/rtv/media/media_files/jyG66haxP6eTpcjlRT3v.jpg)
Big Beautiful Bill: ట్రంప్(trump) ఎప్పటి నుంచి అమలు చేయాలనుకుంటున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్లును అమెరికా(america) ప్రతినిధుల సభ ఆమోదించింది. సుదీర్ఘ చర్చ అనంతరం గురువారం జరిగిన ఓటింగులో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుకు సెనెట్‌లో ఆమోదం లభించింది. ట్రంప్ సంతకం తర్వాత ఈ బిల్లు చట్టంగా మారనుంది. అటు అమెరికా రాజకీయాల్లో, ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు ఈ బిల్లును భావిస్తున్నారు. అయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల ఎన్నారైలపై ఎంతం ప్రభావం చూపించనుందో తెలుసుకుందాం..
ఏంటీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఒక విస్తృత ఆర్థిక, పన్ను, వలస విధానాల చట్టం. పన్నుల్లో కోతలు, వ్యయ నియంత్రణే లక్ష్యంగా తెస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. ఈ బిల్లు అమలులోకి వస్తే అమెరికాలో కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలు, టిప్/ఓవర్‌టైమ్ వేతనదారులు లాభపడతారు. కానీ తక్కువ ఆదాయ గల కుటుంబాలు, వలసదారులు, పునరుత్పాదక రంగం నష్టపోతాయి. అందుకే అమెరికాలో ప్రతిపక్షాలు ఈ బిల్లుకు అడ్డుతగులుతున్నాయి. డెమొక్రాట్లు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును సంపన్నులకు లాభం, సామాన్యులకు నష్టమని విమర్శిస్తున్నారు. హకీం జెఫ్రీస్ అనే నేత 8 గంటల పాటు బిల్లుకు వ్యతిరేకంగా ప్రసంగించారు.
పన్ను కోతలు: 2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేస్తుంది. కార్పొరేట్ కంపెనీలు, ఉన్నత ఆదాయ వర్గాలకు పన్ను మినహాయింపులు కల్పిస్తుంది.
టిప్పులు, ఓవర్‌టైమ్‌పై పన్ను మినహాయింపు: టిప్ ఆదాయంపై పన్ను రద్దు, ఓవర్‌టైమ్ ఆదాయంపై $12,500 వరకు మినహాయింపు.
చైల్డ్ టాక్స్ క్రెడిట్ పెంపు: పిల్లలపై టాక్స్ క్రెడిట్ $2,000 నుంచి $2,200కి పెంపు. కానీ తక్కువ ఆదాయ కుటుంబాలకు ఇది పూర్తిగా వర్తించదు.
1% రెమిటెన్స్ పన్ను: అమెరికా నుంచి భారత్ వంటి దేశాలకు నగదు బదిలీలపై 1% పన్ను విధించబడుతుంది.బ్యాంక్, డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా(డిజిటల్ లావాదేవీలు) పంపిన డబ్బుకు మినహాయింపు ఉంది.
వలస నియంత్రణ కఠినతరం: ICE అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు ఉన్నాయి.
మెడికేడ్, ఫుడ్ స్టాంపులపై కోతలు: తక్కువ ఆదాయ గల అమెరికన్లకు ఆరోగ్య, ఆహార సహాయ కార్యక్రమాల్లో కోతలు విధించబడ్డాయి.
పునరుత్పాదక శక్తికి ఎదురుదెబ్బ: సౌర, గాలి శక్తి పథకాలపై పన్ను రాయితీలు తగ్గించబడ్డాయి, ఇది గ్రీన్ ఎనర్జీ రంగానికి నష్టంగా మారుతుంది.
Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!
వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ప్రభావం
నగదు బదిలీలపై 1% రెమిటెన్స్ పన్ను
2026 జనవరి 1 నుంచి, అమెరికా నుంచి భారత్‌కు పంపే నగదు బదిలీలపై 1% పన్ను విధించనున్నారు. నగదు, మనీ ఆర్డర్, చెక్కుల రూపేణా పంపేవాటికి ఇది వర్తిస్తుంది. మొదట ఇది 5%గా ప్రతిపాదించబడింది. తర్వాత 3.5%కి తగ్గించి చివరకు 1 శాతంగా నిర్ణయించారు. ఇది చిన్న మొత్తంగా అనిపించినా.. తరచూ డబ్బు పంపే కుటుంబాలకు ఇది లక్షల్లో అదనపు భారం కానుంది. అయితే డిజిటల్ మార్గాలు ఉపయోగించే వారు పన్ను నుంచి తప్పించుకోవచ్చు. ఉదాహరణకు నెలకు $500 పంపే వ్యక్తి.. ఏడాదికి $6,000 పంపుతాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు అమల్లోకి వస్తే.. $60 అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది చిన్న మొత్తంగా అనిపించినా భారంగానే మారనుంది.
