/rtv/media/media_files/2025/08/07/green-card-2025-08-07-14-26-12.jpg)
Green Card
అమెరికాకు వెళ్లేవారిలో చాలామంది అక్కడ శాశ్వత నివాసం కోసం పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ (గ్రీన్‌కార్డు)ను పొందాలనుకుంటారు. కానీ ఇప్పుడు అది రావాలంటే ఏళ్ల తరబడి వేచిచూడాల్సి వస్తోంది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చేవారికి ఇది ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలోనే ఈ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా కీలక నిర్ణయం తీసుకోంది. గ్రీన్‌కార్డును త్వరగా అందించేందుకు ఓ షార్ట్‌కట్ మార్గాన్ని ప్రతిపాదించింది. దీనికోసం 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్నవారు 20 వేల డాలర్లు(రూ.17.5 లక్షలు) చెల్లిస్తే త్వరగా వాళ్ల దరఖాస్తును పరిశీలించేలా డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025 పేరుతో ఓ బిల్లును తీసుకొచ్చింది.
Also Read: ఇండియా-పాక్ సీజ్‌ఫైర్ ట్రంప్ సుంకాలకు మధ్య లింక్?.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు పరిష్కారం చూపించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు చట్టసభ సభ్యురాలు మారియా ఎల్విరా సలజార్ చెప్పారు. ఇమిగ్రేషన్ చట్టాల ప్రకారం చూసుకుంటే అమెరికా ప్రతి సంవత్సరం 2,26,000 ఫ్యామిలీ ప్రిఫరెన్స్, 1,40,000 ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే 20 వేల డాలర్ల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజు ద్వారా గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్‌లను క్లియర్ చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు.
Also Read: ఐర్లాండ్ లో మితిమీరిన జాత్యాహంకారం..ఆరేళ్ల ఇండియన్ బాలిక ప్రైవేట్ పార్ట్ లపై దాడి
గ్రీన్‌కార్డులను అక్కడ ఇష్టమొచ్చినట్లు జారీ చేయరు. ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే వీటిని అందిస్తారు. ప్రస్తుతం గ్రీన్‌కార్డు కోసం వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. కానీ ఈ కొత్త బిల్లులో దాన్ని 15 శాతానికి పెంచారు. అలాగే అమెరికాకు వర్క్‌పర్మిట్ కోసం వచ్చిన దంపతుల పిల్లల(డ్రీమర్ల)కు శాశ్వత నివాస హోదా పొందడానికి ఈ ప్రతిపాదిత బిల్లు అవకాశం కల్పిస్తుంది.
Also Read: భారత్‌పై భారీ సుంకాల వేళ.. అమెరికాకు మరోసారి పాక్ ఆర్మీ చీఫ్.. అసలేం జరుగుతోంది?
ముఖ్యంగా భారత్‌తో పాటు చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ దేశాల నుంచి గ్రీన్‌కార్డుల కోసం ఎక్కువగా పోటీ ఉంటుంది. ప్రతీ ఏడాది దీనికోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. దేశాలవారీగా కోటా కారణంగా వాళ్లు శాశ్వత నివాసం కోసం ఏళ్లతరబడి నిరీక్షించాల్సి ఉంటుంది. గ్రీన్‌కార్డుల జారీపై కోటా స్థిరంగా ఉన్నప్పటికీ ప్రతీ ఏడాది దీనికి డిమాండ్ మాత్రం ఏటేటా పెరుగుతోంది. ఇటీవల యూఎస్ సీఐఎస్ ఓ డేటాషీట్ విడుదల చేసింది. అందులో చూస్తే అమెరికా ఇమిగ్రేషన్ బ్యాక్‌లాగ్‌లో 1.13 కోట్ల అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంతమొత్తంలో దరఖాస్తులు ఉండటం గమనార్హం. రోజురోజుకి ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. 2024లో 33 లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేశారు. కానీ ఈసారి 27 లక్షల మందికి మాత్రమే చేయనున్నారు. అయితే అమెరికా తాజాగా తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు వల్ల గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసేవారికి ప్రయోజనం చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: అవయవాలు దానం చేస్తుండగా.. చివరి క్షణంలో కోమాలోంచి బయటకొచ్చింది