/rtv/media/media_files/2025/02/23/LXX0er1WRlU0uteJufME.jpg)
Sleep
ఈ రోజుల్లో ఒత్తిడి, నిత్యం ఆలోచనలు, మొబైల్ స్క్రీన్‌లకు అతుక్కుపోవడం వంటి కారణాల వల్ల చాలా మందికి మంచి నిద్ర కరువవుతోంది. రాత్రి పడుకున్నా చాలా సేపటి వరకు నిద్ర పట్టక, అటు ఇటు దొర్లడం సర్వసాధారణమైపోయింది. ఆయుర్వేదం ప్రకారం.. నిద్ర అనేది జీవితంలోని మూడు ముఖ్యమైన స్తంభాలలో ఒకటి. పూర్తి నిద్ర శరీర మరమ్మత్తుకు, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి, జీర్ణవ్యవస్థ సమతుల్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మందులు లేకుండా తక్షణమే నిద్ర పట్టాలంటే ఏం చేయాలి..? ఈ ప్రశ్నకు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు కొన్ని సులభమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుపుతున్నారు. ఇవి చాలా మందికి ఉపయోగపడతాయని అంటున్నారు. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
తక్షణ నిద్ర కోసం పాటించాల్సిన నియమాలు:
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నిద్రకు ఒక స్థిరమైన సమయాన్ని నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. రాత్రి 10 గంటలకల్లా నిద్రపోవాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. ఈ సమయంలో శరీరం సహజంగా తనను తాను రిపేర్ చేసుకోవడం ప్రారంభిస్తుంది. ఆలస్యంగా మేల్కొని ఉంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని, మానసిక అలసట పెరుగుతుంది. పడుకునే ముందు మొబైల్ ఫోన్లు, టీవీల వంటి స్క్రీన్లకు దూరంగా ఉండటం చాలా అవసరం. వీటి నుంచి వచ్చే ప్రకాశవంతమైన కాంతి, నోటిఫికేషన్‌లు మెదడును చురుకుగా ఉంచి, నిద్రను ఆలస్యం చేస్తాయి. అంతేకాకుండా రాత్రిపూట తేలికపాటి, తక్కువ మసాలాలు ఉన్న ఆహారం తీసుకోవడం జీర్ణక్రియను సులభతరం చేసి.. శరీరం త్వరగా రిలాక్స్ అవ్వడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: జనపనార గింజల్లో ఎన్నో పోషకాలు.. పోషకాహార నిపుణుల సలహా మీరూ తెలుసుకోండి
గోరువెచ్చని పాలలో కొద్దిగా జాజికాయ లేదా అశ్వగంధ పొడి కలుపుకుని తాగితే మనస్సు ప్రశాంతంగా మారి, నిద్ర పడుతుంది. ఈ ఆహారాలు ట్రిప్టోఫాన్, మెలటోనిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి నిద్రను ప్రోత్సహించే పోషకాలతో నిండి ఉంటాయి. అరటిపండ్లు, బాదం, టార్ట్ చెర్రీ జ్యూస్ వంటివి కూడా తీసుకోవచ్చు. కెఫిన్ ఉన్న ఆహారాలు, భారీ భోజనాలు నిద్రకు ముందు మానెయ్యాలి. అయితే రాత్రి పడుకునే ముందు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో తలకు, పాదాలకు సున్నితంగా మసాజ్ చేసుకోవడం వల్ల శరీరంలో ఉండే వాత, పిత్త దోషాలు సమతుల్యమవుతాయి. గది దీపాలు డిమ్‌గా ఉంచి.. కొద్ది నిమిషాలు ధ్యానం చేయడం, నెమ్మదిగా సంగీతం వినడం లేదా దీర్ఘ శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పుట్టుమచ్చను చూసి క్యాన్సర్ పసిగట్టొచ్చు.. ఎలానో తెలుసా..?
Follow Us