/rtv/media/media_files/2025/09/12/rice-2025-09-12-13-26-18.jpg)
Rice
ఆహారంలో అన్నం ప్రధానమైన వాటిలో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి ప్రాథమిక పోషకాహార వనరు. అన్నం లేకుండా భోజనం అసంపూర్ణం. అన్నం సంస్కృతిలో, వేడుకల్లో ఒక భాగం. దీని నుంచి వచ్చిన వంటకాలెన్నో. అన్నం మన శరీరానికి శక్తినిస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల బియ్యం నుంచి వివిధ రకాల వంటలు చేస్తారు. అన్నం కేవలం కడుపు నింపే ఆహారం మాత్రమే కాదు.. మన సంస్కృతిలో, సంప్రదాయంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఇది కోట్లాది మంది ప్రజల జీవితాల్లో ఒక అంతర్భాగం. అయితే రోజువారీ జీవితంలో మన ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపేది మనం తీసుకునే ఆహారం. ముఖ్యంగా రాత్రి భోజనంలో అన్నం తినాలా..? లేక రోటీ తినాలా..? అనే సందేహం చాలామందిని వెంటాడుతుంది. దీనిపై పోషకాహార నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మన జీవనశైలి, ఆరోగ్య లక్ష్యాలు, జీర్ణశక్తి ఆధారంగా ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలో వారు వివరించారు.
రాత్రి భోజనంలో ఏది మంచిదో నిపుణుల సలహాలు..
గోధుమలతో తయారైన రోటీలో ఫైబర్, ప్రొటీన్, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తాయి. రోటీకి గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) అన్నం కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఎంపిక. రోటీలో ఉండే ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. దీనివల్ల అతిగా తినకుండా ఉండవచ్చు.. తద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అధిక ఫైబర్ ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మీకు ఇప్పటికే జీర్ణ సమస్యలు, మలబద్ధకం ఉన్నట్లయితే.. రోటీ కొంత భారంగా అనిపించవచ్చు. అలాగే చాలా ఆలస్యంగా తింటే జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: డయాబెటిస్ ఉంటే ఆలు గడ్డ తినొచ్చా..? వైద్యుల సూచనలు తెలుసుకోండి..!!
అన్నం ముఖ్యంగా స్టార్చ్‌తో నిండి ఉంటుంది.. ఇది త్వరగా జీర్ణమవుతుంది. రాత్రి భోజనానికి ఇది తేలికైన, సౌకర్యవంతమైన ఆహారం. అన్నం సులభంగా జీర్ణమవుతుంది. రాత్రిపూట కడుపులో అసౌకర్యంగా అనిపించదు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు సెరోటోనిన్, మెలటోనిన్ హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి.. ఇవి మంచి నిద్రకు సహాయపడతాయి. అన్నంలో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది. బరువు తగ్గాలనుకునేవారు తెల్లటి అన్నం పరిమాణాన్ని పరిమితం చేసుకోవాలి. మధుమేహం ఉన్నవారు అన్నం తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోటీ, అన్నం రెండింటికీ వాటివైన ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గడం లేదా రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే రోటీ మంచి ఎంపిక. తేలికైన ఆహారం, సులభమైన జీర్ణక్రియ, మంచి నిద్ర మీకు కావాలంటే అన్నం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే రాత్రిపూట 7 గంటల లోపు తినడం, ఆహారం పరిమాణాన్ని తగ్గించుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారంలో భాగంగా రోటీ లేదా అన్నంతోపాటు తగినంత కూరగాయలు, ప్రొటీన్ తీసుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: ఫ్లష్ చేసిన తర్వాత మలం తేలితే డేంజర్.. ఆ షాకింగ్ వ్యాధి ఉన్నట్లే!