Kidney Health Tips: మీ కళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే కిడ్నీలు ఖతం.. తప్పక తెలుసుకోండి!!

నిరంతరంగా ఉండే వాపు, ఎరుపుదనం, మసక దృష్టి, పొడిబారడం వంటివి కిడ్నీ పనితీరులో మార్పులకు సూచికలు కావచ్చు. మీ కళ్లలో కనిపించే చిన్న చిన్న మార్పులను నిర్లక్ష్యం చేయకుండా.. వాటిని శరీరం ఇస్తున్న హెచ్చరికగా భావించి, వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

New Update
Swollen Eyes

Swollen Eyes

కిడ్నీ జబ్బులు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. సాధారణంగా కిడ్నీ సమస్యలు అనగానే మనకు వెంటనే అలసట, కాళ్లు ఉబ్బడం, మూత్రంలో మార్పులు వంటి లక్షణాలు గుర్తుకొస్తాయి. అయితే కిడ్నీలు దెబ్బతింటున్నప్పుడు వాటి ప్రారంభ సంకేతాలు మన కళ్లలో కూడా స్పష్టంగా కనిపిస్తాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కిడ్నీలు, కళ్లు రెండూ శరీరంలోని సున్నితమైన నరాలు, ద్రవ సమతుల్యత (Fluid Balance) పై ఆధారపడి పనిచేస్తాయి. ఒక అవయవంలో సమస్య మొదలైతే.. దాని ప్రభావం మరొక దానిపై కనిపించడం సహజం. ముఖ్యంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి (Chronic Kidney Disease - CKD) తరచుగా నిశ్శబ్దంగా మొదలై.. వ్యాధి ముదిరేవరకు ఎటువంటి స్పష్టమైన లక్షణాలను చూపకపోవచ్చు. అందుకే కళ్లలో కనిపించే ఈ సూక్ష్మ మార్పులను గుర్తించడం ద్వారా కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే పసిగట్టి తక్షణ చికిత్స తీసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. కళ్లలో తరచుగా వాపు, ఎరుపుదనం, మంట, పొడిబారడం, దృష్టి మసకబారడం, రంగులను గుర్తించడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తుంటే.. అది తీవ్రమైన కిడ్నీ సమస్యకు సంకేతం కావచ్చు. ఈ లక్షణాలలో ముఖ్యమైనవి, వాటికి గల కారణాల గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

కిడ్నీ సమస్యలను సూచించే కంటి లక్షణాలు:

కళ్లు ఉబ్బడం:

సాధారణంగా నిద్ర లేమి, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కళ్లు కొద్దిగా ఉబ్బడం సహజం. కానీ ప్రతిరోజూ కళ్లు ఉబ్బినట్లు అనిపిస్తే.. అది ప్రోటీన్యూరియాకు సంకేతం కావచ్చు. కిడ్నీలు బలహీనపడినప్పుడు.. అవి రక్తాన్ని వడకట్టే సామర్థ్యాన్ని కోల్పోయి.. ముఖ్యమైన ప్రోటీన్‌లను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. శరీరంలో ప్రోటీన్ స్థాయిలు తగ్గడం వల్ల ద్రవం రక్తనాళాల నుంచి కళ్ల చుట్టూ ఉన్న కణజాలంలోకి చేరి వాపుకు కారణమవుతుంది. అంతేకాకుండా నురుగుతో కూడిన మూత్రం (Foamy Urine) ఈ లక్షణంతోపాటు కనిపిస్తే కిడ్నీ ఫిల్టర్లు దెబ్బతిన్నాయని అర్థం. వెంటనే పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు.

మసక దృష్టి-రెండ్రెండుగా కనిపించడం:

అకస్మాత్తుగా దృష్టి మసకబారడం లేదా వస్తువులు రెండ్రెండుగా కనిపించడం అనేది కంటి నరాలు దెబ్బతిన్నాయనడానికి సంకేతం. కిడ్నీ వైఫల్యానికి దారితీసే రెండు ప్రధాన కారణాలు అధిక రక్తపోటు (High Blood Pressure), మధుమేహం (Diabetes) రెండూ రెటీనాలోని సున్నితమైన రక్తనాళాలను, నరాలను దెబ్బతీస్తాయి. అంతేకాకుండా అధిక రక్త చక్కెర స్థాయిలు రెటీనాలోని రక్తనాళాలను బలహీనపరుస్తాయి. అవి ఉబ్బి, ద్రవాన్ని లీక్ చేస్తాయి. దీనివల్ల దృష్టి మసకబారుతుంది. అనియంత్రిత అధిక రక్తపోటు రెటీనా రక్తనాళాలపై ఒత్తిడి పెంచి. వాటిని దెబ్బతీస్తుంది. తీవ్రమైన సందర్భాలలో.. ఇది తాత్కాలిక లేదా శాశ్వత దృష్టి నష్టానికి దారితీయవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే.. కళ్లతోపాటు కిడ్నీల పనితీరును కూడా తనిఖీ చేయించుకోవాలి.
 
