/rtv/media/media_files/2025/08/12/mouth-open-sleep-2025-08-12-14-28-17.jpg)
Mouth Open Sleep
Mouth Open Sleep: నిద్రలో నోరు తెరిచి పడుకోవడం చాలామందికి ఒక సాధారణ అలవాటుగా కనిపిస్తుంది. కానీ ఇది కేవలం అలవాటు మాత్రమే కాదని.. కొన్ని ఆనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా మనం నిద్రలో ముక్కుతో శ్వాస తీసుకోవాలి. కానీ ముక్కు దిబ్బడ, శ్వాసలో ఇబ్బందులు ఉన్నప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే గాలి ఫిల్టర్ అయ్యి ఊపిరితిత్తులకు చేరుతుంది. అదే నోటితో అయితే ఆ ప్రక్రియ సరిగా జరగదు. దీని వల్ల నోరు, గొంతు పొడిబారడం, నోటి దుర్వాసన, గొంతునొప్పి, దంతాల సమస్యలు వంటివి తలెత్తవచ్చు. నోటితో శ్వాస తీసుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటి గురించి కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
అలెర్జీలు-సైనస్ వంటి సమస్యలు ఉంటే..
ముక్కు లోపల ఉండే ఎముక వంకరగా ఉండడం (deviated septum) దీనికి ఒక ప్రధాన కారణం. ఈ సమస్య వలన ముక్కులో ఒక రంధ్రం మూసుకుపోయి శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. పిల్లల్లో అయితే ఎడినాయిడ్స్ అని పిలిచే టాన్సిల్స్ వంటి కణజాలం పెరగడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడవచ్చు. నవజాత శిశువులు ఇలా చేస్తే.. వారి ముక్కులో ఏదైనా అడ్డుపడటం లేదా ముక్కు ఎముకకు గాయం కావడానికి అవకాశం ఉంది. ఈ అలవాటును వదిలించుకోవాలంటే.. ముందుగా దాని వెనుక ఉన్న కారణాన్ని గుర్తించాలి. ముక్కు దిబ్బడ ఉంటే హ్యుమిడిఫైయర్ వాడటం, సముద్రపు నీటితో కూడిన నాసల్ స్ప్రే వాడటం వంటివి చేయవచ్చు. అలెర్జీలు లేదా సైనస్ వంటి సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి.
ఇది కూడా చదవండి: వర్షాకాలంలో పురుగుల బెడద ఉందా..? ఇలా ఇంటి చిట్కాలతో చెక్ పెట్టండి
ఇటీవల సోషల్ మీడియాలో మౌత్ టేపింగ్ అనే పద్ధతి చర్చనీయాంశంగా మారింది. ఇది నిద్రలో నోరు తెరుచుకోకుండా నోటిపై ఒక చిన్న టేప్ లేదా ప్యాచ్ అంటించుకోవడం. ఇది గురక, నిద్రలో శ్వాస ఆగిపోయే సమస్యను తగ్గించగలదని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. ఛాతీ వ్యాధుల నిపుణుల అభిప్రాయ ప్రకారం.. ముక్కుతో శ్వాస తీసుకునే వారికి ఎటువంటి ఇబ్బంది లేకపోతేనే ఇది సురక్షితం. శ్వాస సమస్యలు, స్లీప్ అప్నియా వంటివి ఉన్నవారు డాక్టర్ సలహా లేకుండా ఇలా చేయడం ప్రమాదకరం. అందుకే తరచుగా నోరు తెరిచి పడుకునేవారు నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: పసుపు పచ్చని పళ్ళకు స్వస్తి.. ఇంటి చిట్కాలతో తెల్లటి ముత్యాల మెరుపు