భారత్‌కు వచ్చే రెమిటెన్స్‌లో తగ్గుదల
బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1% రెమిటెన్స్ పన్ను ప్రభావం కేవలం ప్రవాస భారతీయులకే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు కూడా ఉండనుంది. రెమిటెన్స్ అంటే ఒక వ్యక్తి విదేశంలో పని చేసి, అక్కడి నుంచీ తన స్వదేశంలోని కుటుంబానికి లేదా ఖాతాకు డబ్బు పంపడం. 2023–24లో భారత్‌కు వచ్చిన మొత్తం రెమిటెన్స్ 135.46 బిలియన్ డాలర్లు. అందులో 32 బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది. అయితే1% పన్ను విధానం వల్ల 10–15% తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే 12–18 బిలియన్ డాలర్ల వరకు నష్టం జరగవచ్చు. రెమిటెన్స్‌లు భారతదేశానికి విదేశీ కరెన్సీ ప్రవాహంలో ప్రధాన భాగం. కాబట్టి ఈ తగ్గుదల వల్ల విదేశీ మారక నిల్వలపై ప్రభావం పడుతుంది. డాలర్ నిల్వలు తగ్గి, రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీయవచ్చు. ఇంకోవైపు.. బ్యాంకింగ్ వ్యవస్థపై ఇది ప్రభావం చూపించనుంది. రెమిటెన్స్ తగ్గితే బ్యాంకుల డిపాజిట్లు తగ్గుతాయి, ఇది వడ్డీ రేట్ల పెరుగుదలకు దారితీయవచ్చు.మరీ ముఖ్యంగా గ్రామీణ బ్యాంకింగ్ సేవలపై ప్రభావం ఉండే అవకాశం ఉంది.
Also Read: కెచప్‌తో రోటీ పరోటా పిల్లలకు ఇస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?
వలసలు ఇక కష్ణమే..
ఈ బిల్లుతో వలస నియంత్రణ మరింత కఠినతరం కాబోతోంది. వీసా ఫీజులు పెరిగాయి. H-1B, L-1 వీసాలతో పాటు ఆశ్రయం దరఖాస్తులకు భారీగా ఫీజులు విధించబడ్డాయి. అక్రమంగా వచ్చినవారిపై ఓ రేంజ్లో జరిమానాలు విధించాలని నిర్ణయించారు. డిపోర్టేషన్ బలగాల విస్తరణ వంటి చర్యలు ప్రవేశపెట్టబడ్డాయి. అక్రమ వలసదారులను తనిఖీలు చేయడం.. అవసరమైతే అక్కడికక్కడే అరెస్టులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇది అమెరికాలో ఉన్న ఎన్నారైలకు మాత్రమే కాదు.. అక్కడ చదువుతున్న విద్యార్థులకు, ఉద్యోగార్థుల్లో కూడా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా.. అమెరికాలో శాశ్వత నివాసం అనే కలకు బిగ్ బ్యూటీఫుల్ బిల్ ఒక శరాఘాతంగా పరిణమించబోతోందనే చెప్పొచ్చు.
Also Read:Tamannaah Bhatia: రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. స్టిల్స్ పిచ్చేక్కించేసిందిగా!
పెట్టుబడి ప్రణాళికలో మార్పులు
కార్పొరేట్ సంస్థలు, పెద్ద స్థాయి పెట్టుబడిదారులకు ఈ బిల్లుతో పన్ను మినహాయింపులు ఉన్నా.. ఎన్నారైల వాస్తవ ప్రయోజనాలు మాత్రం పరిమితంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా పన్ను రీఫండ్లు U.S. పౌరులకు మాత్రమే వర్తించడంతో, ఎన్నారైల ఆసరా మరింత దెబ్బతినే అవకాశమే కనిపిస్తోంది. సాధారణంగా రియల్ ఎస్టేట్ అనేది ప్రవాస భారతీయులకు కేవలం పెట్టుబడి కాదు.. భారత్‌తో అనుబంధానికి ఆధారం కూడా. ఈ పన్ను వల్ల భారత్‌లో ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకానికి సంబంధించిన పెద్ద మొత్తాల బదిలీలపై అదనపు ఖర్చు వస్తుంది. అలాంటి సందర్భంలో ఈ పన్ను వారి ఆర్థిక ప్రయోజనాలపై కాదు, భావోద్వేగాలపై కూడా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో.. దీర్ఘకాలికంగా ఆస్తులు కొనాలని భావించిన వారు, ఇప్పుడు పన్ను అమలుకు ముందు ముందుగా డబ్బు పంపించి కొనుగోలు పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇది ఒక రకంగా బిల్లు అమలుకు ముందు ఆస్తి రద్దీ అనే పరిస్థితిని తెచ్చింది. దీంతో పన్ను అమలుకు ముందు తాత్కాలికంగా బదిలీల పెరుగుదల జరిగే అవకాశం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్‌తో పాటు విద్య, ఆరోగ్య ఖర్చులపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కాబట్టి ఈ బిల్లు ప్రవాస భారతీయులపై కేవలం పన్ను భారం మాత్రమే కాదు, నియంత్రణ భారాన్ని కూడా పెంచుతోంది. ఇది పెద్ద మొత్తంలో డబ్బు పంపే వారికి మాత్రమే కాదు, చిన్న మొత్తాల్లో తరచూ పంపే వారికి కూడా అదనపు డాక్యుమెంటేషన్, సమయం, ఖర్చు పెరుగుతాయి. ఎన్నారైలు డబ్బు పంపడాన్ని తగ్గిస్తే, భారత్‌లోని కుటుంబాల ఆదాయం తగ్గుతుంది. ఇది వారి వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలతో పాటు కుటుంబాలపై, చివరికి భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉంది.