/rtv/media/media_files/2025/11/23/air-pollution-and-brain-2025-11-23-08-10-48.jpg)
Air Pollution and Brain
గతంలో చలికాలం అంటే కేవలం ఆహ్లాదకరమైన వాతావరణం, పొగమంచు మాత్రమే. కానీ ఇప్పుడు భారత్‌లోని అనేక నగరాల్లో శీతాకాలం అంటే పెరిగిపోతున్న వాయు కాలుష్యం (Air Pollution), ఆరోగ్య సమస్యల గురించి ఆందోళన కలిగించే కాలం. ఈ విషపూరితమైన గాలి కేవలం ఊపిరితిత్తులను మాత్రమే కాక.. అత్యంత ముఖ్యమైన అవయవమైన మెదడు (Brain)పైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. నిపుణుల హెచ్చరికల ప్రకారం.. వాయు కాలుష్యం ఏకాగ్రతను తగ్గించడం, నిద్రకు భంగం కలిగించడం, ఆందోళనను పెంచడం, దీర్ఘకాలికంగా ప్రాణాపాయాన్ని కలిగించే రుగ్మతలకు దారితీయడం వంటి తీవ్ర పరిణామాలను సృష్టిస్తోంది.
మెదడుపై కాలుష్యం:
వాయు కాలుష్యం ముఖ్యంగా PM2.5 (Particulate Matter) వంటి చిన్న కాలుష్య కారకాల ద్వారా నేరుగా మెదడును ప్రభావితం చేస్తుంది. PM2.5, ఇతర విష రసాయనాలు రక్తంలోకి ప్రవేశించి.. ఆపై మెదడును రక్షించే బ్లడ్-బ్రెయిన్ బారియర్‌ను దాటుకుని లోపలికి చేరుతాయి. అంతేకుండా మెదడులో ఈ కాలుష్య కారకాలు వాపు (Inflammation)ను కలిగిస్తాయి. దీనినే న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ వాపు వలన మెదడు కణాలు దెబ్బతింటాయి.. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన, ఏకాగ్రతను నియంత్రించే ప్రాంతాలలో ఒత్తిడిని పెంచుతుంది. కలుషితమైన గాలిని పీల్చినప్పుడు.. శరీరం యొక్క ఒత్తిడి వ్యవస్థ (HPA-Axis) ప్రేరేపించబడుతుంది. దీని వలన కోర్టిసోల్ (Cortisol) అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు అనవసరంగా ఎక్కువ కాలం పాటు పెరుగుతాయి. అధిక కోర్టిసోల్ ఆందోళన (Anxiety), చిరాకు, ఏకాగ్రత లేమి, నిద్ర చక్రంలో అవాంతరాలకు దారి తీస్తుంది. పరిశోధనల ప్రకారం.. కాలుష్యానికి ఎక్కువ కాలం గురికావడం వల్ల పెద్దలు, యువకులలో కూడా డిప్రెషన్, ఆందోళన లక్షణాలు పెరిగే ప్రమాదం ఉంది. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, అల్జీమర్స్, చిత్తవైకల్యం (Dementia) వంటి నాడీ సంబంధిత రుగ్మతలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుందని నివేదికలు హెచ్చరిస్తున్నాయి.
నిద్ర, ఏకాగ్రత ఎందుకు దెబ్బతింటాయి?
కాలుష్యం వలన నిద్ర, ఏకాగ్రత దెబ్బతినడానికి ప్రధాన కారణాలు ఉన్నాయి. కాలుష్యం శ్వాసనాళాల్లో వాపును పెంచుతుంది. దీని వల్ల రాత్రిపూట దగ్గు, గురక, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి నిద్రకు భంగం కలుగుతుంది. న్యూరోఇన్ఫ్లమేషన్ కారణంగా మెదడు నిరంతరం డిఫెన్స్ మోడ్‌లో ఉంటుంది. దీని వలన నిద్ర పోవాలన్నా, మెదడు ప్రశాంతంగా ఉండక, సరైన విశ్రాంతి తీసుకోలేదు. అంతేకాకుండా సరిగా నిద్ర లేకపోవడం, మెదడుపై కాలుష్య ప్రభావం వల్ల విద్యార్థులు, ఉద్యోగులు తక్కువ ఏకాగ్రత, ఎక్కువ చిరాకు, తక్కువ ఉత్పాదకతను అనుభవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
వాయు కాలుష్యంతో ప్రాణాపాయం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మరణాలకు వాయు కాలుష్యం కారణమవుతోంది. ఇది ముఖ్యంగా గుండె జబ్బులు (Heart Attacks, Stroke), ఊపిరితిత్తుల క్యాన్సర్, దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల (Chronic Respiratory Diseases) ప్రమాదాన్ని పెంచుతుంది. గుండెపోటుతో మరణిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు వాయు కాలుష్యం వల్లే మరణిస్తున్నారని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాలకు కూడా వాయు కాలుష్యం ప్రధాన కారణాలలో ఒకటిగా ఉంది.