కళ్లు పొడిబారడం, మంట లేదా కుట్టినట్లు అనిపించడం:

వాతావరణ మార్పుల కారణంగా కళ్లు పొడిబారడం సాధారణమే. కానీ.. నిరంతరం పొడిగా ఉండి.. మంటగా లేదా ఇసుక రేణువు ఉన్నట్లు అనిపిస్తే.. అది తీవ్రమైన కిడ్నీ వ్యాధి లేదా డయాలసిస్‌లో ఉన్నవారిలో కనిపించే లక్షణం కావచ్చు. కిడ్నీ సమస్యలు శరీరంలోని ఖనిజాల సమతుల్యతను దెబ్బతీస్తాయి, రక్తం నుంచి టాక్సిన్స్ పూర్తిగా తొలగిపోకపోవడం వల్ల కన్నీటి ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయే పరిస్థితిని యురేమియా అంటారు. ఇది కండ్లకలకలో వాపుకు కారణమై కళ్లు పొడిబారడానికి దారితీస్తుంది.

ఇది కూడా చదవండి: ఫబ్బింగ్ గబ్బు.. సంబంధాలు, సంసారాలను నాశనం చేస్తున్న కొత్త ట్రెండ్!

కళ్లు ఎర్రబడడం:

సాధారణంగా అలసట, అలెర్జీల వల్ల కళ్లు ఎర్రబడతాయి. అయితే కిడ్నీ వ్యాధిగ్రస్తులలో.. అనియంత్రిత అధిక రక్తపోటు వల్ల కంటిలోని చిన్న రక్తనాళాలు చిట్లిపోయి, కళ్లు నిరంతరం ఎర్రగా కనిపించవచ్చు. కొన్ని కిడ్నీ జబ్బులు లూపస్ నెఫ్రైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులతో ముడిపడి ఉంటాయి. ఈ వ్యాధులు కంటిలో వాపుకు కారణమవుతాయి. కళ్లు ఎర్రబడడంతోపాటు కీళ్ల నొప్పులు.. వాపు లేదా శరీరంపై దద్దుర్లు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కిడ్నీలు-కళ్లు: 

కిడ్నీలు, కళ్లు రెండూ శరీరంలో సమానమైన సన్నని రక్తనాళ వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. కిడ్నీలు రక్తాన్ని వడకట్టడానికి ఈ రక్తనాళాలపై ఆధారపడతాయి.. అదేవిధంగా రెటీనాకు పోషణ అందించడానికి కళ్లు ఈ నాళాలపైనే ఆధారపడతాయి. అధిక రక్తపోటు, మధుమేహం ఈ చిన్న రక్తనాళాలను మొదట దెబ్బతీస్తాయి. ఈ రెండు వ్యాధులు నియంత్రణలో లేకపోతే.. మొదట కిడ్నీ ఫిల్టర్‌లు దెబ్బతిని.. ఆపై కంటిలోని రెటీనా నాళాలు దెబ్బతినడం ప్రారంభమవుతుంది. పరిశోధనల ప్రకారం.. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో కంటిలోని రెటీనా, కోరోయిడ్ పొరలు ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే సన్నగా ఉంటాయని తేలింది.

ఎప్పుడు పరీక్ష చేయించుకోవాలి:

తేలికపాటి కంటి ఇబ్బందులు సాధారణమే అయినప్పటికీ.. పైన చెప్పిన లక్షణాలు నిరంతరంగా ఉండి వాటితోపాటు అలసట, శరీరంలో వాపు లేదా మూత్ర విసర్జనలో మార్పులు కనిపిస్తే.. తప్పనిసరిగా కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. అంతేకాకుండా  మధుమేహం (Diabetes), అధిక రక్తపోటు (High Blood Pressure), కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉన్నవారు, ప్రమాద కారకాలు (Risk Factors) ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. సాధారణ కంటి పరీక్షలు కూడా కొన్నిసార్లు ప్రధానమైన శారీరక వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా నిరంతరంగా ఉండే వాపు, ఎరుపుదనం, మసక దృష్టి, పొడిబారడం వంటివి కిడ్నీ పనితీరులో మార్పులకు సూచికలు కావచ్చు. కిడ్నీ వ్యాధులు ముదిరిపోకముందే గుర్తించడం, వాటి చికిత్సలో చాలా కీలకం. మీ కళ్లలో కనిపించే చిన్న చిన్న మార్పులను నిర్లక్ష్యం చేయకుండా.. వాటిని శరీరం ఇస్తున్న హెచ్చరికగా భావించి, వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించాలి. సకాలంలో తీసుకునే చికిత్స మీ కళ్లను మాత్రమే కాదు కిడ్నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: హెల్త్ బాగాలేనప్పుడు ఎలక్ట్రోలైట్ ఎక్కువగా తాగుతారా..? అయితే మీరు డేంజర్లో ఉన్నట్లే!!

Advertisment
తాజా కథనాలు