/rtv/media/media_files/2026/01/02/economic-crisis-in-iran-leads-to-gen-z-protests-2026-01-02-12-43-09.jpg)
Economic crisis in iran leads to Gen z Protests
ఈమధ్యకాలంలో జెన్ జడ్(Gen Z) ఆందోళనలు అధికార ప్రభుత్వాలకు వణుకుపుట్టిస్తున్నాయి. ఇటీవల శ్రీలంక(srilanka), బంగ్లాదేశ్(bangladesh), నేపాల్(nepal) లో చెలరేగిన నిరసనలు ప్రభుత్వాలనే మార్చేశాయి. తాజాగా ఇరాన్‌లో కూడా జెన్ జడ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ముందుగా దేశరాజధాని టెహ్రాన్‌లో ఈ నిరసనలు ప్రారంభం కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఆర్థిక సంక్షోభంతో ఇరాన్ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ కూడా రాజీనామా చేశారు. గత నాలుగు రోజులుగా అక్కడ నిరసనలు జరుగుతున్నాయి.
పలుచోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యా్స్‌లు ప్రయోగిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు ప్రభుత్వం ఆందోళనకారులను చర్చలకు పిలిచింది. కానీ ప్రయోజనం లేదు. ఏకంగా 10 యూనివర్సిటీల విద్యార్థులు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. సుప్రీం లీడర్ ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నియంతలకు మరణశిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
40 శాతానికి చేరిన ద్రవ్యోల్బణం
ఇరాన్‌లో ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఏకంగా 40 శాతానికి చేరింది. దీంతో నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయాయి. బుధవారం నాటికి ఒక అమెరికన్ డాలరు విలువ ఏకంగా 1.38 మిలియన్ రియాల్స్‌గా ఉండటం గమనార్హం. 2022లో సెంట్రల్ బ్యాంకు గవర్నర్ మహమ్మద్ రెజా ఫర్జీన్ బాధ్యతలు చేపట్టినప్పుడు ఆ కరెన్సీ విలువ 4,30,000గా ఉండేది. మూడేళ్లలోనే దాని విలువ భారీగా పతనం అయ్యింది. ఈ క్రమంలోనే అక్కడి ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పాశ్చత్య దేశాల ఆంక్షలు కూడా ఇరాన్ ఈ పరిస్థితికి దిగజారిపోవడానికి కారణం అయ్యాయి.
Also read: న్యూఇయర్ వేళ పాక్ ఉగ్రకుట్ర.. డ్రోన్లతో పేలుడు పదార్థాలు సరఫరా
2015లో చూసుకుంటే ఒక డాలరు విలువ 32 వేల రియాల్స్‌గా ఉండేది. ఈ పదేళ్లలో 1.38 మిలియన్ రియాల్స్‌కు చేరిందంటే అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్‌లో ఒక సగటు ఉద్యోగి నెలకు 100 డాలర్లు (దాదాపు రూ.9 వేలు) మాత్రమే సంపాదిస్తారు. ఈ డబ్బులు కేవలం నిత్యావరస సరకుల కొనుగోలుకు, ఆహారానికే సరిపోతాయి. ఇరాన్ ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. మరోవైపు దాని చమరుపై ఆంక్షల కారణంగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది.
మరోవైపు ఇరాన్ ప్రభుత్వం 2026 బడ్జెట్‌లో పన్నును 62 శాతానికి పెంచేసింది. ద్రవ్యోల్బణాన్ని కూడా 50 శాతం అంచనా వేసింది. ఇలా చేయడం ప్రజలను దోచుకోవడమేనని విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంతో ప్రజలు ఇన్నాళ్లు దాచుకున్న డబ్బులు అవలీలగా ఖర్చయిపోతున్నాయి. ప్రస్తుతం ఆహారం, ఔషధాలు కొనలేని పరిస్థితులు వచ్చాయి. మరోవైపు తాగునీరు, విద్యుత్ సరఫరాల్లో కూడా తరచుగా అంతరాయాలు జరుగుతున్నాయి. పేదలకే కాకుండా పట్టణాల్లో ఉండే మధ్య తరగతి ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Also Read: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. యూనస్‌పై షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ప్రజలపై అణిచివేత
ఇరాన్ ప్రభుత్వం కూడా ఆందోళనకారులతో చర్చలు జరుపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అలాగే నిరసనాకారులను అణిచివేసేందుకు రెడీ అవుతోంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తగిన విధంగా స్పందిస్తామని ఇరాన్ ప్రాసిక్యూటర్ జనరల్ మహమ్మద్ మోవహెది ఆజాద్ హెచ్చరికలు జారీ చేశారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తే ఇబ్బంది లేదని అన్నారు. మరోవైపు ఇరాన్‌లో జరుగుతున్న ఆందోళనల వెనుక విదేశీ నిఘా సంస్థల పాత్ర ఉందని ప్రభుత్వ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఖమేనీ తర్వాత ఎవరు ?
ఇదిలాఉండగా 2025లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం కూడా ఇరాన్‌కు భారీ దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థ, అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి లాంటి వారు ఖమేనీ ఇక ఉనికిలో ఉండకూడదని బహిరంగంగా వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. మరోవైపు ఖమేనీకి ప్రస్తుతం 86 ఏళ్లు. ఆయన అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఖమేనీ తర్వాత అధికారం ఎవరికి వస్తుందనే దానిపై కూడా ఇరాన్ పాలకుల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. ఇరాన్‌లో నిరసనలు తీవ్రతరమైతే ఖమేనీ అధికారం నుంచి తప్పుకునే ఛాన్స్ ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఖమేనీ ప్రభుత్వాన్ని పడుగొట్టడం సాధ్యం కాదని.. అ క్కడున్న భద్రతా సంస్థలు, మతపరమైన సంస్థల్లో ఆయనకు బలమైన సపోర్ట్ ఉందని మరికొందరు వాదిస్తున్నారు.
Follow Us