/rtv/media/media_files/2025/11/25/slow-urine-flow-2025-11-25-12-48-01.jpg)
Slow Urine Flow
నేటి కాలంలో మన జీవితంలో చిన్న చిన్న మార్పులను కూడా పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. కానీ శరీరం ఇచ్చే ప్రతి సూచన వెనుక ఒక కారణం ఉంటుంది. ముఖ్యంగా మూత్ర విసర్జన అలవాట్లలో వచ్చే తేడాలు భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. చాలా మంది ఉదయం వేళల్లో లేదా పనుల ఒత్తిడిలో శరీర సంకేతాలను విస్మరిస్తుంటారు. ఈ నిర్లక్ష్యం కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు.. ముఖ్యంగా బ్లాడర్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మూత్రం నెమ్మదికి..బ్లాడర్ క్యాన్సర్‌కు లింక్ ఏంటి..?
సాధారణంగా ఉండాల్సిన మూత్రం ప్రవాహం సన్నబడటం, చాలా నెమ్మదిగా రావడం, లేదా మధ్యలో ఆగి ఆగి రావడం వంటివి గమనించినట్లయితే.. ఇది బ్లాడర్ క్యాన్సర్ ప్రారంభ లక్షణం కావచ్చు. అయితే ఈ బ్లాడర్ క్యాన్సర్‌లో మూత్రాశయం లోపల కణితి పెరుగుతుంది. ఈ కణితి మూత్రాశయం నుంచి మూత్రాన్ని బయటకు తీసుకెళ్లే మార్గాన్ని అడ్డుకుంటుంది. ఈ అడ్డంకి కారణంగా.. మూత్రం బయటకు వచ్చే వేగం తగ్గిపోయి.. ప్రవాహం చాలా నెమ్మదిగా, పలుచగా లేదా ఆగి ఆగి వస్తుంది. ఈ లక్షణం కనిపించిన వెంటనే అప్రమత్తం కావడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు:
నెమ్మదిగా మూత్రం రావడం ఒక్కటే కాకుండా.. బ్లాడర్ క్యాన్సర్‌ను సూచించే ఇతర ప్రధాన లక్షణాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి కనిపించినా ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను కలవాలి. వాటిల్లో మూత్రంలో రక్తం ఒకి. ఇది బ్లాడర్ క్యాన్సర్‌కు అత్యంత సాధారణ, ముఖ్యమైన లక్షణం. మూత్రం గులాబీ, ఎరుపు లేదా కోలా రంగులో కనిపించవచ్చు. కొన్నిసార్లు రక్తం కనిపించకపోయినా, పరీక్షల్లో మాత్రమే గుర్తించబడవచ్చు. చాలా సందర్భాలలో ఇది నొప్పి లేకుండా ఉంటుంది. సాధారణం కంటే ఎక్కువ సార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సి రావడం, మూత్రం వచ్చినప్పుడు ఆపుకోలేనంత అత్యవసరంగా అనిపించడం, మూత్రం పోసేటప్పుడు తీవ్రమైన నొప్పి లేదా మంట కలగడం, మూత్రం పోసిన తర్వాత కూడా మూత్రాశయం పూర్తిగా ఖాళీ కాలేదనే భావన కలగడం, క్యాన్సర్ ముదిరిన దశల్లో లేదా కణితి పరిమాణం పెరిగినప్పుడు పొత్తికడుపు లేదా వీపు కింది భాగంలో నొప్పి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: దక్షిణాసియాపై కాలుష్య నీడలు.. పొంచి ఉన్న ప్రమాదం
చాలామంది ఈ లక్షణాలను సాధారణ యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ (UTI) లేదా పురుషులైతే ప్రోస్టేట్ సమస్య (BPH) అని పొరబడి స్వీయ వైద్యం చేస్తుంటారు. కానీ సరైన రోగ నిర్ధారణ చేయకుండా మందులు వాడటం అసలు సమస్యను మరింత తీవ్రతరం చేయవచ్చు. అయితే ఈ బ్లాడర్ క్యాన్సర్ ఎవరికైనా రావొచ్చు.. కానీ కొన్ని అలవాట్లు, పరిస్థితులు ఉన్నవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ధూమపానం (Smoking) బ్లాడర్ క్యాన్సర్‌కు ఇదే అతిపెద్ద ప్రమాద కారకం. సిగరెట్ పొగలోని హానికరమైన రసాయనాలు రక్తంలో కలిసి, కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయి మూత్రంలోకి వస్తాయి. ఈ రసాయనాలు ఎక్కువ కాలం మూత్రాశయం లోపలి పొరతో సంబంధంలో ఉండటం వలన కణాలకు నష్టం జరిగి.. క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.
మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్లు..
ప్రింటింగ్, పెయింటింగ్, రబ్బరు, తోలు, టెక్స్‌టైల్ పరిశ్రమలలో ఉపయోగించే కొన్ని రకాల రసాయనాలు లేదా రంగులకు దీర్ఘకాలంగా గురయ్యే వారికి ప్రమాదం ఎక్కువ. అయితే వయస్సు పెరిగే కొద్దీ ఈ సమస్య వచ్చే అవకాశం పెరుగుతుంది. అలాగే మహిళల కంటే పురుషులలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని వైద్యులు అంటున్నారు. దీర్ఘకాలిక మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్లు, మూత్రాశయంలో రాళ్లు లేదా దీర్ఘకాలంగా కాథెటర్ వాడటం వంటివి మూత్రాశయం లైనింగ్‌ను చికాకు పెట్టి ప్రమాదాన్ని పెంచవచ్చు. గతంలో పెల్విక్ ప్రాంతంలో రేడియేషన్ చికిత్స తీసుకున్న వారికి.. లేదా సైక్లోఫాస్ఫమైడ్ (Cyclophosphamide) వంటి కొన్ని కీమోథెరపీ మందులు వాడిన వారికి కూడా ప్రమాదం పెరుగుతుంది. కుటుంబంలో బ్లాడర్ క్యాన్సర్ చరిత్ర ఉన్నవారికి కూడా రిస్క్ కొద్దిగా ఎక్కువ.
నిర్ధారణ-చికిత్స:
బ్లాడర్ క్యాన్సర్‌ను ఎంత త్వరగా గుర్తిస్తే.. చికిత్స అంత సులభంగా, విజయవంతంగా ఉంటుంది. అందుకే పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే యూరాలజిస్ట్‌ను కలవాలి. డాక్టర్ మొదట మూత్ర పరీక్ష చేయమని, అవసరమైతే క్యాన్సర్ కణాలను గుర్తించడానికి మూత్ర సైటోలజీ పరీక్ష చేయమని అడగవచ్చు. అల్ట్రాసౌండ్, CT స్కాన్ లేదా MRI వంటి ఇమేజింగ్ పరీక్షలు కణితి పరిమాణాన్ని, అది ఎంత వరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి సహాయపడతాయి. సిస్టోస్కోపీ (Cystoscopy) అనేది ముఖ్యమైన పరీక్ష. ఇందులో సన్నని ట్యూబ్‌ను మూత్రనాళం ద్వారా మూత్రాశయంలోకి పంపి లోపలి భాగాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే పరీక్ష కోసం కణజాల నమూనాను కూడా తీసుకుంటారు. క్యాన్సర్ దశ, రకాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ప్రారంభ దశల్లో శస్త్రచికిత్స ద్వారా కణితిని తొలగించవచ్చు. కణితి కండరాలకు వ్యాపిస్తే.. మూత్రాశయాన్ని పూర్తిగా తొలగించడం లేదా కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు అవసరం ఉంటుంది. శరీరం ఇచ్చే చిన్న చిన్న హెచ్చరికలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా నెమ్మదిగా మూత్రం రావడం, మూత్రంలో రక్తం కనిపించడం లేదా మూత్ర విసర్జనలో అసౌకర్యం వంటి లక్షణాలను సాధారణ యూరినరీ ఇన్‌ఫెక్షన్‌గా కొట్టిపారేయోద్దు. ఈ సంకేతాలు తీవ్రమైన బ్లాడర్ క్యాన్సర్ హెచ్చరిక కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: సీ విటమిన్ ఎక్కువైతే కిడ్నీలు ఖతమేనా.. షాకింగ్ నిజాలు!
Follow Us