/rtv/media/media_files/2025/09/24/muscles-pump-blood-2025-09-24-18-12-33.jpg)
Muscles Pump Blood
గుండె అనగానే ఛాతీలో నిరంతరం కొట్టుకునే అవయవం గుర్తుకు వస్తుంది. కానీ శరీరంలో మరో గుండె కూడా ఉందని అది ఆరోగ్యానికి చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండో గుండె కాళ్ళలో ఉంటుంది. అవి పిక్క కండరాలు. వైద్య శాస్త్రంలో.. పిక్క కండరాలను తరచుగా రెండో గుండెగా పేర్కొంటారు. ఎందుకంటే గుండె శరీరమంతటికీ రక్తాన్ని పంప్ చేస్తుంది. కానీ కాళ్ళ వంటి శరీరంలోని దిగువ భాగాలకు చేరిన రక్తం.. గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా మళ్ళీ గుండెకు తిరిగి వెళ్ళడానికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. పిక్క కండరాలను రెండో గుండెగా ఎందుకు పిలుస్తారో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
పిక్క కండరాల పని..
ఇక్కడే పిక్క కండరాల పాత్ర మొదలవుతుంది. నడుస్తున్నప్పుడు, పరిగెత్తినప్పుడు లేదా కాళ్ళను కొద్దిగా కదిపినా.. ఈ కండరాలు సంకోచిస్తాయి. ఈ సంకోచం రక్త నాళాలపై ఒత్తిడి కలిగించి, రక్తాన్ని పైకి, గుండె వైపు పంప్ చేస్తుంది. ఇది గుండె రక్తాన్ని పంప్ చేసే విధానాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రక్రియను మజిల్ పంప్ మెకానిజం (CMP) అంటారు. ఈ కారణం చేతనే వీటిని రెండో గుండె అని పిలుస్తారు. మేయో క్లినిక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తక్కువ CMP కార్యాచరణ ఉన్నవారిలో మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. CMP లోపం అనేక వ్యాధులకు కారణమవుతుందని అధ్యయనంలో వెల్లడైంది. 2020లో నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ పరిశోధన పత్రం ప్రకారం.. CMP సరిగ్గా పనిచేయకపోతే గుండెపోటుతో సహా అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: మచ్చలేని చర్మం కోసం ఈ పూల ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.
ఈ రెండో గుండె సరిగ్గా పనిచేయడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది సరిగ్గా పనిచేయకపోతే.. కాళ్ళలో రక్తం గడ్డకట్టడం, వాపు, నొప్పి, వెరికోస్ వెయిన్స్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఎక్కువసేపు కూర్చోవడం, నిలబడటం వల్ల ఈ సమస్యలు మరింత పెరుగుతాయి. రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడి.. రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది ఊపిరితిత్తులు, గుండెకు చేరితే ప్రాణాంతకం కావచ్చు. కాబట్టి నడుస్తున్నప్పుడు, పరిగెత్తినప్పుడు లేదా మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒ క్షణం ఆగి పాదాలను గమనించాలి. అవి మనల్ని ముందుకు నడిపించడమే కాకుండా.. గుండె భారాన్ని కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: కుట్టు పిండి నవరాత్రుల్లో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే తినకుండా ఉండలేరు