/rtv/media/media_files/2025/11/26/heart-attack-2025-11-26-08-32-36.jpg)
Heart Attack
ప్రపంచవ్యాప్తంగా అకస్మాత్తుగా సంభవిస్తున్న గుండెపోటు మరణాలు (Heart Attack Deaths) తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ లక్షణం లేకుండానే ఆరోగ్యవంతులు కూడా కుప్పకూలిపోవడం విషాదం. అయితే.. గుండె జబ్బుల చికిత్స, నివారణ రంగంలో శాస్త్రవేత్తలు తాజాగా ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. మన శరీరంలోని కీలకమైన ద్రవాలలో ఒకటైన ఉమ్మి (Saliva) ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని అంచనా వేయగల ఒక ప్రత్యేక పరీక్షను కనుగొన్నారు. ఇది రాబోయే గుండె సమస్యలను లక్షణాలు కనిపించకముందే 82% వరకు కచ్చితత్వంతో గుర్తించగలదని పరిశోధకులు చెబుతున్నారు.
నూతన అధ్యాయం:
సాధారణంగా గుండె సమస్యలను గుర్తించడానికి వైద్యులు రక్త పరీక్షలపై ఆధారపడతారు. ముఖ్యంగా.. గుండె వైఫల్యం (Heart Failure) లేదా గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేయడానికి NT-proBNP (ఎన్-టెర్మినల్ ప్రో-బి-టైప్ నాట్రియురేటిక్ పెప్టైడ్) అనే బయోమార్కర్‌ను రక్తంలో కొలుస్తారు. గుండెపై ఒత్తిడి పెరిగినప్పుడు ఈ రసాయనం రక్తంలో అధికంగా విడుదల అవుతుంది. అయితే రక్త నమూనా (Blood Sample) తీసుకోవడం కొందరికి కష్టం, కొన్నిసార్లు అసౌకర్యంగానూ ఉంటుంది. తరచుగా పరీక్షలు చేయించుకోవడానికి ఇది ఆటంకంగా మారుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు.. పరిశోధక బృందం ఉమ్మిలోని బయోమార్కర్‌లపై దృష్టి సారించారు.
ఉమ్మి ఎందుకు కీలకం?
శరీరం అంతటా జరిగే మార్పులను ఉమ్మి నేరుగా ప్రతిబింబిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉమ్మిని సేకరించడం చాలా సులభం, నొప్పిలేనిది (Non-invasive), రోజంతా నమూనాలను తీయడానికి అనుకూలమైనది. మన నోటిలో ఉమ్మి నిరంతరం ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా రక్తంలో ఉండే ప్రోటీన్లు, రసాయనాలలో దాదాపు 20% వరకు ఉమ్మిలో కూడా కనిపిస్తాయి. ఇవి శరీరంలోని మార్పులకు స్పష్టమైన సూచనలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 2021లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. గుండె వైఫల్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఉమ్మిలో 18 ముఖ్యమైన బయోమార్కర్‌లను పరిశోధకులు గుర్తించారు. ఈ బయోమార్కర్‌లు ప్రధానంగా శరీరంలో జరుగుతున్న వాపు (Inflammation), కణజాల మార్పులు (Tissue Changes) గుండె ఒత్తిడి (Heart Stress) వంటి వాటిని సూచించే రసాయనాలతో కూడి ఉన్నాయి. ఆరోగ్యవంతులతో పోలిస్తే గుండె సమస్యలు ఉన్నవారిలో ఇవి చాలా ఎక్కువగా ఉన్నట్లు నివేధికలో తేలింది.
ఇది కూడా చదవండి: సీ విటమిన్ ఎక్కువైతే కిడ్నీలు ఖతమేనా.. షాకింగ్ నిజాలు!
