Israel-Hamas Ceasefire: ఇజ్రాయెల్-హమాస్ శాంతి ఒప్పందం.. యుద్ధం ముగిసినట్లేనా ?

అక్టోబర్ 9న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈజిప్ట్‌లో సుధీర్ఘ చర్చల అనంతరం ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య బందీల అప్పగింత, కాల్పుల విరమణపై ఒప్పందం జరిగింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Isarel Gaza war ends, finally how long will peace last?

Isarel Gaza war ends, finally how long will peace last?

హమాస్‌(hamas) ను అంతం చేసే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్(Gaza-Israel) నిరంతరాయంగా కాల్పులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. చివరికీ అక్టోబర్ 9న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈజిప్ట్‌లో సుధీర్ఘ చర్చల అనంతరం ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య బందీల అప్పగింత, కాల్పుల విరమణపై ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు ఇజ్రాయెల్ కేబినెట్ 2025 శుక్రవారం తెల్లవారుజామున తుది ఆమోదం తెలపడంతో కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. 

ట్రంప్ విజయం ?

అలాగే ఈ  ఒప్పందం ప్రకారం 72 గంటల్లోపు.. హమాస్ తమ అధీనంలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. దీనికి బదులుగా ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే గాజాలోని కొన్ని ప్రాంతాల నుండి ఇజ్రాయెల్ తమ బలగాలను పాక్షికంగా ఉపసంహరించుకోవాలి. యుద్ధాన్ని ముగించిన వ్యక్తిగా గుర్తింపు కోసం ఆరాటపడుతున్న ట్రంప్‌కు ఇదొక దౌత్య విజయమని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

Also Read: భారత్ గడ్డపై నుంచి పాకిస్తాన్‌కు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇజ్రాయెల్, హమాస్‌కు హెచ్చరిక

గాజా శాంతి ఒప్పందం అమలు చేసేందుకు తమ తొలి దశ ప్లాన్‌ గురించి గత వారం ట్రంప్‌ మాట్లాడారు. ఆ సమయంలో ఆయన పక్కన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ఉన్నారు. గతంలో యుద్ధం ఆపేందుకు జరుగుతున్న శాంతి ప్రయత్నాలను నెతన్యాహు అడ్డుకున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ట్రంప్ నెతన్యూహుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌ తన మాట వినేందుకు ట్రంప్ అధికారాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే హమాస్‌ను కూడా తుడిచిపెట్టేస్తాం అని హెచ్చరించారు. దీంతో ఇజ్రాయెల్, హమాస్‌కు దారికొచ్చాయి. ట్రంప్ ప్లాన్‌ను అరబ్, ముస్లిం దేశాలు కూడా స్వాగతించాయి. ఈజిప్ట్‌, ఖతార్, తుర్కియే కూడా చర్చల్లో కీలక పాత్ర పోషించాయి.  

హమాస్ వద్ద ప్రస్తుతం 20 మంది ఇజ్రాయెలీ బందీలు ఉన్నారు. వీళ్లందరినీ ఆదివారం నాటికి విడిచిపెట్టే ఛాన్స్ ఉంది. అలాగే మరణించిన 28 మంది మృతదేహాలను కూడా దశల వారీగా అప్పగించనున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ జైళ్ల నుంచి కూడా వందలాది మంది పాలస్తీనియన్లను రిలీజ్ చేయనున్నారు. గాజాలో పలు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు కూడా వెళ్లిపోనున్నాయి. దీనివల్ల గాజాకు వచ్చే మానవతా సాయం మరింత పెరగనుంది. 

గత నెలలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించి ఖతార్ రాజధాని దోహాలో చర్చలు జరిగాయి. ఆ సమయంలో హమాస్‌ నాయకులు చంపేందుకు ఇజ్రాయెల్ విఫలయత్నం చేసింది. ఈ చర్యలను ఐక్యరాజ్య సమితితో సహా దాని మిత్రదేశాలు కూడా ఖండించాయి. ఆ తర్వాతే శాంతి ఒప్పందం కోసం ఇజ్రాయెల్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. ట్రంప్ టీమ్ దీన్ని అవకాశంగా తీసుకుంది. చివరికి ఇజ్రాయెల్-హమాస్‌తో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయించింది. 

Also Read: మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి రావాడానికి కారణం ఇదే.. ఆమె ఏం చేసిందో తెలుసా ?

గ్యారెంటీ లేని ఒప్పందం 

అయినప్పటికీ ఈ ఒప్పందం వల్ల గాజాలో శాంతియుత పరిస్థితులకు గ్యారెంటీ కనిపించడం లేదు. దీనికి కారణం ఒప్పందంలో అసలైన కీలక అంశాలను సిద్ధం చేయలేదు. ఈ కీలక అంశాల్లో హమాస్‌ నిరాయుధీకరణ, గాజా పరిపాలనను ఎవరికి అప్పగిస్తారు ?, అలాగే ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి ఎప్పటిలోగా వెళ్లిపోతాయి?, కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుంది ? అనే అంశాలు ఉన్నాయి. కానీ శాంతి ఒప్పందం కుదరడంతో గాజాలో పాలస్తీనా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇజ్రాయెల్‌ బందీలను అప్పగిస్తే తమపై మళ్లీ ఇజ్రాయెల్‌ బలగాలు దాడి చేయకుండా హామీ ఇవ్వాలని హమాస్‌ డిమాండ్ చేస్తోంది. 

ఈ ఏడాది మార్చిలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి గాజాపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఈ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. యుద్ధం వల్ల తమకు జరుగుతున్న నష్టం, ఇక ప్రపంచంలో తాము ఒంటరవుతామనే విషయాన్నిఇజ్రాయెల్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కొద్దిమంది మాత్రమే యుద్ధాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. దీంతో ప్రధాని నెతన్యాహుకు రాజకీయంగా అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయనకు అతివాద జాతీయవాదులైన మంత్రుల సపోర్ట్‌ ఉంది. ఒకవేళ హమాస్‌తో ఒప్పందం చేసుకుంటే తమ సపోర్ట్‌ ఉపసంహరించుకుంటామని కూడా హెచ్చరించారు. దీంతో నెతన్యాహు మళ్లీ యుద్ధాన్ని కొనసాగించే అవకాశం లేకపోలేదని పలువురు నిపుణలు భావిస్తున్నారు. 

Also Read: భారత్ అమ్ముల పొదిలోకి మరో అడ్వాన్స్‌డ్‌ ఆయుధం.. ఇక శత్రు దేశాలకు చెమటలే

వచ్చే ఏడాది ఎన్నికలు 

ఇదిలాఉండగా 2026 అక్టోబర్‌ చివరి నాటికి ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. హమాస్‌తో శాంతి ఒప్పందం వల్ల నెతన్యాహు ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందా? లేదా ? అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. 2023 అక్టోబర్ 7న హమాస్ దాడికి ప్రతికారంగా ఇజ్రాయెల్ గాజాపై యుద్ధం మొదలుపెట్టింది. హమాస్ జరిపిన దాడుల్లో 1200 మంది ప్రజలు చనిపోగా అందులో ఎక్కువగా ఇజ్రాయెల్ పౌరులే ఉన్నారు. 251 మందని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. ఇక ఇజ్రాయెల్ సైన్యం దాడుల్లో 67 వేల మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇందులో 18 వేల మంది చిన్నారులే ఉన్నారు. 

Advertisment
తాజా కథనాలు