Winter: శీతాకాలంలో జర పదిలం.. పొంచి ఉన్న 10 గుండె జబ్బులివే!

గుండె జబ్బుల ప్రమాదం చలికాలంలో పెరుగుతున్నాయి. ఈ పెరుగుదలకు తక్కువ ఉష్ణోగ్రత, శారీరక శ్రమ తగ్గడం, వాయు కాలుష్యం, శరీరంలో జరిగే అంతర్గత మార్పులే కారణం. భారత్‌లో పెరిగే 10 ప్రాణాంతక గుండె జబ్బుల ప్రమాదం గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
Heart Diseases

Heart Diseases

ప్రపంచవ్యాప్తంగా శీతాకాలం కేవలం వాతావరణంలో మార్పులు మాత్రమే తీసుకురాదు.. గుండె ఆరోగ్యానికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. హార్ట్ ఎటాక్ (గుండెపోటు), స్ట్రోక్ (పక్షవాతం), రక్తం గడ్డకట్టడం (బ్లడ్ క్లాట్) వంటి తీవ్రమైన గుండె జబ్బుల ప్రమాదం చలికాలంలో గణనీయంగా పెరుగుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. పరిశోధకులు ఈ పెరుగుదలకు తక్కువ ఉష్ణోగ్రత, శారీరక శ్రమ తగ్గడం, పెరుగుతున్న వాయు కాలుష్యం, శరీరంలో జరిగే అంతర్గత మార్పులను ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. డీప్ వీనస్ థ్రాంబోసిస్ (DVT), పల్మనరీ ఎంబోలిజం (PE), మహాధమని చీలిక (Aortic Rupture) వంటి జబ్బులు కూడా చలి నెలల్లో అధికమవుతున్నాయి. భారత్‌లో శీతాకాలంలో పెరిగే 10 ప్రాణాంతక గుండె జబ్బుల ప్రమాదం గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

గుండె జబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు:

శీతాకాలంలో గుండెపై అదనపు భారం పడటానికి, జబ్బులు పెరగడానికి ముఖ్యమైన జీవసంబంధ కారణాలు ఉన్నాయి. చలికి గురైనప్పుడు.. శరీరం వేడిని కాపాడుకోవడానికి రక్తనాళాలు సంకోచిస్తాయి. దీనిని వాసోకానిస్ట్రిక్షన్ అంటారు. దీనివల్ల రక్త ప్రవాహానికి ఎక్కువ ఒత్తిడి అవసరమై, రక్తపోటు (Blood Pressure) పెరుగుతుంది. ఈ అదనపు ఒత్తిడి గుండెపై భారం పెంచుతుంది. చలికాలంలో రక్తం మరింత చిక్కగా (Viscous) మారుతుంది. దీనితోపాటు ఫైబ్రినోజెన్ వంటి గడ్డకట్టే కారకాలు (Clotting Factors) పెరగడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం (Thrombosis) పెరుగుతుంది.

తక్కువ శారీరక శ్రమ: 

చలి కారణంగా చాలామంది వ్యాయామం, నడక వంటి శారీరక కార్యకలాపాలను తగ్గిస్తారు. దీంతో రక్త ప్రవాహం మందగిస్తుంది,  కొలెస్ట్రాల్ వంటి అంశాలు పెరుగుతాయి. చలికాలంలో ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, వాయు కాలుష్యం (Air Pollution) పెరుగుతాయి. ఇవి శరీరంలో మంటను (Inflammation) పెంచి, ధమనులలోని ఫలకాలను (Plaque) అస్థిరపరుస్తాయి, తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. భారత్‌లో కూడా జనవరి-ఫిబ్రవరి నెలల్లో గుండె సంబంధిత మరణాలు.. హైపర్‌టెన్షన్ మరణాలు అధికంగా ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నారు.

ప్రాణాంతక గుండె జబ్బులు:

హార్ట్ ఎటాక్: రక్తనాళాల సంకోచం, రక్తం గడ్డకట్టడం పెరగడం వల్ల గుండెకు రక్త ప్రసరణ తగ్గి గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.

స్ట్రోక్: చలికాలంలో పెరిగే రక్తపోటు, చిక్కబడిన రక్తం మెదడులోని రక్తనాళాలను మూసివేయడం లేదా పగిలిపోవడానికి దారితీసి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. సుమారు సగం అధ్యయనాలు శీతాకాలంలో స్ట్రోక్ కేసులు అధికంగా ఉన్నట్లు నివేదించాయి.

డీప్ వీనస్ థ్రాంబోసిస్ (DVT): చలి కారణంగా శరీరంలో రక్త ప్రవాహం నెమ్మదించడం, రక్తం గడ్డకట్టే సామర్థ్యం పెరగడం వల్ల కాళ్లలోని లోతైన సిరల్లో రక్తం గడ్డకడుతుంది. శీతాకాలంలో DVT ప్రమాదం సుమారు 14% పెరుగుతుందని ఒక అధ్యయనం తెలిపింది.

పల్మనరీ ఎంబోలిజం (PE): DVT నుంచి గడ్డకట్టిన రక్తం ఊపిరితిత్తుల్లోని రక్తనాళాలకు ప్రయాణించినప్పుడు PE సంభవిస్తుంది. ఇది ప్రాణాంతక స్థితి. DVT మాదిరిగానే.. జనవరి నెలలో దీని గరిష్ట కేసులు నమోదవుతాయి.

ఎయోర్టిక్ డిసెక్షన్, మహాధమని చీలిక: గుండె నుంచి బయలుదేరే ప్రధాన రక్తనాళం దెబ్బతినడం. చలికాలంలో పెరిగే రక్తపోటు ఈ ధమని గోడలపై అదనపు ఒత్తిడిని కలిగించి, చీలికకు లేదా పగులుకు దారితీస్తుంది.

హైపర్‌టెన్షన్: పరిశోధనల ప్రకారం.. చలికాలంలో సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రెండూ పెరుగుతాయి. ఇది మిగతా అన్ని గుండె జబ్బులకు మూలకారణం.

గుండె వైఫల్యం: చలి రక్తనాళాలను బిగుతుగా చేయడం వల్ల గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇప్పటికే దీర్ఘకాలిక గుండె వైఫల్యం(Heart Failure) ఉన్నవారికి శీతాకాలపు వైరస్‌లు, అధిక రక్తపోటు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి.

నాన్‌ట్రామాటిక్ ఇంట్రాసెరెబ్రల్ హెమరేజ్ (ICH): ఇది మెదడులో రక్తస్రావం కావడం వల్ల వచ్చే ఒక రకమైన స్ట్రోక్. అధిక రక్తపోటు అనేది దీనికి ప్రధాన కారణం, చలికాలంలో రక్తపోటు పెరగడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంది.

ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AF): ఇది అసాధారణ హృదయ స్పందన (Irregular Heartbeat) వల్ల వచ్చే సమస్య. ఉష్ణోగ్రత, తేమ, వాతావరణ పీడనం వంటి కారకాలు దీనిని ప్రభావితం చేస్తాయని.. ముఖ్యంగా వృద్ధులలో శీతాకాలంలో దీని కేసులు పెరుగుతున్నట్లు వివిధ దేశాల పరిశోధనలు సూచిస్తున్నాయి.

ఎన్జైమా పెక్టోరిస్: గుండెకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల వచ్చే ఛాతీ నొప్పి. చలి మరియు తేమ కలయిక గుండెపై ఒత్తిడి పెంచడం వల్ల శీతాకాలంలో దీని కేసులు పెరుగుతాయి.

ఇది కూడా చదవండి: వారాంతాలను సద్వినియోగం చేసుకోండి.. ముఖం మిలమిల మెరిసేలా మార్చుకోండి!!

గుండెను కాపాడుకోవడం ఎలా..?

శీతాకాలంలో గుండె సమస్యల నుంచి రక్షణ పొందడానికి కొన్ని కీలకమైన నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. శరీర ఉష్ణోగ్రత పడిపోకుండా ఉండటానికి పొరలుగా (Layers) దుస్తులు ధరించాలి. తల, మెడ, చేతులు, పాదాలను కవర్ చేయడం చాలా ముఖ్యం. బయట ఉన్నప్పుడు తరచుగా లోపలికి వచ్చి వెచ్చదనం తీసుకోవాలి. అంతేకాకుండా శారీరక శ్రమను ఆపవద్దు. బయట వాతావరణం చల్లగా ఉంటే యోగా, ట్రెడ్‌మిల్ వాకింగ్ లేదా ఇంట్లో చేసే ఇతర వ్యాయామాలకు మార్చాలి. ఉదయం మంచులో లేదా అతి చల్లగా ఉన్న సమయంలో వ్యాయామం చేయడాన్ని నివారించాలి.

ఆహారం-హైడ్రేషన్:

ఉప్పు, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. వెచ్చని సూప్‌లు, హెర్బల్ టీలు వంటి వాటితో హైడ్రేటెడ్‌గా ఉంచాలి. డీహైడ్రేషన్ రక్తాన్ని చిక్కబరుస్తుంది. అంతేకాకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. చలికాలంలో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి.. అవసరమైతే వైద్యుల సలహా మేరకు మందుల మోతాదును సర్దుబాటు చేసుకోవాలి. ఫ్లూ షాట్ వంటి టీకాలు వేయించుకోవడం ద్వారా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.. తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా చలిలో బరువైన పనులు చేసేటప్పుడు గుండెపై అదనపు భారం పడుతుంది. అందుకే నిపుణులు ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వారికి, గుండె జబ్బులు ఉన్నవారికి చలికాలంలో తీవ్రమైన శ్రమతో కూడిన పనులు చేయవద్దని సలహా ఇస్తున్నారు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా శీతాకాలంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు, ప్రమాదకరమైన గుండె సంబంధిత సమస్యల బారి నుంచి రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ప్లాస్టిక్ డబ్బాల్లో ఆఫీస్‌కు లంచ్ తీసుకెళ్తున్నారా..? ఈ విషయం తెలిస్తే ఇక చచ్చినా అలా చేయరు..!

Advertisment
తాజా కథనాలు