2012లోనే ఉమ్మిలో NT-proBNP స్థాయిని కొలవడం సాధ్యమని నిరూపించింది. ఆ ప్రారంభ పరీక్ష ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మొత్తం డయాగ్నస్టిక్ కచ్చితత్వం 90.6% వరకు ఉన్నట్లు వారు నివేదించారు. ఈ కచ్చితత్వం ద్వారా ఆరోగ్యవంతులు, గుండె సమస్యల ప్రమాదం ఉన్నవారి మధ్య స్పష్టమైన తేడాను గుర్తించడం సాధ్యమైంది. తరువాత పరిశోధనల్లో.. వారు మరిన్ని ప్రోటీన్లను గుర్తించారు. S100-A7, కాథెలిసిడిన్ (Cathelicidin) వంటి ప్రోటీన్‌ల ప్యానెల్ 81.6% కచ్చితత్వంతో గుండె వైఫల్యాన్ని ముందస్తుగా గుర్తించగలదని తేలింది. ముఖ్యంగా S100A7 అనే బయోమార్కర్‌ను గుండె వైఫల్యం ఉన్నవారిలో ఆరోగ్యవంతుల కంటే రెట్టింపు స్థాయిలో గుర్తించారు. ఈ ప్రోటీన్ స్ఫోరియాసిస్, కొన్ని రకాల క్యాన్సర్‌లతో కూడా ముడిపడి ఉంది. 100 మంది రోగులపై జరిపిన మరో అధ్యయనంలో... ఉమ్మిలో గాలెక్టిన్-3 అనే ప్రోటీన్ అధిక స్థాయిలో ఉంటే.. వారికి గుండె వైఫల్యం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఈ బయోమార్కర్‌లు గుండె కండరాల ఒత్తిడి, వాపు, కణజాలం దెబ్బతినడాన్ని స్పష్టంగా సూచిస్తాయి. దీని అర్థం గుండె సమస్యలు తీవ్రమయ్యే ముందే.. ఈ ప్రోటీన్ల స్థాయి పెరుగుతుందని పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.
ఇంట్లోనే పరీక్షించుకునే అవకాశం:
ఈ ఉమ్మి పరీక్ష అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. దీనిని ఒక సాధారణ కిట్ రూపంలో అభివృద్ధి చేయవచ్చు. ఈ కిట్‌ను ఉపయోగించి ఇంట్లోనే తక్కువ ఖర్చుతో పరీక్ష చేయించుకునే అవకాశం ఉంటుంది. రక్త పరీక్షల మాదిరిగా కాకుండా.. ఈ పరీక్ష నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం.. ఈ టెస్ట్ కిట్ కేవలం 15 నిమిషాల్లో ఫలితాలను అందించగలదు. ఈ విధంగా ఇంటి వద్దే త్వరగా ఫలితం లభించడం వలన.. గుండె సమస్యలు ఉన్నవారిని వెంటనే గుర్తించి.. వారికి తక్షణ వైద్య సహాయం అందించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాలు, వైద్య సదుపాయాలు సరిగా లేని ప్రాంతాల్లో నివసించే వారికి ఇది నిజమైన వరం కాగలదు.
భవిష్యత్ అడుగులు-సవాళ్లు:
ఉమ్మి పరీక్ష (Saliva Test) అనేది గుండెపోటును త్వరగా గుర్తించి ప్రాణాలను కాపాడే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు. అయినప్పటికీ ఇది విస్తృత వినియోగంలోకి రావడానికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. వేర్వేరు ప్రయోగశాలలలో, వేర్వేరు ప్రాంతాల జనాభాపై ఈ పరీక్ష ఫలితాలు ఒకే విధంగా వస్తాయా లేదా అనేది నిర్ధారించడానికి మరింత విస్తృతమైన పరీక్షలు, ధృవీకరణ అవసరం. ప్రస్తుతం గుండె జబ్బుల నిర్ధారణకు NT-proBNP రక్త పరీక్ష మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థలచే పూర్తి చేయాలి. 15 నిమిషాల్లో ఫలితాన్ని ఇచ్చేలా తక్కువ ఖర్చుతో కూడిన.. నమ్మదగిన బయోసెన్సార్ పరికరాలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయగలగాలి. రక్త పరీక్షల మాదిరిగానే.. ఉమ్మి కూడా భవిష్యత్తులో ముఖ్యమైన డయాగ్నస్టిక్ టూల్‌గా మారబోతోంది. ఈ సరళమైన.. నొప్పిలేని పరీక్ష ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని ముందుగా గుర్తించి.. జీవనశైలి మార్పులు, మందులు, ఇతర నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం లభిస్తుంది. లక్షణాలు తీవ్రమయ్యే వరకు వేచి ఉండకుండా.. గుండెపోటును ముందే పసిగట్టి వేలాది మంది ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: యూరిన్‌లో ఆ మార్పులు కనిపిస్తే డేంజర్.. క్యాన్సర్ ముప్పు..?
Follow Us