కారుతో తొక్కించి.. బంగ్లాదేశ్‌లో మరో హిందూ దారుణ హత్య

రాజ్‌బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న రిపోన్ సాహా (30) అనే హిందూ యువకుడిని, అధికార పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు తన కారుతో ఢీకొట్టి చంపాడు.

New Update
bangladesh

బంగ్లాదేశ్‌లో హిందువులే లక్ష్యంగా హింసాకాండ కొనసాగుతోంది. రాజ్‌బరి జిల్లాలోని కరీం ఫిల్లింగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న రిపోన్ సాహా (30) అనే హిందూ యువకుడిని, అధికార పలుకుబడి ఉన్న ఒక రాజకీయ నాయకుడు తన కారుతో ఢీకొట్టి చంపాడు. శుక్రవారం రాత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) రాజ్‌బరి జిల్లా యూనిట్ మాజీ కోశాధికారి అబుల్ హషేమ్ తన కారులో పెట్రోల్ కోసం బంకుకు వచ్చాడు. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత, డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోబోయాడు. దీంతో రిపోన్ అతడిని అడ్డుకొని డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఒక సామాన్య ఉద్యోగి తనను ఆపడమేంటన్న అహంకారంతో ఆగ్రహానికి గురైన హషేమ్, కావాలనే తన కారుతో రిపోన్‌ పైకి ఎక్కించాడు. కారు చక్రాల కింద పడి నలిగిపోయిన రిపోన్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిందితుడు అబుల్ హషేమ్‌తో పాటు అతడి కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో గత మూడు వారాల వ్యవధిలోనే దాదాపు 10 మంది హిందువులు హత్యకు గురికావడం గమనార్హం. రాజకీయ అస్థిరతను అడ్డుపెట్టుకుని మైనారిటీల ఆస్తులను లూటీ చేయడం, ప్రాణాలు తీయడం వంటి ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. అంతర్జాతీయ సమాజం హెచ్చరిస్తున్నా, అక్కడ హిందువుల భద్రత ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఈ తాజా హత్యతో స్థానిక హిందూ సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

Advertisment
తాజా కథనాలు