ని తెరవడంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. విజయవాడ కనకదుర్గ ఆలయం, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/30/fotojet-45-2025-12-30-06-57-23.jpg)
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమలలో స్వామి వారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటే.. మోక్షం ప్రాప్తిస్తుందని భక్తులు నమ్ముతారు.డిసెంబర్ 30వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 12:05 గంటలకు వైకుంఠ ద్వారాలను తెరచి దర్శనాలకు భక్తులను అనుమతించారు. ఈ రోజు ధనుర్మాస శుద్ధ ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశిగా చెబుతారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈ సందర్భంగా 10 రోజుల పాటు అంటే డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తోంది. ఈ ప్రత్యేక దర్శనం సంవత్సరంలో ఈ పది రోజులు మాత్రమే లభిస్తుంది కాబట్టి లక్షల మంది భక్తులు తరలి వస్తున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో ఘనంగా వైకుంఠ ద్వార దర్శనం వేడుక ప్రారంభమైంది. ఉత్తర ద్వార దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై శ్రీరామచంద్రస్వామి వారు, గజ వాహనంపై సీతమ్మ, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి దర్శనమిచ్చారు. విశాఖ జిల్లా సింహాచలం పుణ్యక్షేత్రంలోనూ ఉత్తర ద్వార దర్శనం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాద్రి నాథుడు వైకుంఠ నారాయణుడి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన పూసపాటి అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ పి.గణబాబు స్వామి వారిని దర్శించుకున్నారు.
పురాణాలు ఏం చెబుతున్నాయంటే..?
వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్ష ప్రాప్తి లభిస్తుందని భక్తుల దృఢ విశ్వాసం. పురాణాల ప్రకారం ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. తిరుమలలో ఈ ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయం అంతా అందమైన పూలు, డెకరేషన్లు, లైట్లతో అలంకరించారు. ఆ దృశ్యాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఈ రోజు శ్రీ మలయప్ప స్వామి.. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణ రథంపై ఉదయం 9 నుంచి 11 గంటల వరకు మాడ వీధుల్లో ఊరేగుతారు. భక్తులు ఈ దివ్య దృశ్యాన్ని తిలకించి పుణ్యం పొందుతారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/30/fotojet-44-2025-12-30-06-56-59.jpg)
వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత:
వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏమిటంటే, ఈ రోజు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామం, భాగవత పారాయణం చేస్తే పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. తిరుమలలో ఈ దర్శనం మరింత పుణ్యఫలదాయకంగా భక్తులు భావిస్తారు. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, దివ్యానుభూతిని ప్రసాదిస్తాయి. గోవిందా గోవిందా అంటూ భక్తులు స్వామివారి కృపకు పాత్రులవుతున్నారు.
కాగా భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మొదటి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1) ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన అనుమతి ఉంది. జనవరి 2 నుంచి 8 వరకు సర్వ దర్శనం క్యూ లైన్ ద్వారా కూడా దర్శనం సాధ్యం. ఈ కాలంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. భక్తులకు ఉచిత అన్నదానం, లడ్డూ ప్రసాదాలు, రవాణా సౌకర్యాలు కల్పించారు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, టీటీడీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
/filters:format(webp)/rtv/media/media_files/2025/12/30/fotojet-46-2025-12-30-06-57-48.jpg)
తిరుమల చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డిసెంబర్ 29 సాయంత్రం తిరుమలకు వచ్చిన ఆయన డిసెంబర్ 30 ఉదయం తెల్లవారుజామున వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికారు. ప్రోటోకాల్ దర్శనంలో భాగంగా సీఎం కుటుంబం స్వామివారి ఆశీస్సులు పొందింది. ఇంకా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు కూడా శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సినీనటుడు చిరంజీవి, ఆయన కుటుంబ సభ్యులు, నారా రోహిత్ దంపతులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, క్రికెటర్ తిలక్ వర్మ, సినీ నిర్మాత డీవీవీ దానయ్య, భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, టీటీడీ బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా దర్శించుకున్నారు.
Follow Us