ఇది కూడా చదవండి: డంపింగ్ యార్డ్‌లతో కంపు కొడుతున్న పట్టణాలు..లక్షలు ఖర్చు చేసినా ఈ సమస్యకు లేని శాశ్వత పరిష్కారం
ఏ వయస్సు వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వాయు కాలుష్యం ప్రభావం అందరిపై ఉన్నప్పటికీ. కొన్ని వర్గాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు తక్కువ ఏకాగ్రత, ప్రవర్తనా మార్పులు, మెదడు ఎదుగుదల మందగించడం వంటివి ఉంటాయి. పాఠశాలలు మెరుగైన వెంటిలేషన్, గాలి శుద్దీకరణ ప్రమాణాలను పాటించాలి. అత్యధిక కాలుష్య సమయాల్లో (పీక్ AQI) బయట ఆటలు ఆపాలి. అయితే గర్భిణీ స్త్రీలు ఒత్తిడి మార్కర్లు పెరగడం, మూడ్ అవాంతరాలు ఉంటాయి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ తప్పనిసరిగా వాడాలి. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు N95 మాస్క్ ధరించాలి. అలాగే వృద్ధులు ఆలోచనా సామర్థ్యం తగ్గడం, జ్ఞాపకశక్తి సమస్యలు ఉంటాయి. ఇలాంటి వారు ఇండోర్ గాలి నాణ్యతను కాపాడుకోవడం, ఇంటి లోపల ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేయాలి. బయట పనిచేసేవారు దీర్ఘకాలిక తలనొప్పి, భావోద్వేగ అలసట, నిద్రలేమి సమస్యలు ఉంటే తప్పనిసరిగా బయటకు వెళ్ళినప్పుడు N95/N99 మాస్క్ వాడాలని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం, జీవనశైలితో రక్షణ మార్గాలు:
కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని చిన్న చిన్న జీవనశైలి మార్పులు, ఆహార జాగ్రత్తలు సహాయపడతాయి. బయట గాలి నాణ్యత (AQI) తక్కువగా ఉన్నప్పుడు.. PM2.5 కణాలను ఫిల్టర్ చేయగలిగే N95/N99 మాస్క్‌లను తప్పనిసరిగా ఉపయోగించండి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్‌లను ఉపయోగించడం ఉత్తమం. అరెకా పామ్, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ వంటి ఇండోర్ మొక్కలు గాలిని శుభ్రం చేయడంలో సహాయపడతాయి. వెంటిలేషన్ బాగుండేలా చూసుకోవాలి.
ఆహారంపై జాగ్రత్తలు:
వాయు కాలుష్యం వలన శరీరంలో పెరిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి విటమిన్-సి, విటమిన్-ఇ, బీటా-కెరోటిన్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, పొడి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా చేపలు, అవిసె గింజలు లేదా వాల్‌నట్స్ వంటి వాటిలో ఉండే ఒమేగా-3 మెదడులోని, శరీరంలోని వాపును (Inflammation) తగ్గించడంలో సహాయపడుతుంది. తగినంత నీరు తాగడం వలన శ్వాసనాళాలు తేమగా ఉండి.. కాలుష్య కారకాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. శ్వాస వ్యాయామాలు, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే ధ్యానం (Meditation) ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మెదడును ప్రశాంతపరుస్తుంది. వాయు కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు.. ఇది మానసిక ఆరోగ్యం, జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన ఆరోగ్య సమస్య. చలికాలంలో గాలిలో ఉండే పొగమంచు కేవలం వాతావరణం శరీరంలో, మెదడులో తుఫాను సృష్టించే విష వాయువు. కాబట్టి ఊపిరితిత్తులను కాపాడుకోవడంతోపాటు.. మనసును, మెదడును కూడా రక్షించుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే.. ఆరోగ్యంపై కాలుష్యం ప్రభావాన్ని తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: 40 ఏళ్ల ప్రాయం.. మీ గుండె జర భద్రం
Follow Us